న్యూఢిల్లీ: దేశంలో పరోక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసికంలో పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగి రూ.2.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసిక పరోక్ష పన్ను వసూళ్లు రూ.1.53 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది జూలైలో రూ.40,802 కోట్లుగా ఉన్న పరోక్ష పన్ను వసూళ్లు ఈ ఏడాది అదే సమయంలో రూ.56,739 కోట్లకు పెరిగాయి. ఏప్రిల్-జూలై త్రైమాసికంలో ఎక్సైజ్ వసూళ్లు ఏకంగా 75 శాతం పెరిగి రూ.83,454 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే సేవా పన్ను వసూళ్లు 20 శాతం వృద్ధితో రూ.60,925 కోట్లుగా, కస్టమ్స్ సుంకం వసూళ్లు 21 శాతం వృద్ధితో రూ.66,076 కోట్లుగా ఉన్నాయి.