Indirect tax collections
-
అంచనాలను మించిన పరోక్ష పన్నులు
సాక్షి, న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల ఆదాయం సైతం ప్రత్యక్ష పన్నుల మాదిరే అంచనాలను మించి వసూలైంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్ తదితర పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకం ‘కరోనా కాలంలోనూ’ భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో 9.89 లక్షల కోట్ల ఆదాయం పరోక్ష పన్నుల రూపంలో వస్తుందని కేంద్ర ప్రభుత్వం తొలుత అంచనాలు వేసుకోగా.. వాస్తవానికి అంతకుమించి రూ.10.71 లక్షల కోట్లు సమకూరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం గణాంకాలను విడుదల చేసింది. పరోక్ష పన్నుల్లో జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీలు కలసి ఉంటాయి. 2019–20లో పరోక్ష పన్నుల ఆదాయం రూ.9.54 లక్షల కోట్లుగా ఉంది. 2020–21 సంవత్సరానికి తొలుత అధిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సర్కారు.. కరోనాతో వ్యాపారాలు కుదేలవడంతో లక్ష్యాన్ని రూ.9.89 లక్షల కోట్లకు సవరించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ఆర్థిక ఉద్దీపనలకుతోడు.. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాల పెంపుతో పరోక్ష పన్నుల ఆదాయం అంచనాలను మించి వసూలైంది. సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయం 59 శాతం పెరిగి రూ.3.91 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. పన్నుల ఆదాయం వివరంగా.. ► వస్తు సేవల పన్ను (జీఎస్టీ) రూపంలో 2020–21లో రూ.5.48 లక్షల కోట్లు వచ్చింది. 2019–20లో వచ్చిన రూ.5.99 లక్షల కోట్లతో పోలిస్తే 8 శాతం తగ్గింది. ► కస్టమ్స్ రూపంలో రూ.1.32 లక్షల కోట్లు సమకూరింది. 2019–20లో వచ్చిన రూ.1.09 లక్షల కోట్లతో పోలిస్తే 21 శాతం పెరిగింది. ► సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆదాయం రూ.3.91 లక్షల కోట్లుగా ఉంది. 2019–20లో ఆదాయం రూ.2.45 లక్షల కోట్లతో పోలిస్తే 59 శాతం వృద్ధి నమోదైంది. ► ప్రత్యక్ష పన్నుల ఆదాయం (వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్ పన్ను) 2020–21 సవరిం చిన అంచనాలపై 5% వృద్ధితో రూ.9.45 లక్షల కోట్లుగా నమోదవడం తెలిసిందే. ప్రభుత్వ చర్యలతో పురోగతి ‘‘2020–21లో మొదటి ఆరు నెలల్లో కరోనా వల్ల జీఎస్టీ వసూళ్లపై గణనీయమైన ప్రభావం పడింది. ద్వితీయ ఆరు నెలల్లో జీఎస్టీ వసూళ్లు మంచి వృద్ధిని చూపాయి. ప్రతీ నెలలోనూ జీఎస్టీ ఆదాయం రూ.లక్ష కోట్లుపైనే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల జీఎస్టీ పన్ను చెల్లింపులు మెరుగుపడ్డాయి’’ అని కేంద్ర ఆర్థిక శాఖా పేర్కొంది. కరోనా రెండో విడత ప్రభావంపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చైర్మన్ అజిత్ కుమార్ స్పందిస్తూ.. ఆదాయం ఏప్రిల్‌లోనూ బలంగా నమోదవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. -
భారీగా పెరిగిన పరోక్ష పన్నుల వసూళ్లు
ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో 36 శాతం అప్ న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్) పరోక్ష పన్ను వసూళ్లు 36% పెరిగాయి. విలువ రూపంలో ఈ వసూళ్లు రూ.3.24 లక్షల కోట్లు. గత ఆర్థిక సంవత్సర ఇదే కాలంలో ఈ వసూళ్ల విలువ రూ.2.38 లక్షల కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పరోక్ష పన్ను వసూళ్లలో 19% వృద్ధిని (మొత్తంగా రూ.6.47 లక్షల కోట్లు) సాధించాలని బడ్జెట్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే గడచిన ఆరు నెలల్లో ఈ వసూళ్లలో వృద్ధి రేటు లక్ష్యానికన్నా రెట్టింపుకావడం ప్రభుత్వానికి ఉత్సాహాన్ని అందిస్తోంది. ఆర్థిక మంత్రిత్వశాఖ శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్త్తే... మొత్తంలో ఎక్సైజ్ సుంకం వసూళ్లు భారీగా ఉన్నాయి. ఈ వసూళ్లు 70 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నాయి. రూ.74 వేల కోట్ల నుంచి రూ. 1.25 లక్షల కోట్లకు ఎగశాయి. డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాల పెంపు, మోటార్ వాహనాలపై పన్ను మినహాయింపుల ఉపసంహరణ, క్లీన్ ఎనర్జీ సెస్ పెంపు, జూన్‌లో సేవల పన్ను రేటు పెరుగుదల వంటి అంశాలు ఈ విభాగంలో భారీ వసూళ్లకు కారణం. -
36 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: దేశంలో పరోక్ష పన్ను వసూళ్లు ఏప్రిల్-ఆగస్ట్ మధ్యకాలంలో 36.5 శాతం వృద్ధితో రూ.2.63 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో ఎక్సైజ్ పన్ను వాటా రూ. 1.02 లక్షల కోట్లుగా, కస్టమ్స్ పన్ను వాటా రూ.85,138 కోట్లుగా, సేవా పన్ను వాటా రూ. 75,006 కోట్లుగా ఉంది. జీడీపీ, పరోక్ష పన్ను గణాంకాలు వంటి అంశాలు దేశ ఆర్థిక పరిస్థితుల మెరుగుదలను సూచిస్తున్నాయని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ తె లిపారు. పన్ను వసూళ్ల పెరుగుదల జీడీపీ వృద్ధిని ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు. -
37 శాతం పెరిగిన పరోక్ష పన్ను వసూళ్లు
న్యూఢిల్లీ: దేశంలో పరోక్ష పన్ను వసూళ్లు పెరిగాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసికంలో పరోక్ష పన్ను వసూళ్లు 37 శాతం పెరిగి రూ.2.1 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూలై త్రైమాసిక పరోక్ష పన్ను వసూళ్లు రూ.1.53 లక్షల కోట్లుగా ఉన్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. గతేడాది జూలైలో రూ.40,802 కోట్లుగా ఉన్న పరోక్ష పన్ను వసూళ్లు ఈ ఏడాది అదే సమయంలో రూ.56,739 కోట్లకు పెరిగాయి. ఏప్రిల్-జూలై త్రైమాసికంలో ఎక్సైజ్ వసూళ్లు ఏకంగా 75 శాతం పెరిగి రూ.83,454 కోట్లుగా నమోదయ్యాయి. అలాగే సేవా పన్ను వసూళ్లు 20 శాతం వృద్ధితో రూ.60,925 కోట్లుగా, కస్టమ్స్ సుంకం వసూళ్లు 21 శాతం వృద్ధితో రూ.66,076 కోట్లుగా ఉన్నాయి. -
ప్రత్యక్ష పన్ను వసూళ్లు 11.38 శాతం అప్
న్యూఢిల్లీ: ప్రత్యక్ష పన్ను వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) ఏప్రిల్- జనవరి మధ్య 5.78 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చుకుంటే (రూ.5.19 లక్షల కోట్లు) ఈ మొత్తం 11.39 శాతం అధికం. కాగా నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు మాత్రం 10 నెలల కాలంలో 6.21 శాతం వృద్ధితో రూ.4.74 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. స్థూల పన్ను వసూళ్లు భారీగా ఉన్నప్పటికీ, అధిక రిఫండ్స్ వల్ల నికర వసూళ్లు తగ్గిపోయాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు 24.14 శాతం వృద్ధితో రూ.13.6 లక్షల కోట్ల వసూళ్లు లక్ష్యం.