అంచనాలను మించిన పరోక్ష పన్నులు | Indirect Tax Collection Beats Revised Estimates for FY 2020-21 Up 12pc | Sakshi
Sakshi News home page

అంచనాలను మించిన పరోక్ష పన్నులు

Published Wed, Apr 14 2021 8:34 AM | Last Updated on Wed, Apr 14 2021 9:35 AM

Indirect Tax Collection Beats Revised Estimates for FY 2020-21 Up 12pc - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పరోక్ష పన్నుల ఆదాయం సైతం ప్రత్యక్ష పన్నుల మాదిరే అంచనాలను మించి వసూలైంది. ముఖ్యంగా పెట్రోల్, డీజిల్‌ తదితర పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం ‘కరోనా కాలంలోనూ’ భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. దీంతో 2020–21 ఆర్థిక సంవత్సరంలో 9.89 లక్షల కోట్ల ఆదాయం పరోక్ష పన్నుల రూపంలో వస్తుందని కేంద్ర ప్రభుత్వం తొలుత అంచనాలు వేసుకోగా.. వాస్తవానికి అంతకుమించి రూ.10.71 లక్షల కోట్లు సమకూరింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం గణాంకాలను విడుదల చేసింది. పరోక్ష పన్నుల్లో జీఎస్‌టీ, కస్టమ్స్, ఎక్సైజ్‌ డ్యూటీలు కలసి ఉంటాయి. 2019–20లో పరోక్ష పన్నుల ఆదాయం రూ.9.54 లక్షల కోట్లుగా ఉంది. 2020–21 సంవత్సరానికి తొలుత అధిక లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సర్కారు.. కరోనాతో వ్యాపారాలు కుదేలవడంతో లక్ష్యాన్ని రూ.9.89 లక్షల కోట్లకు సవరించింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పలు ఆర్థిక ఉద్దీపనలకుతోడు.. పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాల పెంపుతో పరోక్ష పన్నుల ఆదాయం అంచనాలను మించి వసూలైంది. సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ రూపంలో వచ్చే ఆదాయం 59 శాతం పెరిగి రూ.3.91 లక్షల కోట్లుగా ఉండడం గమనార్హం. 
పన్నుల ఆదాయం వివరంగా.. 
► వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రూపంలో 2020–21లో రూ.5.48 లక్షల కోట్లు వచ్చింది. 2019–20లో వచ్చిన రూ.5.99 లక్షల కోట్లతో పోలిస్తే 8 శాతం తగ్గింది. 
► కస్టమ్స్‌ రూపంలో రూ.1.32 లక్షల కోట్లు సమకూరింది. 2019–20లో వచ్చిన రూ.1.09 లక్షల కోట్లతో పోలిస్తే 21 శాతం పెరిగింది. 
► సెంట్రల్‌ ఎక్సైజ్‌ అండ్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ ఆదాయం రూ.3.91 లక్షల కోట్లుగా ఉంది. 2019–20లో ఆదాయం రూ.2.45 లక్షల కోట్లతో పోలిస్తే 59 శాతం వృద్ధి నమోదైంది. 
► ప్రత్యక్ష పన్నుల ఆదాయం (వ్యక్తిగత ఆదాయపన్ను, కార్పొరేట్‌ పన్ను) 2020–21 సవరిం చిన అంచనాలపై 5% వృద్ధితో రూ.9.45 లక్షల కోట్లుగా నమోదవడం తెలిసిందే.  

ప్రభుత్వ చర్యలతో పురోగతి  
‘‘2020–21లో మొదటి ఆరు నెలల్లో కరోనా వల్ల జీఎస్‌టీ వసూళ్లపై గణనీయమైన ప్రభావం పడింది. ద్వితీయ ఆరు నెలల్లో జీఎస్‌టీ వసూళ్లు మంచి వృద్ధిని చూపాయి. ప్రతీ నెలలోనూ జీఎస్‌టీ ఆదాయం రూ.లక్ష కోట్లుపైనే వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల జీఎస్‌టీ పన్ను చెల్లింపులు మెరుగుపడ్డాయి’’ అని కేంద్ర ఆర్థిక శాఖా పేర్కొంది. కరోనా రెండో విడత ప్రభావంపై మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) చైర్మన్‌ అజిత్‌ కుమార్‌ స్పందిస్తూ.. ఆదాయం ఏప్రిల్‌లోనూ బలంగా నమోదవుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement