న్యూఢిల్లీ: దేశ పారిశ్రామికోత్పత్తి అక్టోబర్ మాసంలో వేగాన్ని పుంజుకుంది. మైనింగ్, విద్యుత్, తయారీ రంగాల తోడ్పాటుతో గడిచిన 11 నెలల కాలంలో అత్యధికంగా 8.1 శాతం వృద్ధి నమోదు చేసింది. పారిశ్రామిక తయారీ సూచీ (ఐఐపీ) అన్నది క్రితం ఏడాది (2017) అక్టోబర్‌లో కేవలం 1.8 శాతమే వృద్ధిని నమోదు చేసింది. ఈ మేరకు వివరాలను కేంద్ర గణాంక కార్యాలయం బుధవారం విడుదల చేసింది. 2017 నవంబర్లో ఐఐపీ వృద్ధి గరిష్టంగా 8.5 శాతం కాగా... ఆ తరవాత ఈ ఏడాది అక్టోబర్లో నమోదైన 8.1 శాతమే గరిష్ఠం. ఈ ఏడాది సెప్టెంబర్ నెలకు సంబంధించి వృద్ధి 4.5 శాతంగా గతంలో విడుదల చేసిన తాత్కాలిక అంచనాల్లో ఎలాంటి మార్పూ లేదు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు చూసుకుంటే ఐఐపీ వృద్ధి 5.6 శాతం మేర నమోదైంది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో నమోదైన 2.5 శాతం వృద్ధితో పోల్చి చూస్తే గాడినపడినట్టు తెలుస్తోంది.
రంగాల వారీగా...
∙ఐఐపీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగం అక్టోబర్ మాసంలో 7.9 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే మాసంలో ఉన్న వృద్ధి 2 శాతమే.
∙మైనింగ్ రంగంలో వృద్ధి 7 శాతంగా ఉంది. 2017 అక్టోబర్లో ఇది 0.2 శాతం మాత్రమే.
∙విద్యుత్ రంగం 10.8 శాతం వృద్ధి చెందింది. క్రితం ఏడాది ఇదే మాసంలో ఈ రంగంలో నమోదైన వృద్ధి 3.2 శాతంతో పోలిస్తే మూడు రెట్లు పెరిగింది.
∙క్యాపిటల్ గూడ్స్ రంగం 16.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ రంగంలో నమోదైన వృద్ధి 3.5%గా ఉంది.
∙కన్జ్యూమర్ డ్యురబుల్స్ రంగంలో వృద్ధి 17.6 శాతం కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న వృద్ధి 9 శాతం.
∙తయారీ రంగంలో 23 రకాల పరిశ్రమలకు గాను 21 పరిశ్రమలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి.
17 నెలల కనిష్టానికి ద్రవ్యోల్బణం
నవంబర్‌లో 2.33 శాతంగా నమోదు
న్యూఢిల్లీ: రిటైల్ ద్రవ్యోల్బణం మరింత కిందకు దిగొచ్చింది. కూరగాయలు, గుడ్లు, పప్పు ధాన్యాల ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. దీంతో నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 2.33 శాతానికి పడిపోయింది. ఇది 17 నెలల్లోనే అత్యంత తక్కువ ద్రవ్యోల్బణం. వినియోగ ధరల ఆధారితంగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని లెక్కించే విషయం తెలిసిందే. ఇది అక్టోబర్ నెలలో 3.31 శాతంగా ఉందన్న గత అంచనాలను, తాజాగా 3.38 శాతానికి ప్రభుత్వం సవరించింది. 2017 నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 4.88 శాతంగా ఉండడం గమనార్హం. ఆర్‌బీఐ విధానపరమైన నిర్ణయాల్లో రిటైల్ ద్రవ్యోల్బణా న్ని కూడా పరిగణనలోకి తీసుకునే విషయం తెలిసిందే. 2017 జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 1.46%గా నమోదైంది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్లో 2.61% ప్రతికూలంగా ఉంది. కూరగాయల ధరలు అక్టోబర్‌లో మైనస్ 8.06%(డిఫ్లేషన్)గా ఉంటే, నవంబర్‌లో ఇంకాస్త తగ్గి మైనస్ 15.59%కి చేరాయి. పప్పు ధాన్యాల డిఫ్లేషన్ రేటు అక్టోబర్‌లో మైనస్ 10.28% నుంచి నవంబర్‌లో మైనస్ 9.22%కి రికవరీ అయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment