ద్రవ్యోల్బణం ఊరట – పరిశ్రమల ఉసూరు!
► మార్చిలో పారిశ్రామిక వృద్ధి కేవలం 2.7 శాతం
► కొత్తగా 2011–12 బేస్ ఇయర్‌తో గణాంకాలు
► టోకు ద్రవ్యోల్బణ గణాంకాల బేస్ ఇయర్‌నూ 2011–12గా సవరింపు
► ఏప్రిల్‌లో టోకు ధరలు 3.85 శాతమే
► ఇదే నెల రిటైల్ ద్రవ్యోల్బణం 2.99 శాతం
► రెపో రేటు తగ్గింపునకు మళ్లీ డిమాండ్
న్యూఢిల్లీ: దేశ కీలక స్థూల ఆర్థిక గణాంకాలను కేంద్రం శుక్రవారం విడుదల చేసింది. ఇందులో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) లెక్కలు మార్చి నెలవి కాగా, టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం, వినియోగ ధరల సూచీ ఆధారిత (రిటైల్) ద్రవ్యోల్బణం అంకెలు ఏప్రిల్‌కు సంబంధించినవి. ఐఐపీ, టోకు ద్రవ్యోల్బణాలకు సంబంధించి బేస్ ఇయర్‌ను మార్చడం గణాంకాల్లో ప్రత్యేకాంశం. ఇంతక్రితం ఈ రెండు సూచీలకూ బేస్ ఇయర్‌గా 2004–05గా ఉండేది.
ఈ బేస్ ఇయర్ తాజాగా 2011–12గా మారింది. రిటైల్ ద్రవ్యోల్బణానికి ఇప్పటికే 2011–12 బేస్ ఇయర్‌గా అమలవుతోంది. ఇక మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి అతి తక్కువగా 2.7 శాతంగా నమోదయితే, ఏప్రిల్‌లో టోకు, రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కేంద్రం, ఆర్‌బీఐ లక్ష్యాలకు అనుగుణంగా వరుసగా 3.85 శాతం, 2.99 శాతంగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణం తక్కువగా ఉండడం, పారిశ్రామిక వృద్ది తగ్గడంతో మరోమారు రెపో రేటు (ప్రస్తుతం 6.25 శాతం)ను తగ్గించాలని ఆర్‌బీఐని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. మూడు విభాగాలకు సంబంధించి తాజా గణాంకాల్లో ముఖ్యాంశాలను చూస్తే...
పారిశ్రామిక రంగానికి ‘తయారీ’ దెబ్బ
► మొత్తం సూచీలో దాదాపు 75 శాతం వాటా ఉన్న తయారీ రంగం పేలవ పనితీరు మార్చి నెల ఐఐపీపై ప్రతికూల ప్రభావం చూపింది. 2016 మార్చిలో ఐఐపీ వృద్ధిరేటు 5.5 శాతంగా నమోదయితే ఇప్పుడు 2.7 శాతానికి పడిపోయింది.
► మార్చిలో తయారీ రంగం వృద్ధి 1.2 శాతానికి (2016 ఇదే నెలతో పోల్చి) పడిపోయింది. 2016 ఇదే నెలలో ఈ విభాగంలో వృద్ధి రేటు 5 శాతంగా ఉంది.
► విద్యుత్ ఉత్పత్తి వృద్ధి 11.9% నుంచి 6.2%నికి Sతగ్గింది.
► మైనింగ్ రంగంలో వృద్ధి మాత్రం 4.7 శాతం నుంచి 9.7 శాతానికి పెరిగింది.
వార్షికంగా చూస్తే...: 2016–17 మొత్తంగా చూస్తే పారిశ్రామిక ఉత్పత్తి 3.4 శాతం నుంచి (2015–16లో) 5 శాతానికి పెరిగింది. వార్షికంగా తయారీ రంగం వృద్ధి 3 శాతం నుంచి 4.9 శాతానికి పెరిగింది. విద్యుత్ రంగం ఉత్పత్తి స్వల్పంగా 5.7 శాతం నుంచి 5.8 శాతానికి ఎగసింది. వార్షికంగా మైనింగ్ రంగం వృద్ధి రేటు 4.3 శాతం నుంచి 5.3 శాతానికి చేరింది.
కొత్త వస్తువుల్లో ఇవి..: కొత్త సిరిస్‌లో ఒక్క తయారీ రంగంలోనే 809 వస్తువులు ఉన్నాయి. ఇంతక్రితం ఈ సంఖ్య 620గా ఉండేది. 149 కొత్త ప్రొడక్టుల్లో స్టెరాయిడ్స్, సిమెంట్ క్లింకర్స్, మెడికల్ లేదా సర్జికల్ వస్తువులు వంటివి ఉన్నాయి.
రిటైల్ ధరలు తగ్గాయ్...
ఇక వినియోగ ధరల ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 3.89 శాతం ఉంటే, ఇది ఏప్రిల్‌లో 2.99 శాతానికి తగ్గింది. పప్పులు సంబంధిత ఉత్పత్తుల ధరలు భారీగా 15.94 శాతం మేర తగ్గాయి. కూరగాయల ధరల తగ్గుదల 8.59 శాతంగా ఉంది. ఇంధనం, లైట్ విభాగంలో ద్రవ్యోల్బణం 6.13 శాతంగా నమోదయ్యింది. పండ్ల ధరలు 3.78 శాతం ఎగశాయి. మొత్తంగా చూస్తే ఆహార ద్రవ్యోల్బణం మార్చిలో 1.93 శాతం ఉంటే, ఇది ఏప్రిల్‌లో 0.61 శాతంగా నమోదయ్యింది.
టోకు ధరలు... 4 నెలల కనిష్టం...
టోకు ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో 3.85 శాతంగా నమోదయ్యింది. అంటే 2016 ఏప్రిల్‌తో పోల్చితే 2017 ఏప్రిల్‌లో టోకు బాస్కెట్ ధరలు మొత్తంగా 3.85 శాతం పెరిగాయన్నమాట. ఇంత తక్కువ స్థాయిలో రేటు నాలుగు నెలల్లో ఇదే తొలిసారి.
ముఖ్యాంశాలు చూస్తే...
♦ మార్చిలో ఈ రేటు 5.29 శాతంగా ఉంది.
♦ టోకు ఫుడ్ ఆర్టికల్స్‌లో రేటు మార్చిలో 3.82 శాతం ఉంటే, ఇది ఏప్రిల్‌లో 1.16 శాతానికి తగ్గింది. పప్పు దినుసుల ధరలు 13.64 శాతం, కూరగాయలు (7.78 శాతం), ఆలూ (40.97 శాతం), ఉల్లి (12.47శాతం) ధరలు తగ్గడం (వార్షికంగా) దీనికి కారణం.
♦ ఇక ఇంధనం, విద్యుత్ విభాగంలో రేటు 18.52 శాతంగా నమోదయితే, తయారీ రంగంలో ఈ రేటు 2.66 శాతంగా ఉంది.
199 కొత్త ఐటమ్స్‌లో కాకర, దోస, టిష్యూ పేపర్
కొత్త ఇండెక్స్ బాక్స్‌లో 697 వస్తువులు చేరాయి. ఇందులో ప్రైమరీ ఆర్టికల్స్‌లో 117 వస్తువులు ఉండగా, ఇంధన విభాగంలో 16 ఐటమ్స్‌ను పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. ఇక మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో 564 ఐటమ్స్ ఉన్నాయి. డబ్ల్యూపీఐ కొత్త సిరీస్‌లో 199 కొత్తగా వచ్చి చేరాయి. ఇందులో టిష్యూ పేపర్, గ్యాస్. కన్వేయర్ బెల్ట్, రబ్బర్ థ్రెడ్, స్టీల్ కేబుల్స్, దోసకాయ, కాకరకాయ, పనస ఉన్నాయి. తొలగించిన వస్తువుల్లో వీడియో సీడీ ప్లేయర్, పటికబెల్లం, లైట్ డీజిల్ ఆయిల్ వంటివి ఉన్నాయి. ఇక గణాంకాలకు తీసుకునే కోట్స్ పెరిగాయి.
బేస్ ఇయర్ మార్పు ఎందుకు?
గణాంకాల్లో మరింత స్పష్టత, పారదర్శకత, కాలానికి అనుగుణంగా సరైన గణాంకాలను వెలువరించడం బేస్ ఇయర్ మార్పు లక్ష్యం. ఉదాహరణకు ఇప్పటి వరకూ 2004–05 మూల సంవత్సరంగా తీసుకుని ఒక స్థిర ధరల వద్ద అటు తర్వాత సంవత్సరాల్లో ధరల్లో మార్పును శాతాల్లో పేర్కొంటారు. అయితే బేస్ ఇయర్¯ మార్పు వల్ల గణాంకాల్లో మరింత స్పష్టత వస్తుంది.