న్యూఢిల్లీ: పారిశ్రామిక రంగం నవంబర్‌లో పేలవ పనితీరును ప్రదర్శించింది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) ఈ నెలల్లో కేవలం 0.5 శాతంగా (2017 ఇదే నెలతో పోల్చి) నమోదయ్యింది. సూచీలోని తయారీ, వినియోగ రంగాల్లో అసలు వృద్ధి నమోదుకాకపోగా, క్షీణ రేటు నమోదయ్యింది. భారీ యంత్ర పరికరాల డిమాండ్‌ను సూచించే క్యాపిటల్ గూడ్స్‌లో కూడా ఇదే ధోరణి నెలకొంది. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) శుక్రవారం విడుదల చేసిన నవంబర్ పారిశ్రామిక ఉత్పత్తి లెక్కల్లో ముఖ్యమైన అంశాలు... మొత్తం సూచీలో 77.63 శాతం వాటా కలిగిన తయారీ రంగంలో నవంబర్‌లో వృద్ధిలేకపోగా –0.4 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2017 ఇదే నెలలో ఈ రేటు 10.4 శాతం. ఈ విభాగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 10తప్ప మిగిలినవి ప్రతికూల వృద్ధిరేటును నమోదుచేసుకున్నాయి. డిమాండ్‌కు ప్రతిబింబమైన క్యాపిటల్ గూడ్స్ విభాగంలో కూడా వృద్ధిలేకపోగా –3.4 శాతం క్షీణత నమోదయ్యింది.
2017 ఇదే నెలలో ఈ రంగం వృద్ది రేటు 3.7 శాతం. కన్జూమర్ డ్యూరబుల్స్ రంగంలో కూడా 3.1 శాతం వృద్ధి రేటు 0.9 శాతం క్షీణతలోకి జారింది. కన్జూమర్ నాన్ డ్యూరబుల్స్ విషయంలో కూడా 23.7 శాతం భారీ వృద్ధిరేటు 0.6% క్షీణతలోకి పడిపోవడం గమనార్హం. మైనింగ్ వృద్ధి రేటు 1.4% నుంచి 2.7 శాతానికి పెరిగింది. విద్యుత్ రంగంలో ఉత్పత్తి 3.9% నుంచి 5.1%కి ఎగసింది. 2017 నవంబర్‌లో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ది రేటు 8.5%. ప్రస్తుతం నమోదయిన తక్కువ స్థాయి వృద్ధి రేటు 2017 జూన్ తరువాత ఎప్పుడూ నమోదుకాలేదు. ఆ నెల్లో పారిశ్రామిక రంగంలో అసలు వృద్ధిలేకపోగా –0.3 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 అక్టోబర్‌లో వృద్ధిరేటును 8.1 శాతం నుంచి 8.4 శాతానికి పెంచడం విశేషం.
ఏప్రిల్ నుంచి నవంబర్ వరకూ పర్లేదు...
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య పారిశ్రామిక ఉత్పత్తి (2017 ఇదే కాలంతో పోల్చి) 3.2 శాతం నుంచి 5 శాతానికి పెరిగింది. ఆర్థిక సంవత్సరం మొత్తంగా 5 నుంచి 6 శాతం శ్రేణిలో ఈ రేటు ఉంటుందని అంచనా
Comments
Please login to add a commentAdd a comment