
ఐడియాఫోర్జ్‌లో ఇన్ఫోసిస్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్, డ్రోన్‌లకు సంబంధించిన సొల్యూషన్‌లను అభివృద్ధి చేసే భారత స్టార్టప్, ఐడియా ఫోర్జ్‌లో పెట్టుబడులు పెట్టింది. ఈ పెట్టుబడులకు వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి ఆమోదం పొందాల్సి ఉన్నట్టు ఇన్ఫోసిన్ తెలిపింది. ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేశారన్నది మాత్రం వెల్లడించలేదు. కొన్నేళ్లుగా ఇన్ఫోసిస్ తన ఇన్నోవేషన్ ఫండ్ ద్వారా పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెడుతోంది. ఐడియాఫోర్జ్ రూపొందించే డ్రోన్‌లను భారత సైనిక దళాలు వాడుతున్నాయి. నిఘా, భారీ సమావేశాలు జరిగేటప్పుడు, రెస్క్యూ కార్యకలాపాలకు ఈ డ్రోన్‌లను భారత సైన్యం ఉపయోగిస్తోంది.
విస్తరించడానికి సహకారం!!
ఐడియాఫోర్జ్ అత్యున్నత పనితీరు గల డ్రోన్‌లను భారత్‌లోనే డిజైన్ చేసి తయారు చేస్తోందని, వీటిని పారిశ్రామికంగా వినియోగించడానికి భారీగా అవకాశాలున్నాయని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రితిక సూరి చెప్పారు. కాగా ఇన్ఫీ తమ సంస్థలో పెట్టుబడులు పెట్టడం సంతోషకరమని ఐడియాఫోర్జ్ వ్యవస్థాపకుల్లో ఒకరు,, సీఈఓ అంకిత్ మెహతా చెప్పారు. పారిశ్రామికంగా విస్తరించడానికి ఇన్ఫోసిస్ సహకారం కీలకం కానున్నదన్నారు. 2013లో ఇన్ఫోసిస్ ఇన్నోవేషన్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. 2015లో ఈ ఫండ్‌ను 50 కోట్ల డాలర్లకు పెంచి పరిపుష్టం చేసింది. కృత్రిమ మేధస్సు వంటి వినూత్నమైన టెక్నాలజీలను అభివృద్ధి చేసే స్టార్టప్‌లకు ఈ ఫండ్ రుణాలందిస్తోంది.