
ఇన్ఫీలో మళ్లీ జీతాల రగడ!
⇒ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగా వేతనాల పెంపు ఘోరం
⇒ కింది స్థాయి ఉద్యోగులు త్యాగాలు చేయాలా...?
⇒ ఇలా అయితే వారిలో విశ్వాసం సన్నగిల్లుతుంది
⇒ ఇన్ఫోసిస్ విధానాలను తప్పుబట్టిన నారాయణమూర్తి, బాలకృష్ణన్
⇒ మరోసారి వ్యవస్థాపకులకు, యాజమన్యానికి మధ్య రాజుకున్న వివాదం
బెంగళూరు: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, కంపెనీ యాజమాన్యానికి మధ్య మరోసారి వివాదం రగులుకుంది. సీవోవో ప్రవీణ్‌రావు పారితోషికాన్ని భారీగా పెంచుతూ చేసిన ప్రతిపాదనకు కంపెనీ వాటాదారులు తాజాగా ఆమోదం తెలిపారు. దీంతో మరోసారి ఈ అంశంపై మాటల యుద్ధం మొదలైంది. వేతనాల విషయంలో కింది స్థాయి ఉద్యోగులను త్యాగాలు చేయాలని కోరుతూ అదే సమయంలో ఉన్నత ఉద్యోగులకు పారితోషికాలు భారీగా పెంచడం ఏవిధంగా సమంజసమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులైన ఎన్‌ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు.
చాలా వరకు కింది స్థాయి ఉద్యోగులకు 6 నుంచి 8 శాతం మేర వేతనాలు పెంచుతూ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు 60 నుంచి 70 శాతం పెంచడం అనైతికమన్నారు. దీనివల్ల కంపెనీ నాయకత్వం, బోర్డుపై కింది స్థాయి ఉద్యోగుల్లో నమ్మకం పోతుందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఎఫ్‌వో వి.బాలకృష్ణన్ కూడా నారాయణమూర్తికి మద్దతుగా స్వరం కలిపారు. కింది స్థాయి ఉద్యోగులను త్యాగాలు చేయాలని కోరుతూ అదే సమయంలో పై స్థాయి ఉద్యోగుల వేతనాలను 40–50 శాతం పెంచడం అన్నది ఏ యాజమాన్యానికైనా ఘోరమైన విషయమని విమర్శించారు.
ఇన్ఫోసిస్‌లో పాలనాపరంగా అత్యున్నత ప్రమాణాలు, విలువలతో ఏర్పాటు చేసిన వ్యవస్థను ప్రస్తుత నాయకత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఇన్ఫోసిస్ చైర్మన్ ఆర్.శేషసాయి తన బాధ్యతల నుంచి వైదొలగాలని, ప్రమాణాల పరిరక్షణకు గాను బోర్డును తిరిగి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ప్రవీణ్‌రావుకు వార్షికంగా అన్ని రకాల పరిహారాలు కలిపి రూ.8.5 కోట్లు చెల్లించాలని ఇన్ఫోసిస్ బోర్డు గతంలో నిర్ణయం తీసుకుంది. కాగా, కంపెనీ బోర్డుకు, వ్యవస్థాపకుల మధ్య మాటల వివాదం ఇదే మొదటి సారి కాదు. రెండు నెలల క్రితం కంపెనీ సీఈవో విశాల్ సిక్కాతోపాటు నాడు ఉద్యోగులుగా ఉన్న రాజీవ్ బన్సాల్, డేవిడ్ కెన్నడీలకు భారీగా వేతనాలను పెంచడంతో అప్పుడు కూడా కంపెనీ వ్యవస్థాపకులు తప్పుబట్టారు. కంపెనీలో ప్రమోటర్లకు 13 శాతం వాటా ఉంది.
నిజమే.. సహేతుకంగా లేదు
నారాయణమూర్తి అభ్యంతరాలను ఇన్ఫోసిస్ బోర్డు మాజీ డైరెక్టర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ కూడా సమర్థించారు. సీవోవో యూబీ ప్రవీణ్‌రావు వేతన పెంపు సహేతుకంగా లేదన్నారు. వేతన పెంపు అద్భుతంగా ఉందని, కానీ ఆయన పనితీరు మాత్రం అలా లేదన్నారు. ఇన్ఫోసిస్ బోర్డు తప్పుదోవ పట్టిందని, గతంలో సీఈవో విశాల్ సిక్కాకు అసమంజసంగా పారితోషికం పెంచారని, దీనివల్ల ఇతర ఎగ్జిక్యూటివ్‌లు సైతం అధిక వేతనాన్ని ఆశించారని పేర్కొన్నారు. మూర్తితో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని, పారితోషికాలకు సంబంధించి మనకంటూ విధానాలు ఉన్నాయని, అమెరికా విధానాలను అనుసరించరాదని, ఇన్ఫోసిస్ అమెరికా కంపెనీ కాదన్నారు. ఐటీ పరిశ్రమలో ప్రారంభ స్థాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల వేతనాలు గత ఏడేళ్లుగా పెరగలేదని, ఈ దృష్ట్యా ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌ల వేతనాలను పెంచుకోవడం పూర్తిగా తప్పుడు చర్యగా పేర్కొన్నారు.
పెంపు సరైనదే: ఇన్ఫోసిస్
కంపెనీ సీవోవో ప్రవీణ్‌రావుకు పారితోషికాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ సమర్థించుకుంది. వాస్తవిక పెంపు 1.4 శాతమేనని పేర్కొంది. ‘‘నగదు విధానంలో చెల్లించే మొత్తం రూ.5.2 కోట్ల నుంచి 4.6 కోట్లకు తగ్గింది. అదే సమయంలో పనితీరు ఆధారితంగా చెల్లించే మొత్తం 45 శాతం నుంచి 63 శాతానికి పెరిగింది. రావుకు కేటాయించిన స్టాక్స్ (ఈఎస్‌వో)ను పొందేందుకు వేచి ఉండే నాలుగేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెంపు కేవలం 1.4 శాతంగానే ఉంటుంది’’ అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యలను ఫీడ్‌బ్యాక్‌గా తీసుకుంటామని, కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా భాగస్వాములతో కలసి పనిచేస్తామని తెలిపింది.