అంచనాలు మించిన ఇన్ఫీ | Infosys Q2 profit rises 12%, tweaks FY16 $ revenue guidance | Sakshi
Sakshi News home page

అంచనాలు మించిన ఇన్ఫీ

Published Tue, Oct 13 2015 12:07 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

అంచనాలు మించిన ఇన్ఫీ

అంచనాలు మించిన ఇన్ఫీ

దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్.. అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలతో ఆకట్టుకుంది. మరోపక్క, కరెన్సీ ఒడిదుడుకుల కారణంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి డాలరు రూపంలో ఆదాయ అంచనా(గెడైన్స్)ను తగ్గించింది. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్(సీఎఫ్‌ఓ) రాజీవ్ బన్సల్ కంపెనీకి గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించడం ఈసారి ఫలితాల్లో ఆశ్చర్యకరమైన అంశం.
 
క్యూ2లో రూ.3,398 కోట్ల నికర లాభం
* వార్షికంగా 9.8%... త్రైమాసికంగా 12% అప్
* మొత్తం ఆదాయం రూ.15,635 కోట్లు;
* వార్షికంగా 17%.. త్రైమాసికంగా 8.9% వృద్ధి
* డాలర్ ఆదాయ గెడైన్స్ తగ్గింపు...
* సీఎఫ్‌ఓ రాజీవ్ బన్సల్ రాజీనామా...
* ఒక్కో షేరుకి రూ.10 మధ్యంతర డివిడెండ్...
బెంగళూరు: ఆకర్షణీయమైన ఫలితాలతో ఇన్ఫీ బోణీ చేసింది. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికం(2015-16, క్యూ2)లో రూ.3,398 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంతో నమోదైన రూ.3,090 కోట్ల లాభంతో పోలిస్తే వార్షిక ప్రాతిపదికన 9.8 % వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం కూడా 17% దూసుకెళ్లి రూ.13,342 కోట్ల నుంచి రూ.15,635 కోట్లకు ఎగబాకింది.

ప్రధానంగా పటిష్టమైన ఆదాయ వృద్ధి, నిర్వహణ పనితీరు క్యూ2లో కంపెనీ మెరుగైన రాబడులకు దోహదం చేసింది. కాగా, డాలరు రూపంలో సెప్టెంబర్ క్వార్టర్‌కు ఇన్ఫీ ఆదాయం 6 శాతం(స్థిర కరెన్సీ ప్రాతిపదికన 6.9 శాతం వృద్ధి) ఎగబాకి 2.392 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గడిచిన 16 క్వార్టర్లలో ఇదే అత్యధిక వృద్ధి కావడం గమనార్హం. ఇక మార్కెట్ విశ్లేషకులు సగటున క్యూ2లో కంపెనీ ఆదాయం  రూ.15,210 కోట్లుగా, లాభం రూ.3,244 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు.

సీక్వెన్షియల్‌గా ఇలా: ఈ ఏడాది జూన్ క్వార్టర్(క్యూ1)లో రూ.3,030 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్ ప్రాతిపదికన క్యూ2లో నికర లాభం 12.1% ఎగబాకింది. మొత్తం ఆదాయం కూడా రూ.14,354 కోట్లతో పోలిస్తే 8.9% వృద్ధి చెందింది.
 
గెడైన్స్ అటూఇటూ...
డాలరు రూపంలో ప్రస్తుత 2015-16 పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ గెడైన్స్‌ను ఇన్ఫోసిస్ తగ్గించింది. గతంలో ఆదాయ వృద్ది 7.2-9.2 శాతంగా అంచనా వేయగా.. దీన్ని ఇప్పుడు 6.4%-8.4 శాతానికి పరిమితం చేసింది. ముఖ్యంగా డాలరుతో వివిధ ప్రధాన కరెన్సీల విలువల్లో తీవ్ర ఒడిదుడుకులే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. అయితే, స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఆదాయ గెడైన్స్‌ను గతంలో పేర్కొన్నట్లుగానే 10-12 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఇన్ఫీ వెల్లడించింది. అయితే, ప్రస్తుత పూర్తి ఏడాదికి రూపాయల్లో ఆదాయ గెడైన్స్(కన్సాలిడేటెడ్)ను కంపెనీ 11.5-13.5 శాతం స్థాయి నుంచి 13.1-15.1 శాతానికి పెంచడం విశేషం. గతేడాది కంపెనీ మొత్తం ఆదాయం రూ.53,319 కోట్లుగా నమోదైంది.
 
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ...
* రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుకి కంపెనీ రూ.10 చొప్పున(200 శాతం) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ ప్రకటించింది.
* క్యూ2లో కంపెనీ మార్జిన్లు 1.53 శాతం వృద్ధి చెంది 25.53 శాతంగా నమోదయ్యాయి.
* సెప్టెంబర్ క్వార్టర్‌లో కంపెనీ మొత్తం 82 కొత్త క్లయింట్లను జతచేసుకుంది. దీంతో మొత్తం క్లయింట్ల సంఖ్య 1,011కు చేరింది. కాగా, కొత్తవాటిలో 7.5 కోట్ల డాలర్ల కాంట్రాక్టులు మూడు, 5 కోట్ల డాలర్ల కాంట్రాక్టు ఒకటి ఉంది.
* 2015 ఇన్సెంటివ్ కాంపెన్సేషన్ ప్లాన్‌ను కూడా కంపెనీ డెరైక్టర్ల బోర్డు ఆమోదించింది. దీని ప్రకారం కంపెనీ మొత్తం షేర్లలో 2 శాతానికి మించకుండా ఎంప్లాయీస్ స్టాక్ ఆప్షన్స్(ఎసాప్స్) కింద ఉద్యోగులకు షేర్లు జారీ చేయాలని నిర్ణయించింది.
* సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ వద్ద రూ.32,099 కోట్ల నగదు, తత్సంబంధ నిల్వలు ఉన్నాయి.

ఫలితాల నేపథ్యంలో సోమవారం బీఎస్‌ఈలో కంపెనీ షేరు
ధర ఒకానొక దశలో 2.9 శాతం ఎగబాకి కొత్త గరిష్ట స్థాయి
అయిన రూ.1,203ను తాకింది. అయితే, చివరకు 3.88 శాతం
క్షీణించి రూ.1,123 వద్ద ముగిసింది.

 
కంపెనీకి మరో టాప్ ఎగ్జిక్యూటివ్ గుడ్‌బై...
ఇన్ఫీలో టాప్ ఎగ్జిక్యూటివ్‌ల వలసల పరంపర కొనసాగుతోంది. తాజాగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఎఫ్‌ఓ రాజీవ్ బన్సల్ రాజీనామా చేసినట్లు ఇన్ఫోసిస్ సోమవారం ఫలితాల సందర్భంగా వెల్లడించింది. ఆయన స్థానంలో ఎం.డి. రంగనాథ్ నేటి(మంగళవారం) నుంచి బాధ్యతలు చేపడుతున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఆయన ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, స్ట్రాటజిక్ ఆపరేషన్స్ హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. 2000వ సంవత్సరంలో రంగనాథ్ ఇన్ఫీలో చేరారు.

అయితే, బన్సల్ ప్రస్తుత పదవి నుంచి వైదొలగుతున్నప్పటికీ.. సీఈఓ సిక్కా, డెరైక్టర్ల బోర్డుకు ఈ ఏడాది చివరివరకూ సలహాదారుగా కొనసాగుతారని కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ‘కంపెనీ వృద్ధికి విశేష సేవలందించిన రాజీవ్‌తో నేను 16 నెలల పాటు కలిసి పనిచేశా. ఆయన అపారమైన నైపుణ్యం గల వ్యక్తి. రాజీనామా చేయాలన్న రాజీవ్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తున్నా.

భవిష్యత్తులో ఆయన చేయబోయే విధుల్లో గొప్ప విజయాలను అందుకోవాలని ఆశిస్తున్నా’ అని సీఈఓ విశాల్ సిక్కా వ్యాఖ్యానించారు. ఇన్ఫీలాంటి గొప్ప సంస్థలో పనిచేయడం తన అదృష్టమని.. అదేవిధంగా సిక్కా సారథ్యంలో కంపెనీ ఎంతో ప్రగతిని సాధించిందని బన్సల్ వ్యాఖ్యానించారు. 2013 తర్వాత ఇన్ఫీని వీడిన మూడో హైప్రొఫైల్ సీఎఫ్‌ఓ రాజీవ్ కావడం గమనార్హం. అంతక్రితం మోహన్‌దాస్ పాయ్, వి. బాలకృష్ణన్‌లు కంపెనీకి గుడ్‌బై చెప్పిన సంగతి తెలిసిందే.
 
 
క్యూ2లో కంపెనీ మెరుగైన పనితీరును నమోదుచేయడం ఆనందంగా ఉంది. డాలరు రూపంలో ఆదాయ గెడైన్స్ తగ్గింపునకు కరెన్సీ ఒడిదుడుకులే కారణం. ప్రస్తుతం మేం అనుసరిస్తున్న ‘న్యూ అండ్ రెన్యూ’ వ్యూహాన్ని మరింత సమర్థంగా అమలు చేయడంపై దృష్టిసారిస్తున్నాం. స్థిర కరెన్సీ ప్రాతిపదికన ఈ ఏడాది 10-12 శాతం ఆదాయ వృద్ధిని సాధించగలమన్న నమ్మకం ఉంది.
- విశాల్ సిక్కా,ఇన్ఫోసిస్ ఎండీ, సీఈఓ

 
ఈ ఏడాది 20 వేల క్యాంపస్ నియామకాలు..
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, కాలేజీ క్యాంపస్‌ల నుంచి మొత్తం 20 వేల మంది గ్యాడ్యుయేట్లను ఫ్రెషర్స్‌గా నియమించుకోనున్నట్లు ఇన్ఫీ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు వెల్లడించారు. వారికి శిక్షణ కాలంలో రూ.3.5 లక్షల వార్షిక ప్యాకేజీని చెల్లిస్తామని, నైపుణ్యాలు, అవసరాలను బట్టి వారిని పూర్తిస్థాయి ఉద్యోగులుగా కంపెనీలో చేర్చుకుంటామని తెలిపారు.  

కాగా, స్థూలంగా జూలై-సెప్టెంబర్ కాలంలో కంపెనీ 17,595 మంది ఉద్యోగులను నియమించుకుంది. 9,142 మంది సిబ్బంది వలసపోవడంతో నికరంగా 8.453 మంది ఉద్యోగులు జతయ్యారు. దీంతో సెప్టెంబర్ చివరినాటికి మొత్తం ఉద్యోగుల సంఖ్య 1,87,976కు చేరింది. ఉద్యోగుల వలసల రేటు(అట్రిషన్) క్యూ2లో 19.9 శాతానికి పెరిగింది. క్యూ1లో ఇది 19.2 శాతంగా ఉంది. అయితే, గతేడాది క్యూ2లో 24.8 శాతం అట్రిషన్ రేటుతో పోలిస్తే భారీగా తగ్గడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement