
పతనానికి బ్రేక్
ఇన్ఫోసిస్‌తో సహా స్వల్పంగా కోలుకున్న సూచీలు
ప్రపంచ సంకేతాల తోడ్పాటు
ముంబై: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ కార్పొరేట్ రభస కారణంగా వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో జరిగిన పతనానికి మంగళవారం బ్రేక్‌పడింది. ఇన్ఫోసిస్‌తో సహా ప్రధాన స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. గత శుక్ర, సోమవారాల్లో కలిపి సెన్సెక్స్ 540 పాయింట్ల వరకూ తగ్గగా, ఇన్ఫోసిస్ షేరు 15 శాతం పడిపోయిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ట్రేడ్‌కావడం, ఇటీవలి క్షీణత తర్వాత కొన్ని బ్లూచిప్ షేర్లను కనిష్టస్థాయిల్లో ఇన్వెస్టర్లు కొనుగోలు చేయడం వంటి అంశాలతో సెన్సెక్స్ 33 పాయింట్లు పెరిగి 31,292 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11 పాయింట్ల పెరుగుదలతో 9,766 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
అయితే బీఎస్‌ఈ 200 కంపెనీలను ఈ వారంలో డీలిస్ట్ చేయనున్నట్లు ప్రకటించడంతో రోజంతా సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెన్సెక్స్ 31,484–31,220 పాయింట్ల గరిష్ట, కనిష్టస్థాయిల మధ్య, నిఫ్టీ 9,828–9,752 పాయింట్ల మధ్య ఒడిదుడుకులకు లోనైనప్పటికీ, దేశీయ సంస్థల కొనుగోళ్ల ప్రభావంతో చివరకు లాభాలతో ముగియగలిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. రెండు రోజులపాటు భారీ పతనాన్ని చవిచూసిన ఇన్ఫోసిస్ షేరు ఇంట్రాడేలో మూడేళ్ల కొత్త కనిష్టస్థాయి రూ.860 వద్దకు క్షీణించిన తర్వాత..షార్ట్ కవరింగ్ ప్రభావంతో స్వల్పంగా కోలుకుని, 0.42 శాతం లాభంతో రూ. 877 వద్ద ముగిసింది.
వరుస క్షీణతల్ని నమోదుచేస్తున్న ఫార్మా షేర్లలో కొనుగోళ్లు జరగడంతో డాక్టర్ రెడ్డీస్ లాబ్ 2.77 శాతం, లుపిన్ 2.08 శాతం, సన్‌ఫార్మా 2.4 శాతం చొప్పున ర్యాలీ జరిపాయి. ఆయిల్ పీఎస్‌యూ షేర్లు బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐఓసీ, ఓఎన్‌జీసీ, గెయిల్‌లు 1–4 శాతం మధ్య ర్యాలీ జరిపాయి. ఐ ఫోన్‌తో సహా యాపిల్ ఉత్పత్తులను మార్కెట్ చేయనున్నట్లు ప్రకటించడంతో హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్ భారీగా 9.5 శాతం పెరిగింది. మరోవైపు ఎన్‌టీపీసీ, హీరో మోటో కార్ప్, బజాజ్ ఆటో, టీసీఎస్‌లు స్వల్ప తగ్గుదలతో ముగిశాయి.