
వడ్డీరేట్లు తగ్గుతాయి: కేంద్రం
రుణ గ్రహీతలకు బ్యాంకులు వడ్డీ రేటును తప్పనిసరిగా తగ్గిస్తాయని...
న్యూఢిల్లీ: రుణ గ్రహీతలకు బ్యాంకులు వడ్డీ రేటును తప్పనిసరిగా తగ్గిస్తాయని ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా గురువారం పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) రెపోరేటు తగ్గింపు నేపథ్యంలో సిన్హా ఈ ప్రకటన చేశారు. అయితే ఇందుకు కొంత సమయం పడుతుందని సైతం అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐ వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయానికి దోహదపడే పలు చర్యలను కేంద్రం తీసుకుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ‘బ్యాంకర్ల ప్రకటన మీరు చూసినట్లయితే, వడ్డీరేట్ల తగ్గింపు చోటుచేసుకునే సంకేతాలు కనిపిస్తాయి.
అయితే ఇందుకు వాటికి కొంత సమయం కావాలి. ఆర్థిక వ్యవస్థలో రాత్రికిరాత్రి ఏ పరిణామమూ చోటుచేసుకోదు. త్వరలో బ్యాంకుల రేట్ల కోత చోటుచేసుకుంటుంది’ అని జయంత్ అన్నారు. బుధవారంనాడు సిన్హా ఒక ప్రకటన చేస్తూ, ఆర్‌బీఐ రేట్లకోత నిర్ణయాన్ని స్వాగతించారు. ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్లు గణనీయంగా తగ్గుతాయనీ అన్నారు. ఆర్థికాభివృద్ధికి దోహదపడే నిర్ణయంగా దీనిని పేర్కొన్నారు.