
ముంబై: టెక్నాలజీ దిగ్గజాలకు కేంద్రమైన వేవ్‌రాక్ ఆఫీస్ కాంప్లెక్స్ కొనుగోలు కోసం పలు దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఈ కాంప్లెక్స్ కోసం తాజాగా విమానయాన కంపెనీ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్‌ప్రైజెస్ కూడా రంగంలోకి దిగింది. ఇందుకు రూ. 1,800 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సంస్థలు వేవ్‌రాక్ కాంప్లెక్స్ రేసులో ఉన్నాయి.
షాపూర్‌జీ పలోంజీ, అలయంజ్ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థతో పాటు, కెనడాకి చెందిన పెన్షన్ ఫండ్ మేనేజింగ్ సంస్థ కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్‌మెంట్ బోర్డు దీనికోసం పోటీపడుతున్నాయి. సింగపూర్‌కి చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ జీఐసీ, న్యూయార్క్‌కి చెందిన డెవలపర్ టిష్‌మన్ స్పెయర్ .. చేతుల్లో వేవ్‌రాక్ కాంప్లెక్స్ ఉంది. సుమారు 25 లక్షల చ.అ. ఈ ప్రాపర్టీని రూ. 2,000 కోట్లకు విక్రయించాలని యాజమాన్య సంస్థలు భావిస్తున్నాయి.
ఈ డీల్‌కి రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసలె .. సలహాదారుగా వ్యవహరిస్తోంది. యాపిల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, యాక్సెంచర్, జీజీకే టెక్నాలజీస్, అవెవా సొల్యూషన్స్, క్యాప్‌జెమిని, బిర్లాసాఫ్ట్, డ్యుపాంట్ ఇండియా వంటి దేశ,విదేశ టెక్నాలజీ, పారిశ్రామిక, సర్వీస్ రంగ దిగ్గజ సంస్థల కార్యాలయాలు వేవ్‌రాక్ కాంప్లెక్స్‌లో ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఇటీవలే హైదరాబాద్‌లోని తమ ఐసీఐసీఐ టవర్‌ను కూడా విక్రయానికి ఉంచినట్లు సమాచారం.
విస్తరణలో ఇంటర్‌గ్లోబ్..
రాహుల్ భాటియా సారథ్యంలోని ఇంటర్‌గ్లోబ్ సంస్థ.. ఇంటర్‌గ్లోబ్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ (ఐజీఆర్) ద్వారా రియల్టీ రంగంలో పెట్టుబడులు పెడుతోంది. ఇంటర్‌గ్లోబ్ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్‌ను, నిధులను ఇంటర్‌గ్లోబ్ రియల్ ఎస్టేట్ వెంచర్సే నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా రియల్టీ రంగంలో భారీగా విస్తరించే దిశగా ఐజీఆర్ కసరత్తు చేస్తోంది.
రెండు నెలల క్రితమే ఇండియాబుల్స్ డ్యుయల్ అడ్వాంటేజ్ కమర్షియల్ అసెట్స్ ఫండ్‌తో కలిసి గురుగ్రామ్‌లో రియల్టీ సంస్థ హైన్స్ ఇండియాకి చెందిన కమర్షియల్ ఆఫీస్ టవర్‌ను కొనుగోలు చేసింది. 10 లక్షల చ.అ. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌ను ఐజీఆర్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ సహా ఇతర మార్కెట్లలో కూడా వ్యాపార విస్తరణ అవకాశాలు పరిశీలిస్తూ ఉంటామని ఐజీఆర్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, వేవ్‌రాక్ బిడ్డింగ్ గురించి మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు.
Comments
Please login to add a commentAdd a comment