
3 వారాల్లోనే ప్రాజెక్టుల అనుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరల్డ్ క్లాస్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పునరుద్ఘాటించారు. ఐటీ రంగంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే సంస్థలకు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. బ్రాండ్ హైదరాబాద్ రూపకల్పన దిశగా సాగుతున్నట్టు చెప్పారు. మంగళవారం ఇక్కడి గచ్చిబౌలిలో టిష్‌మన్ స్పేయర్‌కు చెందిన వేవ్ రాక్ ఐటీ పార్క్ ఫేజ్ 2.1 ప్రారంభోత్సవం, ఫేజ్ 2.2 ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు.
త్వరలోనే తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని, ప్రాజెక్టుల అనుమతులు వేగిరం చేసేందుకు సింగిల్ విండో విధానం తీసుకొస్తున్నట్టు తెలిపారు. ‘ఇన్వెస్టర్లు నేరుగా మా కార్యాలయానికే రావొచ్చు. రెండు, మూడు వారాల్లో అన్ని అనుమతులతో ప్రాజెక్టు పనులు ప్రారంభించుకోవచ్చు. అనుమతుల కోసం ఎటువంటి పైరవీలు చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్ల సౌకర్యార్థం సీఎం పర్యవేక్షణలో ప్రత్యేక విభాగం పనిచేస్తుంది’ అని చెప్పారు.
టెక్నోసిటీకి సహకారం..
టిష్‌మన్ స్పేయర్ ఇక్కడి తెల్లాపూర్‌లో చేపట్టదలిచిన ప్రతిపాదిత టెక్నోసిటీ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో టిష్‌మన్ స్పేయర్ తొలి ప్రాజెక్టు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. టిష్‌మన్ స్పేయర్ వేవ్‌రాక్ వంటి మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను తెలంగాణలో చేపట్టాలని ఆశిస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) తెలిపారు.
ఐసీఐసీఐ వెంచర్ భాగస్వామ్యంతో టిష్‌మన్ వేవ్ రాక్ ఐటీ పార్కుకు మూడు దశల్లో రూ.1,050 కోట్లు వ్యయం చేస్తోంది. 21 అంతస్థుల్లో, 20 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది. మూడు దశలు పూర్తి అయితే 23 వేల మంది ఉద్యోగులు కూర్చునే వీలుంది. క్యాప్‌జెమినీ, డ్యూపాంట్ తదితర కంపెనీలు వేవ్‌రాక్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఐటీ రంగ కంపెనీ జీజీకే టెక్నాలజీస్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు.
భారీగా నిధులు వెచ్చిస్తాం..
భారత్‌లో ప్రధాన నగరాల్లో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు తాము సిద్ధమని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ డె వలపర్ టిష్‌మన్ స్పేయర్ చైర్మన్ జెర్రీ స్పేయర్ పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడుల విషయంలో ఆశాపూరితంగా ఉన్నామని, భారీగా నిధులు వెచ్చిస్తామన్నారు. హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉందని చెప్పారు. బడ్జెట్‌లో కేంద్రం ప్రతిపాదించిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్స్‌పై స్పందిస్తూ పరిశ్రమకు నిధులు తెచ్చే ప్రతిపాదన ఏదైనా ఆహ్వానించదగ్గదని అన్నారు.
టెక్నోసిటీలో ఐటీ కార్యాలయాలకు వేవ్‌రాక్‌తో పోలిస్తే రెండింతల స్థలం ఉంటుందని అన్నారు. పీపీపీ విధానంలో చేపడుతున్న టెక్నోసిటీ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం, హెచ్‌ఎండీఏ భాగస్వాములుగా ఉంటాయి. 400 ఎకరాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ కార్యాలయాలు, రిటైల్, హోటళ్లు, ఆసుపత్రులను నిర్మిస్తారు.