Wave Rock IT Park
-
వేవ్రాక్పై ఇంటర్‌గ్లోబ్ కన్ను
ముంబై: టెక్నాలజీ దిగ్గజాలకు కేంద్రమైన వేవ్‌రాక్ ఆఫీస్ కాంప్లెక్స్ కొనుగోలు కోసం పలు దిగ్గజ సంస్థలు పోటీపడుతున్నాయి. హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఈ కాంప్లెక్స్ కోసం తాజాగా విమానయాన కంపెనీ ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఎంటర్ప్రైజెస్ కూడా రంగంలోకి దిగింది. ఇందుకు రూ. 1,800 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రెండు సంస్థలు వేవ్‌రాక్ కాంప్లెక్స్ రేసులో ఉన్నాయి. షాపూర్జీ పలోంజీ, అలయంజ్ గ్రూప్ ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ సంస్థతో పాటు, కెనడాకి చెందిన పెన్షన్ ఫండ్ మేనేజింగ్ సంస్థ కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు దీనికోసం పోటీపడుతున్నాయి. సింగపూర్‌కి చెందిన సావరీన్ వెల్త్ ఫండ్ జీఐసీ, న్యూయార్క్‌కి చెందిన డెవలపర్ టిష్మన్ స్పెయర్ .. చేతుల్లో వేవ్‌రాక్ కాంప్లెక్స్ ఉంది. సుమారు 25 లక్షల చ.అ. ఈ ప్రాపర్టీని రూ. 2,000 కోట్లకు విక్రయించాలని యాజమాన్య సంస్థలు భావిస్తున్నాయి. ఈ డీల్‌కి రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసలె .. సలహాదారుగా వ్యవహరిస్తోంది. యాపిల్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, యాక్సెంచర్, జీజీకే టెక్నాలజీస్, అవెవా సొల్యూషన్స్, క్యాప్‌జెమిని, బిర్లాసాఫ్ట్, డ్యుపాంట్ ఇండియా వంటి దేశ,విదేశ టెక్నాలజీ, పారిశ్రామిక, సర్వీస్ రంగ దిగ్గజ సంస్థల కార్యాలయాలు వేవ్‌రాక్ కాంప్లెక్స్‌లో ఉన్నాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్ కూడా ఇటీవలే హైదరాబాద్‌లోని తమ ఐసీఐసీఐ టవర్‌ను కూడా విక్రయానికి ఉంచినట్లు సమాచారం. విస్తరణలో ఇంటర్‌గ్లోబ్.. రాహుల్ భాటియా సారథ్యంలోని ఇంటర్‌గ్లోబ్ సంస్థ.. ఇంటర్‌గ్లోబ్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ (ఐజీఆర్) ద్వారా రియల్టీ రంగంలో పెట్టుబడులు పెడుతోంది. ఇంటర్‌గ్లోబ్ సంస్థకు చెందిన రియల్ ఎస్టేట్‌ను, నిధులను ఇంటర్‌గ్లోబ్ రియల్ ఎస్టేట్ వెంచర్సే నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా రియల్టీ రంగంలో భారీగా విస్తరించే దిశగా ఐజీఆర్ కసరత్తు చేస్తోంది. రెండు నెలల క్రితమే ఇండియాబుల్స్ డ్యుయల్ అడ్వాంటేజ్ కమర్షియల్ అసెట్స్ ఫండ్‌తో కలిసి గురుగ్రామ్‌లో రియల్టీ సంస్థ హైన్స్ ఇండియాకి చెందిన కమర్షియల్ ఆఫీస్ టవర్‌ను కొనుగోలు చేసింది. 10 లక్షల చ.అ. కమర్షియల్ రియల్ ఎస్టేట్‌ను ఐజీఆర్ నిర్వహిస్తోంది. హైదరాబాద్ సహా ఇతర మార్కెట్లలో కూడా వ్యాపార విస్తరణ అవకాశాలు పరిశీలిస్తూ ఉంటామని ఐజీఆర్ ప్రతినిధి పేర్కొన్నారు. అయితే, వేవ్‌రాక్ బిడ్డింగ్ గురించి మాత్రం వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. -
3 వారాల్లోనే ప్రాజెక్టుల అనుమతులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వరల్డ్ క్లాస్ స్మార్ట్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పునరుద్ఘాటించారు. ఐటీ రంగంలో పెట్టుబడులకు ముందుకు వచ్చే సంస్థలకు పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. బ్రాండ్ హైదరాబాద్ రూపకల్పన దిశగా సాగుతున్నట్టు చెప్పారు. మంగళవారం ఇక్కడి గచ్చిబౌలిలో టిష్మన్ స్పేయర్‌కు చెందిన వేవ్ రాక్ ఐటీ పార్క్ ఫేజ్ 2.1 ప్రారంభోత్సవం, ఫేజ్ 2.2 ఆవిష్కరణ చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. త్వరలోనే తెలంగాణ పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని, ప్రాజెక్టుల అనుమతులు వేగిరం చేసేందుకు సింగిల్ విండో విధానం తీసుకొస్తున్నట్టు తెలిపారు. ‘ఇన్వెస్టర్లు నేరుగా మా కార్యాలయానికే రావొచ్చు. రెండు, మూడు వారాల్లో అన్ని అనుమతులతో ప్రాజెక్టు పనులు ప్రారంభించుకోవచ్చు. అనుమతుల కోసం ఎటువంటి పైరవీలు చేయాల్సిన అవసరం లేదు. ఇన్వెస్టర్ల సౌకర్యార్థం సీఎం పర్యవేక్షణలో ప్రత్యేక విభాగం పనిచేస్తుంది’ అని చెప్పారు. టెక్నోసిటీకి సహకారం.. టిష్మన్ స్పేయర్ ఇక్కడి తెల్లాపూర్‌లో చేపట్టదలిచిన ప్రతిపాదిత టెక్నోసిటీ ప్రాజెక్టు పనులు త్వరలోనే ప్రారంభం అవుతాయని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్‌లో టిష్మన్ స్పేయర్ తొలి ప్రాజెక్టు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. టిష్మన్ స్పేయర్ వేవ్‌రాక్ వంటి మరిన్ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను తెలంగాణలో చేపట్టాలని ఆశిస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) తెలిపారు. ఐసీఐసీఐ వెంచర్ భాగస్వామ్యంతో టిష్మన్ వేవ్ రాక్ ఐటీ పార్కుకు మూడు దశల్లో రూ.1,050 కోట్లు వ్యయం చేస్తోంది. 21 అంతస్థుల్లో, 20 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అందుబాటులోకి రానుంది. మూడు దశలు పూర్తి అయితే 23 వేల మంది ఉద్యోగులు కూర్చునే వీలుంది. క్యాప్‌జెమినీ, డ్యూపాంట్ తదితర కంపెనీలు వేవ్‌రాక్‌లో కార్యాలయాలను ఏర్పాటు చేశాయి. ఐటీ రంగ కంపెనీ జీజీకే టెక్నాలజీస్ కార్యాలయాన్ని కేటీఆర్ ప్రారంభించారు. భారీగా నిధులు వెచ్చిస్తాం.. భారత్‌లో ప్రధాన నగరాల్లో మరిన్ని ప్రాజెక్టులు చేపట్టేందుకు తాము సిద్ధమని న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న రియల్ ఎస్టేట్ డె వలపర్ టిష్మన్ స్పేయర్ చైర్మన్ జెర్రీ స్పేయర్ పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడుల విషయంలో ఆశాపూరితంగా ఉన్నామని, భారీగా నిధులు వెచ్చిస్తామన్నారు. హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉందని చెప్పారు. బడ్జెట్లో కేంద్రం ప్రతిపాదించిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్‌పై స్పందిస్తూ పరిశ్రమకు నిధులు తెచ్చే ప్రతిపాదన ఏదైనా ఆహ్వానించదగ్గదని అన్నారు. టెక్నోసిటీలో ఐటీ కార్యాలయాలకు వేవ్రాక్తో పోలిస్తే రెండింతల స్థలం ఉంటుందని అన్నారు. పీపీపీ విధానంలో చేపడుతున్న టెక్నోసిటీ ప్రాజెక్టులో తెలంగాణ ప్రభుత్వం, హెచ్ఎండీఏ భాగస్వాములుగా ఉంటాయి. 400 ఎకరాల్లో రెసిడెన్షియల్, కమర్షియల్, ఐటీ కార్యాలయాలు, రిటైల్, హోటళ్లు, ఆసుపత్రులను నిర్మిస్తారు. -
హైదరాబాద్‌కు అద్భుత భవిష్యత్
-
హైదరాబాద్‌కు అద్భుత భవిష్యత్
హైదరాబాద్ : హైదరాబాద్‌ను ప్రపంచవ్యాప్త ఐటీ నగరంగా తీర్చిదిద్దుతామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు. నానక్‌రామ్‌గూడలో టిస్మన్ స్పెయిర్ వేవ్‌రాక్ ఐటీ పార్క్‌ను కేసీఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌ను డిజిటల్ సిటీగా రూపొందిస్తామని తెలిపారు. బ్రాండ్ హైదరాబాద్, బ్రాండ్ తెలంగాణ నిర్మాణమే తమ ప్రభుత్వ లక్ష్యమని మరోసారి ఆయన స్పష్టం చేశారు. నూతన ఆవిష్కరణలకు హైదరాబాద్ ఆలవాలం కావాలని, హైదరాబాద్‌కు అద్భుత భవిష్యత్ ఉందని ఆయన తెలిపారు. తెలంగాణలో పెట్టుబడిదారులు స్వేచ్ఛగా పెట్టుబడులు పెట్టుకోవచ్చని, వారికి ప్రభుత్వం అంగా నిలుస్తుందని కేసీఆర్ చెప్పారు. పెట్టుబడిదారులు తన కార్యాలయంలో ఎప్పుడైనా కలవవచ్చని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడిదారుల కోసం సింగిల్ విండో విధానం ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజలకు పూర్తి స్థాయి రక్షణ కల్పించేలా చర్యలు తీసుకుంటామని హామీ నిచ్చారు. రూ.450 కోట్లతో వేవ్ రాక్ ఐటీ పార్క్ ను ఏర్పాటు చేస్తున్నారు.