
పాత ఇంటినీ మెరిపిస్తారు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టార్టప్ డైరీలో ఎన్నెన్ని వింతలో!! ఎన్నెన్ని ఆవిష్కరణలో!! ఏదైనా ఒక సమస్య వస్తే చాలు. దాన్ని పరిష్కరించుకోవటంతో పాటు... ఆ సమస్య ఇతరులకు రాకుండా ఒక స్టార్టప్‌ను ఆరంభించేస్తున్నారు నేటి యువత. ఆరంభించటమే కాదు... దాన్ని విజయవంతంగా నడిపిస్తూ ఇన్వెస్టర్లను కూడా ఆకర్షిస్తున్నారు. ఇలాంటి విజయగాధల్ని అందిస్తున్న ‘సాక్షి స్టార్టప్ డైరీ’కి పలు సంస్థలు తమ విజయాల్ని వివరిస్తూ మెయిల్స్ పంపిస్తున్నాయి.
స్థలాభావం వల్ల కొంత ఆలస్యం జరగటం... కొన్ని ఎంపిక చేసిన వాటిని మాత్రమే ప్రచురించటం వీలవుతోంది. అలాంటి స్టార్టప్స్‌లో కొన్ని ఈ వారం...
కొత్త ఇంటికి ఇంటీరియర్ డిజైనింగ్ చేయడం మామూలే. కానీ, పాత ఇంటికి.. అదీ 40 ఏళ్లకు పైబడిన ఇంటికంటేనే కాసింత కష్టం. అచ్చం ఇదే పరిస్థితి ఎదురైంది చందు నైర్, మినీ నైర్ దంపతులకు. మరి వీళ్లేం చేశారో తెలుసా..! సొంతగానే తమ సొంతింటికి రీ-మోడలింగ్ చేసేశారు. అదీ తక్కువ ఖర్చుతో.. నాలుగు నెలల్లోనే! అది చాలామందికి సూపర్‌గా నచ్చేసింది. ఇంకేముంది!! దీన్నే వ్యాపారంగా ప్రారంభించేశారు కూడా!! అలా 2007లో నిచే హ్యబిటైట్స్ సంస్థకు శ్రీకారం చుట్టారు.
దీనిపై వారేమంటారంటే... ‘‘ఏ ఇద్దరి వేలి ముద్రలూ ఒకలా ఉండవన్నది ఎంత నిజమో ఏ రెండు ఇళ్లూ ఒకలా ఉండవన్నదీ అంతే నిజం. ఎక్కడో ఓ చోట కాసింత తేడా ఉంటుంది. అదే ఇంటీరియర్ డిజైన్ మహత్యం. అందుకే ఇంటీరియర్ పరిశ్రమ ఆసక్తికరంగా ఉంటుంది. పాత ఇల్లయినా, కొత్తదైనా ముందుగా కస్టమర్లు తమ అభిరుచులను, అభిప్రాయాలను చెబుతారు. వారి బడ్జెట్‌కు సరిపడే ఇంటీరియర్ డిజైన్స్‌ను చూపిస్తాం.
ముందుగానే తమ ఇల్లు ఏవిధంగా ఉండబోతుందో రంగులతో సహా త్రీడీ రూపంలో చూపిస్తాం. ఆ తర్వాతే పని మొదలుపెడతాం. నివాస సముదాయాలే కాదు.. వాణిజ్య, ఆతిథ్య భవనాలను సైతం రీ-మోడలింగ్ చేస్తాం. ఇప్పటివరకు హైదరాబాద్‌తో పాటు బెంగళూరులో 70కి పైగా ప్రాజెక్ట్‌లు చేశాం. ఇందులో నివాస సముదాయాల వాటాయే ఎక్కువ. ప్రారంభ ధర చ.అ.కు రూ.1,100 ఉంటుంది.
ఇంటీరియర్‌కు అవసరమైన వస్తువులను స్థానిక డిస్ట్రిబ్యూటర్ల నుంచి కొనుగోలు చేస్తాం. రెండున్నర నెలల్లో ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తాం. ఏడాదికి రూ.2 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంటున్నాం. గత రెండేళ్ల నుంచి స్థిరాస్తి వ్యాపారం మందకొడిగా ఉండటంతో ఇంటీరియర్ పరిశ్రమ కూడా ఒడిదుడుకుల్లోనే ఉంది. ప్రస్తుతం బండ్లగూడ, మాదాపూర్, మారేడ్‌పల్లిలో పలు నివాస, వాణిజ్య సముదాయాల్లో ఇంటీరియర్ డిజైనింగ్ చేస్తున్నాం..’’
అద్భుతమైన స్టార్టప్‌ల గురించి అందరికీ తెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...