కొత్త ఫండ్స్‌లో పెట్టుబడులు వద్దా? | Investments in new funds ? | Sakshi
Sakshi News home page

కొత్త ఫండ్స్‌లో పెట్టుబడులు వద్దా?

Published Mon, Nov 27 2017 12:32 AM | Last Updated on Mon, Nov 27 2017 12:32 AM

Investments in new funds ? - Sakshi

చాలా మంది మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్టర్లు కొత్త ఫండ్స్‌ వద్దని, ప్రస్తుతమున్న ఫండ్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేయమని సూచిస్తుంటారు. ఎందుకని? 
–మహాలక్ష్మి, విశాఖపట్టణం  

మనకు తెలియని విషయానికంటే తెలిసిన విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం కదా. ఇది కూడా అలాంటిదే. ప్రస్తుత ఫండ్స్‌ అయితే.. వాటి పోర్ట్‌ఫోలియో వివరాలు, ఆ ఫండ్‌ ఎక్కడ, ఎలా ఇన్వెస్ట్‌ చేస్తుంది...ఆ ఫండ్‌ పనితీరు తదితర వివరాలు తెలుస్తాయ్‌. మార్కెట్‌ బాగా ఉన్నప్పుడు ఆ ఫండ్‌ ఎలాంటి రాబడులు ఇచ్చింది. మార్కెట్‌ పతన సమయంలో ఏ మేరకు నష్టపోయింది. తదితర వివరాలు మనం మదింపు చేయవచ్చు. అదే కొత్త ఫండ్‌ విషయానికొస్తే, మనం ఇన్వెస్ట్‌ చేసిన డబ్బులతోనే ఆ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ప్రారంభిస్తుంది. ఈ ఫండ్‌ పనితీరుపై మనకేమీ అవగాహన ఉండదు. మ్యూచువల్‌ ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు ఫండ్‌ పనితీరు కీలకం. ఇక కొత్త ఫండ్‌ను ప్రారంభంలోనే కొనుగోలు చేస్తే, సదరు మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్లు చౌకగా వస్తాయని కొందరు భావిస్తారు. కానీ మ్యూచువల్‌ఫండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌కు సంబంధించి అది అసలు పరిగణించదగ్గ విషయమే కాదు. ఒక మ్యూచువల్‌ ఫండ్‌ యూనిట్‌ను రూ.10 ధరకు కొనుగోలు చేయడం చాలా చౌక అనే అపోహతో  పలువురు ఇన్వెస్టర్లు కొత్త ఫండ్స్‌ వైపు మొగ్గుచూపుతారు. కానీ అది సరైన విషయం కాదు.  

నా వయసు 50 సంవత్సరాలు. నాకు మ్యూచువల్‌ ఫండ్స్‌లోనూ, షేర్లలోనూ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉన్నాయి.  మరికొంత మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేద్దామనుకుంటున్నాను. నా లాంటి 50 సంవత్సరాలు దాటిన వయసు వారికి దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్స్‌ అంటే ఎలా అర్థం చేసుకోవాలి?  
–సురేందర్, కరీంనగర్‌  

ఈక్విటీల్లో లేదా మ్యూచువల్‌ ఫండ్స్‌లో దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే మంచి రాబడులు పొందవచ్చు. రిటైర్మెంట్‌ దగ్గర పడిన మీలాంటి 50, 50 సంవత్సరాలు దాటిన వారు లాంగ్‌టర్మ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ విషయమై మరింత జాగ్రత్తగా ఉండాలి. ఈక్విటీ, బాండ్ల కలగలుపుగా మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఉండాలి. రిటైరైన తర్వాత వచ్చిన ప్రయోజనాలను అధిక భాగం స్థిరాదాయం వచ్చే మార్గాల్లో ఇన్వెస్ట్‌ చేయాలి.  ఉదాహరణకు 50 ఏళ్ల వయసున్న వ్యక్తిని తీసుకుందాం. రిటైర్మెంట్‌ నిధిగా రూ.50 లక్షలు ఏర్పాటు చేసుకోవాలన్న లక్ష్యంతో అ వ్యక్తి గతంలో ఇన్వెస్ట్‌ చేశాడనుకుందాం. రిటైరైన తర్వాత అతడు ఏర్పాటు చేసుకున్న ఈ నిధిని పూర్తిగా స్థిరాదాయం ఇచ్చే సాధనాల్లోకి మార్చుకోవాలి. ఈ నిధి స్థిరంగా ఉండి, దానిపై వచ్చే ఆదాయాన్ని వాడుకోవాలి.  

నేను ఎల్‌ఐసీ జీవన్‌ సురక్ష–వన్‌ పాలసీని 1997లో  తీసుకున్నాను. ఏడాదికి రూ.10,182 చొప్పున ప్రీమియమ్‌ చెల్లిస్తున్నాను. ఈ పాలసీ 2022లో మెచ్యూర్‌ అవుతుంది. ఈ పాలసీ మెచ్యూర్‌ అయినప్పుడు నాకు ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి. ఈ పాలసీ నుంచి వైదొలిగితే మంచిదా ? కొనసాగితేనే మంచిదా ? ఏది ఎక్కువ ప్రయోజనకరం ?                           
 –రామిరెడ్డి, హైదరాబాద్‌ 

ఎల్‌ఐసీ జీవన్‌ సురక్ష–వన్‌ అనేది డిఫర్డ్‌ యాన్యూటీ పాలసీ. ఈ పాలసీ మెచ్యురిటీ సమయంలో, బోనస్‌తో సహా వచ్చే మొత్తంతో మీరు యాన్యుటీని కొనుగోలు చేయాలి. లేదా బోనస్‌తో సహా వచ్చే మొత్తంలో 25 శాతం విత్‌డ్రా చేసుకొని, మిగిలిన మొత్తంతో యాన్యుటీని కొనుగోలు చేయాలి. యాన్యుటీ అంటే.. పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్‌ చేసి, మీరు జీవించి ఉన్నంత కాలం క్రమం తప్పకుండా కొంత ఆదాయం పొందే ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం. మీరు ఇన్వెస్ట్‌ చేస్తున్న ఈ తరహా పాలసీలు తగిన రాబడులను ఇవ్వలేవని చెప్పవచ్చు. బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌లు మిళితమైన పాలసీలు కానీ, స్కీమ్‌లు కానీ ఎప్పుడూ తగిన రాబడులు, సరిపోయే బీమా కవరేజ్‌ను ఇవ్వలేవు. అందుకని  ఈ ప్లాన్‌ను సరెండర్‌ చేయడమే మంచిదని సూచిస్తున్నాం. ఎల్‌ఐసీ జీవన్‌ సురక్ష పాలసీనే ఉదాహరణగా తీసుకుంటే, ఇటీవల కాలంలో వచ్చిన బోనస్‌... బీమా మొత్తంపై 3.5 శాతం రేంజ్‌లోనే ఉంది. ఇది ఒక బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కన్నా తక్కువ. అంతేకాకుండా ద్రవ్యోల్బణం రేటు కన్నా కూడా తక్కువే. దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేస్తే, ఈ స్థాయి రాబడులు రావడం సరైనది కాదు. ఈ పాలసీ అనే కాదు.. ఇలా ఇన్వెస్ట్‌మెంట్, బీమా కలగలసిన ప్లాన్‌లు ఏవీ ఇన్వెస్టర్లకు సరైన రాబడులను ఇవ్వలేవు. ఇక మీరు ఈ పాలసీ నుంచి వైదొలిగితే.., మీకు మీరు ఇప్పటివరకూ రెగ్యులర్‌గా చెల్లించిన ప్రీమియమ్‌ల్లో 90 శాతం(మొదటి ఏడాది ప్రీమియమ్‌ మినహాయించి) గ్యారంటీడ్‌ సరెండర్‌ వేల్యూగా వస్తుంది. మీ విషయంలో ఇది రూ.1.65 లక్షలుగా ఉంటుంది. లేదా ఎల్‌ఐసీ తన విచక్షణ మేరకు స్పెషల్‌ సరెండర్‌ వేల్యూని ఇవ్వవచ్చు. ఇది గ్యారంటీడ్‌ సరెండర్‌ వేల్యూ కంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ప్రీమియమ్‌లు ఎంత కాలం పాటు చెల్లించారు. పాలసీ మెచ్యుర్‌ కావడానికి ఇంకా ఎంత వ్యవధి మిగిలి ఉంది తదితర అంశాలపై ఈ స్పెషల్‌ సరెండర్‌ వేల్యూ ఆధారపడి ఉంటుంది. మీకు ఎంత  మొత్తం సరెండర్‌ వేల్యూ వస్తుందో కరెక్ట్‌గా తెలుసుకోవడానికి సంబంధిత ఎల్‌ఐసీ ఏజెంట్‌ను గానీ, ఎల్‌ఐసీ అధికారులను గానీ సంప్రదించండి. భవిష్యత్తులో ఎప్పుడూ ఇలా బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌ కలగలసిన ఇన్వెస్ట్‌మెంట్స్‌ ఎంచుకోకండి. బీమా అవసరం కోసం ప్యూర్‌ టర్మ్‌ బీమా పాలసీ తీసుకోండి. ఈ పాలసీలో ప్రీమియమ్‌ తక్కువగానూ, బీమా కవరేజ్‌ అధికంగానూ ఉంటుంది. ఇక దీర్ఘకాల ఇన్వెస్ట్‌మెంట్‌ కోసం ఒకటి లేదా రెండు ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో ఇన్వెస్ట్‌ చేయండి.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement