ముంబై : నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలి వంద రోజుల్లో రూ 12.5 లక్షల కోట్ల మదుపరుల సంపద ఆవిరైంది. మే 30 నుంచి బీఎస్‌ఈ సెన్సెక్స్ ఆరు శాతం (2357 పాయింట్లు), ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఏడు శాతం (858 పాయింట్లు) కోల్పోవడంతో ఇన్వెస్టర్ల సంపద భారీగా హరించుకుపోయింది. మోదీ ప్రభుత్వం రెండోసారి పాలనా పగ్గాలు చేపట్టే ముందు రోజు బీఎస్‌ఈలో లిస్టయిన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ 1,53,62,936 కోట్లు కాగా, సోమవారం మార్కెట్ ముగిసిన సమయానికి దాని విలువ రూ 1,41,15,316 కోట్లకు పడిపోయింది. ఆర్థిక మందగమనం, విదేశీ నిధులు వెనక్కిమళ్లడం, కార్పొరేట్ ఫలితాలు సానుకూలంగా లేకపోవడం వంటి అంశాలు స్టాక్ మార్కెట్ల పతనానికి కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా విదేశీ మదుపరులు మార్కెట్ నుంచి పెట్టుబడులను వెనక్కితీసుకుంటుండటంతో ఈక్విటీ మార్కెట్లు డీలా పడుతున్నాయని చెబుతున్నారు. మోదీ సర్కార్ తిరిగి అధికారం చేపట్టిన అనంతరం ఇప్పటివరకూ విదేశీ మదుపరులు రూ 28,260 కోట్ల విలువైన షేర్లను విక్రయించారని ఎన్‌ఎస్‌డీఎల్ డేటా వెల్లడించింది. 2018 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో లాంగ్‌టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను విధించడంతో పాటు, డివిడెండ్ పంపిణీ పన్ను పొందుపరచడంతో అప్పటినుంచే మార్కెట్‌లో స్లోడౌన్ ప్రారంభమైందని ఐడీబీఐ క్యాపిటల్ రీసెర్చ్ హెడ్ ఏకే ప్రభాకర్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment