కోవిడ్ దెబ్బతో స్టాక్ మార్కెట్లో కనిష్టాలకు పతనమైన కొన్ని షేర్లను కొనేవారే కరువయ్యారు. కరోనా కేసుల వ్యాప్తి, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధింపులతో మార్చి 24న బీఎస్‌ఈ-500 ఇండెక్స్ కొన్నేళ్ల కనిష్టాన్ని తాకింది. అనంతరం అనేక ఆటుపోట్లను ఎదుర్కోంటూ మార్చి 24 కనిష్టాల నుంచి 21శాతం వరకు రికవరీని సాధించింది. ఈ ఇండెక్స్‌లో కోవిడ్ కారణంగా 50శాతం నష్టాలను చవిచూసిన 21 కంపెనీ షేర్లను కొనేవారే లేరు. ఈ షేర్లలో అధిక రిస్క్ పొంచి ఉందనే భయాలు ఇన్వెసర్లలో నెలకొన్నందున ఈ షేర్లు రికవరీని సాధించలేకపోయాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
ఆతిథ్యం రంగంలో సేవలు అందించే చాలెట్ హోటల్ షేరు మార్చి 24 నుంచి 49శాతం నష్టాన్ని చవిచూసింది. ఏడాదిలో 71శాతం క్షీణించింది. అలాగే లెమన్ ట్రీ హోటల్ షేరు ఇదే కాలంలో 33శాతం నష్టపోయింది. ఏడాది కాలంలో 74శాతం నష్టపోయింది. హోటల్ చైన్ కంపెనీలపై అధిక అప్పులు భారం పడుతోందని, రాబోయే మూడేళ్ల వరకు వడ్డీ, మూలధన అవసరాలకు రుణాలపై ఆధారపడాల్సి ఉంటుందని ఎడెల్వీజ్ బ్రోకరేజ్ సంస్థ తన నివేదికలో తెలిపింది.
మల్టీపెక్స్ నిర్వహణ సంస్థ పీవీఆర్ షేరు మార్చి 24తేదీ నుంచి 38శాతం నష్టాన్ని చవిచూసింది. ఏడాదిలో 71శాతం పతనమైంది. కొందరు నిర్మాతలు వ్యయపరమైన ఒత్తిళ్లు ఎదుర్కోవడం, ఇటీవల కొన్ని సినిమాలు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌పై విడుదల అవుతుండటం, లాక్‌డౌన్ కారణంగా కొన్ని చిత్రాల పోస్ట్-ప్రోడక‌్షన్ పనులు ఆగిపోవడం తదితర కారణాలు ఈ షేరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నట్లు బ్రోకరేజ్ సంస్థ ఈక్వైరీస్ క్యాపిటల్ తెలిపింది.
ప్రభుత్వరంగ బ్యాంకులు, చిన్న ప్రైవేట్ రంగ బ్యాంక్‌లు మార్చి 24 నుంచి మార్కెట్లో మొదలైన రికవరీ నుంచి అందుకోవడంలో విఫలయ్యాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆర్‌బీఎల్, డీసీబీ బ్యాంక్, పీఎన్‌బీ షేర్లతో సహా చోళమండలం ఫైనాన్షియల్ హోల్డింగ్స్, శ్రీరామ్ సిటీ ఫైనాన్స్, రెప్కో హోమ్ ఫైనాన్స్ లాంటి ఎన్‌బీఎఫ్‌సీలు 22శాతం నుంచి 33శాతం క్షీణించాయి.
‘‘గతంలో ఎన్‌బీఎఫ్‌సీలకు తగిలిన గాయాలు ఇప్పటికీ మానలేదు. చిన్న ప్రైవేట్ రంగ బ్యాంకులు ఇంకా తమ మనుగడ కొనసాగింపుపై దృష్టి సారిస్తున్నాయి. పీఎస్‌యూ బ్యాంకులు విలీనం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో పరిమిత రుణ వృద్ధి ఏమైనా జరిగితే ఇప్పుడు కొన్ని పెద్ద ప్రైవేట్ బ్యాంకులకు రాబోతోంది.’’ అని క్రిడెట్ సూసీ అధికార ప్రతినిధి నీలకంఠ్ మిశ్రా తెలిపారు.
‘‘రిటైల్ రంగానికి చెందిన ఆదిత్యా బిర్లా ఫ్యాషన్, ఫ్యూచర్ రిటైల్, షాపర్స్ స్టాప్ లాంటి షేర్లు మార్చి 24నుంచి 30-34శాతం నష్టాన్ని చవిచూశాయి. లాక్‌డౌన్ విధింపు కారణంగా ప్రజలు కొనుగోళ్లకు పెద్దగా ఆసక్తి చూపరు. ఈ బలహీనత దీర్ఘకాలంగా కొనసాగే అవకాశం ఉండటం రిటైల్ రంగాని ఎదురుదెబ్బే అవుతుంది.’’ అని మోతీలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment