
ఇన్ఫీ బంపర్ బోణీ..!
ఇన్ఫోసిస్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,597 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది.
అంచనాలు మించిన క్యూ4 ఫలితాలు
♦ నికర లాభం రూ. 3,597 కోట్లు; 16.2% వృద్ధి
♦ ఆదాయం 23.4 శాతం అప్; రూ.16,550 కోట్లు
♦ కలిసొచ్చిన రూపాయి క్షీణత...
♦ 285 శాతం తుది డివిడెండ్; షేరుకి రూ. 14.25
♦ పరిశ్రమ అంచనాలను మించి ఈ ఏడాది గెడైన్స్...
♦ ఆదాయంలో 11.5-13.5% వృద్ధి ఉండొచ్చు..
దేశంలో రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్.. క్యూ4 ఫలితాల సీజన్‌ను అంచనాలను మించిన పనితీరుతో బోణీ చేసింది. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ఐటీ పరిశ్రమకు మించిన ఆదాయ వృద్ధి అంచనా(గెడైన్స్)తో విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది. మరోపక్క, 285 శాతం తుది డివిడెండ్‌ను కూడా ప్రకటించి ఇన్వెస్టర్లను సైతం మెప్పించింది. మొత్తంమీద కంపెనీ రానున్న రోజుల్లో మరింత వృద్ధి పథంలో పయనిస్తుందన్న భరోసాను కల్పించడంలో ఇన్ఫీ సీఈఓ విశాల్ సిక్కా మంచి మార్కులే కొట్టారని పరిశ్రమ నిపుణులు పేర్కొంటున్నారు.
బెంగళూరు: ఇన్ఫోసిస్ మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం(2015-16, క్యూ4)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ.3,597 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది ఇదేకాలంలో లాభం రూ. 3,097 కోట్లతో పోలిస్తే 16.2 శాతం ఎగిసింది. మొత్తం ఆదాయం రూ. 13,411 కోట్ల నుంచి రూ.16,550 కోట్లకు పెరిగింది. 23.4 శాతం వృద్ధిని సాధించింది. ప్రధానంగా క్యూ4లో డాలరుతో రూపాయి మారకం విలువ భారీగా క్షీణించడం, నిర్వహణ పనితీరు పుంజుకోవడం, ముఖ్యమైన క్లయింట్ల ఐటీ వ్యయాలు కూడా పెరగడం తదితర అంశాలు ఇన్ఫీకి మార్చి క్వార్టర్‌లో కలిసొచ్చిన అంశాలు. క్యూ4లో ఇన్ఫోసిస్ రూ. 3,502 కోట్ల నికర లాభాన్ని, రూ. 16,545 కోట్ల ఆదాయాన్ని నమోదుచేయవచ్చని పరిశ్రమ విశ్లేషకులు అంచనా వేశారు.
సీక్వెన్షియల్‌గా ఇలా...
డిసెంబర్ క్వార్టర్(క్యూ3)లో నమోదైన రూ. 3,465 కోట్ల నికర లాభంతో పోలిస్తే(సీక్వెన్షియల్‌గా) మార్చి క్వార్టర్(క్యూ4) లాభం 3.8 శాతం పెరిగింది. ఇక ఆదాయం కూడా క్యూ4లో సీక్వెన్షియల్ ప్రాతిపదికన 4.1 శాతం వృద్ధి చెందింది. డిసెంబర్ క్వార్టర్‌లో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 15,902 కోట్లుగా ఉంది. కాగా, డాలర్ల రూపంలో ఆదాయం క్యూ4లో 2,446 మిలియన్లకు ఎగిసింది. సీక్వెన్షియల్‌గా 1.6 శాతం, వార్షిక ప్రాతిపదికన 13.3 శాతం చొప్పన పెరిగింది. నికర లాభం కూడా 533 మిలియన్ డాలర్లకు ఎగిసింది. సీక్వెన్షియల్‌గా 1.7 శాతం, వార్షికంగా 7 శాతం చొప్పున ఎగబాకింది.
పూర్తి ఏడాదికి...
గడిచిన ఆర్థిక సంవత్సరం(2015-16) మొత్తానికి చూస్తే ఇన్ఫీ నికర లాభం రూ. 13,491 కోట్లకు ఎగబాకింది. అంతక్రితం ఏడాది(2014-15) నికర లాభం రూ. 12,329 కోట్లతో పోలిస్తే 9.4 శాతం వృద్ధి చెందింది. ఇక మొత్తం ఆదాయం రూ. 53,319 కోట్ల నుంచి రూ. 62,441 కోట్లకు దూసుకెళ్లింది. 17.1 శాతం పెరుగుదల నమోదైంది.
గెడైన్స్ భేష్...
ప్రస్తుత 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఇన్ఫీ ఆదాయం వృద్ధి అంచనా(గెడైన్స్) భారీగా పెరిగింది. స్థిర కరెన్సీ ప్రాతిపదికన గెడైన్స్ 11.5-13.5 శాతం, డాలర్ల రూపంలో(మార్చి 31 నాటికి ఉన్న కరెన్సీ విలువలతో చూస్తే) గెడైన్స్ 11.8-13.8%గా ఉండొచ్చని కంపెనీ తెలిపింది. దేశీ ఐటీ పరిశ్రమ చాంబర్ నాస్కామ్ ఈ ఏడాది సాఫ్ట్‌వేర్ రంగం వృద్ధి అంచనా 10-12% కంటే ఇన్ఫోసిస్ గెడైన్స్ చాలా మెరుగ్గా ఉండటం గమనార్హం.
కంపెనీ పనితీరుకు గర్విస్తున్నా...
ఇన్ఫీ సారథిగా తొలి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సాధించిన విజయాలు, పురోగతికి గర్వపడుతున్నా. ఇన్ఫోసిస్ ఇప్పుడు విభిన్నమైన తరహాలో ముందుకెళ్తోంది. ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీతో కంపెనీ సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, ఓపెన్-క్లౌడ్ ప్లాట్‌ఫామ్స్ వంటి అధునాతన పరిజ్ఞానాలతో వ్యాపార పరంగా మా క్లయింట్లకు మరింత విలువను చేకూర్చేందుకు కట్టుబడిఉన్నాం. అయితే, ఈ ప్రయాణంలో ఇప్పుడు ఇంకా మేం ప్రారంభస్థాయిలోనే ఉన్నాం. - విశాల్ సిక్కా, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ
ఫలితాల్లో ఇతర ముఖ్యాంశాలివీ..
♦ ఇన్ఫీ మార్చి క్వార్టర్‌లో స్థూలంగా 89, పూర్తి ఆర్థిక సంవత్సరంలో 325 కొత్త క్లయింట్లను సంపాదించింది.
♦ 2015-16 పూర్తి ఏడాదికిగాను కంపెనీ రూ. 5 ముఖ విలువ గల ఒక్కో షేరుపై రూ.14.25 (285 శాతం) తుది డివిడెండ్‌ను ప్రకటించింది. అంతక్రితం తొలి ఆరు నెలలకు రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో మొత్తం డివిడెండ్ రూ.24.25(485 శాతం)కు చేరింది.
♦ కీలకమైన ఉత్తర అమెరికా ప్రాంతానికి సంబంధించిన వ్యాపారం క్యూ4లో సీక్వెన్షియల్‌గా 0.5 శాతం ఎగిసింది. యూరప్ వ్యాపారం 2.4 శాతం, భారత్‌లో వ్యాపారం 9.1 శాతం వృద్ధి చెందింది.
♦ మార్చినాటికి కంపెనీ వద్ద నగదు నిల్వలు రూ.34,468 కోట్లకు పెరిగాయి. డిసెంబర్ నాటికి ఈ మొత్తం రూ.31,526 కోట్లు.
♦ క్యూ4లో ఇన్ఫీ స్థూలంగా 9,034 మంది ఉద్యోగులను నియమించుకుంది. ఇక 8,373 మంది వలసపోవడం(అట్రిషన్)తో నికరంగా 661 మంది మాత్రమే జతయ్యారు. అట్రిషన్ రేటు స్వల్పంగా 18.3 శాతం నుంచి 17.3 శాతానికి తగ్గింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య మార్చి చివరినాటికి 1,94,044కు చేరింది. కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2016-17) 20,000 మంది ఫ్రెషర్స్ కోసం వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థల నుంచి విద్యార్థులకు క్యాంపస్ ఆఫర్లు ఇచ్చినట్లు కంపెనీ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు చెప్పారు.
♦ శుక్రవారం స్టాక్ మార్కెట్లకు సెలవు కావడంతో ఇన్ఫీ షేరుపై సోమవారం ఫలితాల ప్రభావం ఉంటుంది. బుధవారం కంపెనీ షేరు ముగింపు ధర రూ.1,172. కాగా, అమెరికా మార్కెట్లో(నాస్‌డాక్) శుక్రవారం ఇన్ఫీ షేరు(ఏడీఆర్) 10% లాభాలతో ఆరంభమైంది.