ఒడిదుడుకుల వారమే..!
డెరివేటివ్‌ల ముగింపు
* పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రభావం
* ట్రేడింగ్ నాలుగు రోజులే
* బుధవారం గురునానక్ జయంతి సెలవు
న్యూఢిల్లీ: డెరివేటివ్స్ కాంట్రాక్టుల ముగింపు, పార్లమెంట్ శీతాకాల సమావేశాల కారణంగా ఈ వారం ట్రేడింగ్ ఒడిదుడుకులకు గురవుతుందని నిపుణులంటున్నారు. గురునానక్ జయంతి కారణంగా బుధవారం సెలవు ఉండడం వల్ల నాలుగు రోజులే ట్రేడింగ్ ఉండే ఈ వారంలో అంతర్జాతీయ సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల విక్రయాలు కూడా తగినంత ప్రభావం చూపిస్తాయని వారంటున్నారు.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ డిసెంబర్‌లోనే వడ్డీరేట్లను పెంచుతుందనే అంచనాలు బలంగా ఉన్నాయని, అయితే ఈ విషయాన్ని మార్కెట్లు ఇప్పటికే డిస్కౌంట్ చేశాయని మార్కెట్ విశ్లేషకులంటున్నారు.
బిహార్ గెలుపుతో...
ఈ నెల 26(గురువారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిపక్షాలతో ఉన్న విభేదాలను పరిష్కరించుకొని కేంద్ర ప్రభుత్వం ఈ సమావేశాల్లో కీలక బిల్లులను ఆమోదింపజేసుకోగలుగుతుందా అనే అంశం మీదనే అందరి దృష్టి ఉందని కోటక్ సెక్యూరిటీస్ హెడ్ (ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రీసెర్చ్) దీపేన్ షా చెప్పారు.
బిహార్ ఎన్నికల్లో వచ్చిన విజయంతో ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగుతాయని, పలు అంశాల్లో ప్రభుత్వానికి అడ్డుపడతాయని, దీంతో జీఎస్‌టీతో సహా పలు కీలక బిల్లుల ఆమోదానికి అవరోధాలు తప్పవని కొందరు నిపుణులంటున్నారు. దేశీయంగా ఎలాంటి ప్రధానమైన గణాంకాలు ఈ వారంలో వెలువడవు. ఫలితంగా అంతర్జాతీయ సంకేతాలే కొంత వరకు మార్కెట్‌కు దిశా నిర్దేశం చేస్తాయి.
ప్రతికూలంగానే మార్కెట్..
ఈ వారంలో స్టాక్ మార్కెట్ ప్రతికూలంగానే చలించవచ్చని ట్రేడ్ స్మార్ట్ ఆన్‌లైన్ డెరైక్టర్ విజయ్ సింఘానియా చెప్పారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 7,930 పాయింట్ల దిగువన ఉన్నంత వరకూ పెరిగినప్పుడల్లా షార్ట్ చేయాలని ఆయన సూచిస్తున్నారు. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సెగ్మెంట్లో ట్రేడర్లు తమ పొజిషన్లను రోల్ ఓవర్ చేసే అవకాశాలు అధికంగా ఉన్నాయని, దీంతో మార్కెట్లో ఒడిదుడుకులు తప్పవని పేర్కొన్నారు.
విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలను దేశీయ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు బ్యాలెన్స్ చేశాయని మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్(మిడ్‌క్యాప్స్ రీసెర్చ్) రవి షెనాయ్ చెప్పారు. పార్లమెంట్‌లో సానుకూల చర్యలు లేనిపక్షంలో స్టాక్ మార్కెట్ అక్కడక్కడే కదలాడుతుందని ఆయన అంచనా వేస్తున్నారు.
గతవారం మార్కెట్...
నవంబర్ 20తో ముగిసిన గత వారంలో సెన్సెక్స్ 258 పాయింట్ల(1 శాతం) ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 94 పాయింట్ల (1.21 శాతం) చొప్పున లాభపడ్డాయి. అక్టోబర్ 9 తర్వాత గత వారంలోనే స్టాక్ మార్కెట్ మంచి పనితీరు కనబరిచింది. గత శుక్రవారం సెన్సెక్స్ 27 పాయింట్ల లాభంతో 25,868 పాయింట్ల వద్ద, నిఫ్టీ 14 పాయింట్ల లాభంతో 7,857 పాయింట్ల వద్ద ముగిశాయి.
126 కోట్ల డాలర్లు వెనక్కి
విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు)భారత క్యాపిటల్ మార్కెట్ల నుంచి ఈ నెలలో ఇప్పటివరకూ వంద కోట్ల డాలర్లకు పైగా పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంతంత మాత్రంగానే ఉండడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను ఈ నెలలోనే పెంచే అవకాశాలుండడం దీనికి ప్రధాన కారణాలు.
ఈ నెల 2 నుంచి 19వ తేదీ వరకూ విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.5,713 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.2,565 కోట్లు.. వెరశి రూ.8,278 కోట్లు(126 కోట్ల డాలర్లు) నికర పెట్టుబడులు ఉపసంహరించుకున్నారు.