మార్కెట్లకు ‘యూపీ’ బీపీ!
ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే కొత్త రికార్డు స్థాయికి సూచీలు
⇒ ఓడితే సెంటిమెంట్‌కు దెబ్బ...
⇒ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ షేర్లపై అధిక ప్రభావం
⇒ ఫలితాలపై విశ్లేషకుల అంచనా
ముంబై: ఉత్తరప్రదేశ్‌తో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు రేపు (శనివారం) ప్రారంభం కానుంది. కీలకమైన యూపీలో మెజార్టీ సీట్లు బీజేపీవేనంటూ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. సమాజ్‌వాది, కాంగ్రెస్ కూటమి గెలుపుపై ప్రతికూల అంచనాలతో ఉన్న మార్కెట్ వర్గాలు.. యూపీలో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసేది కమలనాథులేనని భావిస్తున్నాయి. అదే జరిగితే సంస్కరణలకు గట్టి ఊతం లభిస్తుందని, మార్కెట్లు మరింతగా పరుగులు తీయగలవని ఆశిస్తున్నాయి. ఇందుకు సంబంధించిన ఒక వార్తా సంస్థ నిర్వహించిన సర్వేలో పాల్గొన్న 12 బ్రోకింగ్ సంస్థలకు చెందిన విశ్లేషకుల్లో 9 మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. యూపీలో అధికార పార్టీ మళ్లీ పగ్గాలు దక్కించుకుంటే దేశీ ఈక్విటీ మార్కెట్‌కు ప్రతికూలమే కాగలదని సర్వేలో పాల్గొన్న వారిలో 91 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ఈ ఏడాది ఇప్పటిదాకా ఆసియాలోని ఇతర ఈక్విటీ మార్కెట్లతో పోలిస్తే దేశీ మార్కెట్ మెరుగైన పనితీరు కనపర్చింది. గతేడాది నవంబర్ 9న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపు తర్వాత పరిణామాలతో వచ్చిన నష్టాలన్నింటినీ భర్తీ చేసుకుంది. విదేశీ ఇన్వెస్టర్లు కూడా మళ్లీ తిరిగొచ్చారు. ఈ ఏడాది తొలి రెండు ¯ð లల కాలంలో బాండ్లు, ఈక్విటీల్లో దాదాపు 2.4 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేశారు. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ సూచీ 9 శాతం పెరిగింది. పెద్ద నోట్ల రద్దు ప్రభావాల నుంచి కోలుకుంటూ.. గత కొన్నాళ్లుగా ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరువలో తిరుగాడుతోంది. ఈ పరిస్థితుల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలిస్తే.. నిఫ్టీ గత రికార్డు స్థాయి 9,119 పాయింట్లను అధిగమించడంతో పాటు మొత్తం మీద దాదాపు 8.7 శాతం మేర ఎగిసేందుకు కావాల్సిన ఊతం దక్కగలదని సర్వేలో పాల్గొన్న మొత్తం 12 మంది అభిప్రాయపడ్డారు.
రాజ్యసభలో కూడా బలం పుంజుకునేందుకు యూపీలో గెలుపు బీజేపీకి తోడ్పడుతుందని వారు విశ్లేషించారు. రాజ్యసభలో బీజేపీకి పెద్దగా బలం లేకపోవడంతో గతంలో పలు కీలక సంస్కరణల బిల్లులకు చుక్కెదురైన నేపథ్యంలో యూపీలో గెలిస్తే.. అధికార పార్టీ తలపెట్టిన సంస్కరణలకు ఆటం కం ఉండబోదని వారు పేర్కొన్నారు. బీజెపీ గెలుపు, ఓటముల ప్రభావం బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంపై అధికంగా వుండగలదని వారు అభిప్రాయపడ్డారు. కానీ బీజేపీ యూపీలో అధికారం చేజిక్కించుకోలేకపోతే, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీనపడి, మార్కెట్ క్షీణిస్తుందని వారు అంచనా వేశారు.
సాధ్యపడేనా ..
పెద్ద నోట్ల రద్దు అనంతరం జరిగిన అయిదు రాష్ట్రాల ఎన్నికలు బీజేపీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఇది ఒకరకంగా డీమోనిటైజేషన్‌పై రెఫరెండంలాంటిదిగా అంతా పరిగణిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికల్లో గెలుపు కమలనాధులకు తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా ఉత్తర్‌ప్రదేశ్ మరింత కీలకంగా మారింది. యూపీ జనాభా ఏకంగా 20.4 కోట్ల మేర ఉంటుంది. ఇక్కడి నుంచే రాజ్యసభకు అత్యధిక ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాజ్యసభలో మొత్తం 245 సీట్లు ఉండగా.. అందులో 31 సీట్లు యూపీవే ఉంటాయి. అందుకే యూపీ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి 80 సీట్లలో ఏకంగా 71 సీట్లు దక్కించుకుని యూపీలో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇటీవలి పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాస్త మిశ్రమ ఫలితాలే దక్కించుకుంది.
మార్కెట్లను ప్రభావితం చేయబోయే మరిన్ని అంశాలు..
యూపీ ఎన్నికల ప్రభావాలు ఎక్కువగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాలపై పడగలవని బ్రోకరేజి సంస్థలు భావిస్తున్నాయి. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ముగిశాక.. స్వల్పకాలికంగా చూస్తే మార్చి 14–15 తేదీల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ సమావేశం పరిణామాలు మార్కెట్లను ప్రభావితం చేయనున్నాయి.