
శాన్‌ఫ్రాన్సిస్‌కో : టెక్ దిగ్గజం ఆపిల్ క్షమాపణలు చెప్పింది. బ్యాటరీ విషయంలో తలెత్తుతున్న సమస్యల పట్ల యూజర్లను ఆపిల్ గురువారం తన వెబ్‌సైట్‌లో క్షమాపణలు కోరింది. పాత ఐఫోన్ మోడల్స్ స్లోగా మారడానికి తామే కారణమని ఆ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే యూజర్ల విధేయతను గుర్తించడానికి, నమ్మకాన్ని మళ్లీ చూరగొనడానికి ఐఫోన్లలో పలు మార్పులు చేపడుతున్నట్టు తెలిపింది. అంతేకాక పాత ఐఫోన్ల బ్యాటరీలను రిప్లేస్ చేయడానికి సంస్థ అంగీకరించింది. చాలా తక్కువ ధరకు ఆపిల్ కొత్త బ్యాటరీలను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం 79 డాలర్లు(సుమారు రూ.5000)గా ఉన్న బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ధరను 29 డాలర్లకు(రూ.1,850) తగ్గించినట్టు పేర్కొంది. వచ్చే నెల నుంచి ఈ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపింది.
అదేవిధంగా పాత ఐఫోన్ల కోసం ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా అప్‌డేట్ చేసింది. 2018లో కొత్త సాఫ్ట్‌వేర్‌ను రిలీజ్ చేయనున్నట్టు తెలిపింది. దాని వల్ల కస్టమర్ల తమ ఐఫోన్లను మానిటర్ చేసుకునే వీలు ఉంటుంది. బ్యాటరీ ఆరోగ్యకరంగా లేని విషయాన్ని యూజర్లు వెంటనే తెలుసుకోవచ్చు. ఇది ఫోన్ పనితీరుపై ప్రభావం చూపనుంది. కొత్త ఐఫోన్లను కస్టమర్లు కొనుగోలు చేయాలనే ఉద్దేశంతోనే కంపెనీ పాత ఫోన్లను స్లో చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఫోన్ లైఫ్‌ను పెంచేందుకే వాటిని స్లోడౌన్ చేసినట్లు ఆపిల్ పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా ఐఫోన్ డివైజ్‌లను స్లో చేసిందని కంపెనీపై కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి దేశాల్లో ఎనిమిది దావాలు నమోదయ్యాయి. ఫ్రాన్స్‌లో లీగల్ ఫిర్యాదు కూడా దాఖలైంది.
Comments
Please login to add a commentAdd a comment