ఆపిల్ ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత డిమాండ్ ఉంటుందో మనకు తెలిసిన విషయమే. ఎన్ని మోడళ్లు వస్తున్నా కొత్త మోడల్ కోసం ఎదురుచూస్తుంటారు ఐఫోన్ అభిమానులు. కొత్త మోడల్ ఐఫోన్ విడుదలవుతుంటే చాలు ... అభిమానుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. గంటల తరబడి లైన్‌లో నిలబడి మరీ కొత్త ఐఫోన్‌ను సొంతం చేసుకోవాలనుకుంటుంటారు. ఈ అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకు ఈ ఏడాది కూడా ఆపిల్ మూడు సరికొత్త ఐఫోన్లతో వినియోగదారుల ముందుకు వస్తోంది. అది కూడా రేపే.
సెప్టెంబరు 12న అంటే రేపు కూపర్టినోలో ఉన్న స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో వీటి లాంచింగ్ ఈవెంట్ జరగబోతుంది. ఐఫోన్ 9, ఐఫోన్ ఎక్స్‌ఎస్, ఐఫోన్ ఎక్స్‌ఎస్ మ్యాక్స్ పేర్లతో ఇవి లాంచ్ కాబోతున్నాయని టాక్. ఐఫోన్ 9 మూడు ఐఫోన్లలో అత్యంత సరసమైనదిగా ఉండనుందని, ఇది 6.1 అంగుళాల ఎల్‌సీడీ ప్యానల్‌తో రూపొందిందని ఇప్పటికే పలు రిపోర్టు చెప్పాయి. మిగతా రెండు 5.8 అంగుళాల ఓలెడ్, 6.5 అంగుళాల ఓలెడ్ డిస్‌ప్లేలను కలిగి ఉంటుందని పేర్కొన్నాయి. ఐఫోన్ 9, ఐఫోన్ ఎక్స్‌ఎస్‌లు రెండు రోమనియన్ వెబ్‌సైట్ క్విక్‌మొబైల్‌లో సీక్రెట్‌గా ప్రీ-ఆర్డర్‌కు కూడా అందుబాటులోకి వచ్చాయట.
ఈసారి లాంచ్ చేయబోయే ఐఫోన్లలో ఒకటి డ్యుయల్ సిమ్‌తో అలరించబోతుందని తెలుస్తోంది. ఇప్పటివరకూ ఆపిల్ ఐఫోన్లన్నీ సింగిల్ సిమ్‌తోనే పనిచేసేవి. ఈ నేపథ్యంలో ఇతర సంస్థల నుంచి వస్తున్న పోటీ తట్టుకునేందుకు ఆపిల్ కూడా ఒక మోడల్‌ను డ్యుయల్ సిమ్‌తో విడుదల చేయబోతుందని తెలిసింది. మూడు ఐఫోన్లతో పాటు, ఐప్యాడ్ ప్రొ, ఆపిల్ వాచ్ సిరీస్ 4ను కూడా ఈ కంపెనీ విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అసలు రేపు జరిగే ఈవెంట్‌లో ఆపిల్ తన అభిమానులకు ఎలాంటి సర్‌ప్రైజ్ ఇస్తోందో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment