మార్కెట్‌కు రూపాయి దెబ్బ
వరుసగా మూడో రోజూ నష్టాలే
⇒ కొనసాగుతున్న ఎఫ్‌ఐఐల విక్రయాలు
ముంబై: స్టాక్ మార్కెట్ పతనం గురువారం మూడోరోజు కొనసాగింది. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరగడం, విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల మ్యాట్ ఆందోళనలకు తోడు తాజాగా డాలర్‌తో రూపాయి మారకం 20 నెలల కనిష్ట స్థాయికి 64కు క్షీణించడం స్టాక్ మార్కెట్‌ను దెబ్బకొట్టింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 118 పాయింట్లు క్షీణించి 26,599, నిఫ్టీ 40 పాయింట్లు క్షీణించి 8,057 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్‌కు ఇది ఆరున్నర నెలల కనిష్ట స్థాయి.
కాగా ఇంట్రాడేలో నిఫ్టీ 8,000 పాయింట్ల దిగువకు తాకింది. పన్ను వివాదాల కారణంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల విక్రయాలు కొనసాగుతుండడం, సంస్కరణల బిల్లుల ఆమోదంలో జాప్యం జరుగుతుండడం, కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశమయంగా ఉండడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని ట్రేడర్లంటున్నారు. 1,858 షేర్లు నష్టాల్లో, 813 షేర్లు లాభాల్లో ముగిశాయి. టర్నోవర్ బీఎస్‌ఈలో రూ.3,182 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ నగదు విభాగంలో రూ.17,676 కోట్లుగా, ఎన్‌ఎస్‌ఈ డెరివేటివ్స్ విభాగంలో రూ.2,48,778 కోట్లుగా నమోదైంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,361 కోట్ల నికర విక్రయాలు, దేశీయ ఇన్వెస్టర్లు రూ.1,158 కోట్ల నికర కొనుగోళ్లు జరిపారు.