గ్రామ్ గోల్డ్ బాండ్ @రూ. 3119
ఈ నెల 18 నుంచి నాలుగో దఫా సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్
న్యూఢిల్లీ: బంగారం బాండ్ల నాలుగో దఫాకు సబ్‌స్క్రిప్షన్ ఈ నెల 18(వచ్చే సోమవారం) నుంచి ప్రారంభమై 22న ముగుస్తుంది. ఈ నాలుగో దఫా పుత్తడి బాండ్ల ధరను ఒక్కో గ్రామ్‌కు రూ. రూ.3,119గా ఆర్‌బీఐ నిర్ణయించింది. బంగారాన్ని భౌతిక రూపంలో కొనుగోలు చేయకుండా నిరోధించడానికి ప్రభుత్వం ఈ సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్(ఎస్‌జీబీ)ను రూపొందించింది. బాండు కొనుగోలుచేసినప్పటి బంగారం ధరపై ప్రతీ ఆరు నెలలకు చెల్లించేలా 2.75 శాతం వార్షిక వడ్డీ వుంటుంది.
పుత్తడి ధర పెరిగితే బాండు ధర కూడా పెరుగుతుంది. లేదా ధర తగ్గితే తగ్గుతుంది. ఈ బాండ్‌లను బ్యాంక్‌లు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆప్ ఇండియా లిమిటెడ్, ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల ద్వారా ఇన్వెస్టర్లు కొనుగోలు చేయవచ్చు. ఇప్పటివరకూ మూడు దఫాలుగా రూ.1,322 కోట్ల విలువైన గోల్డ్ బాండ్లు జారీ చేశారు. కనీసంగా ఒక గ్రాము, గరిష్టంగా 500 గ్రాముల వరకూ ఇన్వెస్ట్ చేయవచ్చు. గోల్డ్ బాండ్ స్కీమ్ కింద 5,10,50, 100 గ్రాముల డినామినేషన్లలో 5-7 కాలపరిమితితో ఈ గోల్డ్ బాండ్లను జారీ చేస్తారు.