హైదరాబాద్: దేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రారంభ స్థాయి ఇంజనీర్ల వేతనాలు తక్కువగా ఉంచేందుకు కుమ్మక్కయ్యాయని ఐటీ నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌వో టి.వి.మోహన్‌దాస్ పాయ్ విమర్శించారు. వేతనాలకు సంబంధించి దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్.ఆర్.నారాయణ మూర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో పాయ్ ఏకీభవించారు. ఐటీ పరిశ్రమలో గత ఏడేళ్లుగా ఫ్రెషర్స్ (ప్రారంభ స్థాయి ఉద్యోగులు) వేతనాలు ఏమాత్రం పెరగలేదని మూర్తి ఆరోపించారు. అదే సమయంలో సీనియర్ స్థాయిల్లోని ఉద్యోగుల జీతాలు మాత్రం పలు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు.
సప్లై ఎక్కువ.. ఇదే కంపెనీలకు వరం..
‘దేశంలో ఇంజనీర్లు ఎక్కువగా ఉన్నారు. ఏటా కొత్తగా వస్తున్న వారి సంఖ్యా ఎక్కువే ఉంది. ఇదే అంశాన్ని ఐటీ కంపెనీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఈ విధానం సరైంది కాదు’ అని పాయ్ పేర్కొన్నారు. ‘పెద్ద కంపెనీలు కుమ్మక్కయ్యాయి. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. ఒకరితోనొకరు మాట్లాడుకుంటారు. కొన్నిసార్లు వేతనాలు పెంచొద్దనే అంగీకారానికి వస్తారు’ అని వ్యాఖ్యానించారు. ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలు పెంచకూడదనే విషయాన్ని పరస్పరం మాట్లాడుకుంటాయనే విషయం తనకు తెలుసన్నారు.
ఏడేళ్లలో సగం తగ్గిన జీతాలు!
ద్రవ్యోల్బణ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. గత ఏడేళ్లలో ఐటీ పరిశ్రమలోని ఫ్రెషర్స్ వేతనాలు 50 శాతం మేర పడిపోయాయని పాయ్ వివరించారు. అందుకే తొలి ఐదేళ్లలో వలసలు ఎక్కువగా ఉంటున్నాయన్నారు. ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలు అక్కడక్కడే ఉన్నందున మంచి టాలెంట్ ఉన్న వారు ఐటీ పరిశ్రమలోకి రావడం లేదని తెలిపారు. ‘ప్రముఖ ఐటీ కంపెనీలు మెరుగైన వేతనాలివ్వాలి. ఉన్నత స్థాయి ఉద్యోగులకు అధిక జీతాలివ్వకుండా చూసుకోవచ్చు. మధ్యస్థాయిలో మరింత వేతనాలివ్వాలి. సర్దుబాటు నేర్చుకోవాలి. ప్రారంభ స్థాయి ఉద్యోగుల వేతనాలను పెంచకుండా ఉండటం నైతికంగా తప్పు’ అన్నారాయన. టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ కంపెనీలు ఫ్రెషర్స్‌కు మంచి జీతాలు ఇవ్వడానికి ముందడుగు వేయాలన్నారు.
మెరుగైన వేతనం ఇవ్వాలి..
‘ఫ్రెషర్స్ మెరుగైన వేతనం పొందలేకపోవడం చాలా నిరుత్సాహపరుస్తోంది. ఏం చేద్దాం? ఇంజనీర్లు ఎక్కువగా ఉంటున్నారు. వారు చదువులేమో నేరుగా మంచి ఉద్యోగం దక్కించుకోవడానికి సరిపోవడం లేదు. వారికి శిక్షణ అవసరమౌతోంది. ఐటీ కంపెనీలు ఫ్రెషర్స్ శిక్షణ కోసం చాలా డబ్బుల్ని ఖర్చు చేస్తున్నాయి. ఈ పరిస్థితి కొత్తేమీ కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే’ అని పాయ్ వివరించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి కనక వారికి మెరుగైన వేతనాలివ్వాలని అభిప్రాయపడ్డారు.
కంపెనీల కుమ్మక్కు వల్లే..
Published Thu, Dec 28 2017 12:58 AM | Last Updated on Thu, Sep 27 2018 3:58 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment