పన్నుభారం... తగ్గించుకుందాం! | It is mandatory to file tax returns annually | Sakshi
Sakshi News home page

పన్నుభారం... తగ్గించుకుందాం!

Published Mon, Jul 23 2018 12:48 AM | Last Updated on Mon, Jul 23 2018 10:15 AM

It is mandatory to file tax returns annually - Sakshi

ఏటా పన్ను రిటర్నులు దాఖలు చేయటం తప్పనిసరే!! కాకపోతే కొందరు పన్ను తగ్గించుకోవటానికి తాము గరిçష్టంగా ఎంత పొదుపు చేయగలమో అంతా చేస్తారు. ఆ రకంగా పొదుపును కూడా పెంచుకుంటారు. ఇవన్నీ ప్రతిబింబించేలా పన్ను రిటర్నులు దాఖలు చేస్తారు. మరికొందరు మాత్రం నామమాత్రపు కార్యక్రమంగా కానిచ్చేస్తుంటారు. తమకున్న అన్ని రకాల ఆదాయం, ఖర్చులు, వాటికి చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఉన్న మినహాయింపుల గురించి అవగాహన కలిగిన వారు చాలా తక్కువ మంది కనిపిస్తుంటారు. దీంతో ఆ మినహాయింపులను ఉపయోగించుకోరు. ఆదాయపన్ను చట్టంలో సెక్షన్‌ 80సీ కింద ఉన్న పన్ను మినహాయింపుల గురించే సాధారణ అవగాహన ఉంటుంది తప్ప, ఇతర సెక్షన్ల గురించి తెలిసిన వారు కూడా తక్కువ మందే!! కొంత సమయం వెచ్చించి అవేంటన్నది తెలుసుకుంటే మినహాయింపుల ద్వారా పన్ను భారాన్ని మరింత తగ్గించుకోవచ్చు.       – సాక్షి, పర్సనల్‌ ఫైనాన్స్‌ విభాగం


సేవింగ్స్‌ ఖాతా బ్యాలెన్స్‌పై వడ్డీ
బ్యాంకు సేవింగ్స్‌ ఖాతాలో బ్యాలెన్స్‌పై ప్రతి మూడు నెలలకోసారి వడ్డీ జమవుతుంది. ఇలా ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన ఆదాయాన్ని సంబంధిత ఖాతాదారుడి వార్షిక ఆదాయానికి కలిపి చూపించాల్సి ఉంటుంది. అయితే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 80టీటీఏ ప్రకారం ఏటా ఈ వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు ఉంటే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. పోస్టాఫీసు సేవింగ్స్‌ ఖాతాలో బ్యాలెన్స్‌పై వడ్డీకి కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది.

అంతకు మించితే మాత్రం పన్ను చెల్లించాలి. వడ్డీ ఆదాయం రూ.10,000 వరకు మినహాయింపు అంటే... మొత్తం ఆదాయంలో రూ.10,000 తగ్గించి చూపించుకోవడం అని పొరపడొద్దు. ఇతర ఆదాయం కాలమ్‌లో వడ్డీ ఆదాయాన్ని చూపించి అది రూ.10 వేల లోపు ఉంటే పన్ను మినహాయింపు పొందొచ్చు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది.  అది ఈ సెక్షన్‌ కిందికి రాదు.  

ఇంటి అద్దె చెల్లింపులు...
చట్టంలోని సెక్షన్‌ 80జీజీ ప్రకారం, వేతన ప్యాకేజీలో భాగంగా హెచ్‌ఆర్‌ఏ లేకపోతే... వేతన ఉద్యోగి కాని వారు ఈ ప్రయోజనాన్ని పొందొచ్చు. తన పేరు, తన జీవిత భాగస్వామి లేదా పిల్లల పేరిట ఇల్లు ఉండి, ఆ ఆంట్లో నివసిస్తుంటే మాత్రం ఈ ప్రయోజనానికి అనర్హులు. మొత్తం ఆదాయంలో 10 శాతాన్ని అద్దెగా చెల్లిస్తుంటే లేదా, మొత్తం ఆదాయంలో 25% లేదా ప్రతీ నెలా రూ.5,000 మొత్తం వీటిలో ఏది తక్కువ ఉంటే దాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. మొత్తం ఆదాయం అంటే సెక్షన్‌ 80సీ, 80యూ, 80జీజీ కింద మినహాయింపులు పోనూ మిగిలింది.  

తీవ్ర అనారోగ్యాలు, వ్యాధులు
ఈ వ్యయాలను 80డీడీబీ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వార్షికంగా రూ.40,000 వరకు చేసే ఖర్చుకు పన్ను ఆదాయం నుంచి మినహాయింపు ఉంటుంది. ఒకవేళ పన్ను చెల్లింపుదారుడు సీనియర్‌ సిటిజన్‌ అయితే ఈ పరిమితి రూ.60,000. సూపర్‌ సీనియర్‌ సిటిజన్‌ (80 ఏళ్లకుపైన) అయితే... పరిమితి రూ.80,000.

అయితే, ఈ వ్యాధులకయ్యే ఖర్చును బీమా పాలసీ ద్వారా పొందితే పన్ను మినహాయింపు పొందేందుకు వీలుండదు. పాక్షికంగా రీయింబర్స్‌మెంట్‌ వస్తే, మిగిలిన మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. పన్ను చెల్లింపుదారుడు లేదా అతని జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు, సోదరులు, సోదరీమణులకు సంబంధించి ఖర్చు చేసినా ఈ చట్టం కింద పన్ను మినహాయింపు వర్తిస్తుంది.

ఇంటి రుణంపై వడ్డీ చెల్లింపులు...
నివసిస్తున్న భవనం కొనుగోలుకు రుణం తీసుకుని చేసే చెల్లింపులకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. 2016 ఏప్రిల్‌ 1 నుంచి 2017 మార్చి 31 మధ్య రుణం తీసుకుని ఉండాలి. ఇంటివిలువ రూ.50 లక్షల్లోపు, రుణం మొత్తం రూ.35 లక్షల్లోపు ఉండాలి. అలాగయితే సెక్షన్‌ 24 కింద వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందొచ్చు. వడ్డీ చెల్లింపులు రూ.2 లక్షలకు పైన ఉంటే, అప్పుడు సెక్షన్‌ 80ఈఈ కింద మరో రూ.50వేలకు పన్ను మినహాయింపు పొందే అవకాశముంది.

హోమ్‌ లోన్‌ అనుబంధ చార్జీలకూ...
ఇంటి రుణం తీసుకునే సమయంలో చేసే ఇతర చెల్లింపులక్కూడా పన్ను మినçహాయింపు పొందొచ్చు. ప్రాసెసింగ్‌ ఫీజుపైనా సెక్షన్‌ 24 కింద పన్ను చెల్లించక్కర్లేదు. ప్రాసెసింగ్‌ ఫీజు, ఇతర చెల్లింపులను సైతం వడ్డీగానే చట్టం పరిగణిస్తోంది.  

డౌన్‌ పేమెంట్‌...
రుణాల కోసం కొందరు స్నేహితులు లేదా తెలిసిన వారి నుంచి చేబదులు తీసుకుని డౌన్‌ పేమెంట్‌ సమకూర్చుకుంటారు. ఈ మొత్తంపై వడ్డీ చెల్లించినా సెక్షన్‌ 24 కింద పన్ను మినహాయింపును పొందే అవకాశం ఉంటుంది. ఇల్లు కొనుగోలు, ఆధునికీకరణ, పునర్నిర్మాణం కోసం రుణం తీసుకుని చేసే వడ్డీ చెల్లింపులు సైతం ఈ సెక్షన్‌ పరిధిలోకి వస్తాయి.
 
వైకల్యం కలిగిన వారికి...
40 శాతం వైకల్యం కలిగిన వారు వార్షికంగా రూ.75,000 వరకు సెక్షన్‌ 80యూ కింద మినహాయింపు పొందే అవకాశం ఉంది. తమపై వైకల్యం కలిగిన వారు ఆధారపడి ఉన్నా గానీ, వారిపై చేసే ఖర్చులకు సెక్షన్‌ 80డీడీ కింద 75,000 వరకు పన్ను మినహాయింపును పొందొచ్చు. ఒకవేళ వైకల్యం తీవ్రత 80 శాతంపైన ఉంటే అప్పుడు వార్షికంగా రూ.1.25 లక్షలకు పన్ను మినహాయింపు లభిస్తుంది.

ఇక జీవిత భాగస్వామి, పిల్లల పేరిట చేసే పెట్టుబడులపై వచ్చే ఆదాయం తమ ఆదాయం కిందే చూపించి పన్ను చెల్లించాలి. ఒకవేళ పిల్లల్లో ఎవరైనా వైకల్యంతో ఉంటే, వారి పేరిట చేసే పెట్టుబడులకు ఇది వర్తించదు. వైకల్యంతో ఉన్న పిల్లల పేరిట పెట్టుబడులపై ఆదాయం తండ్రి ఆదాయంగా చట్టం చూడదు. కనుక పన్ను వర్తించే పెట్టుబడులను వైకల్యంతో ఉన్న పిల్లల పేరిట చేసుకుంటే పన్ను నుంచి ఉపశమనం పొందొచ్చు.

నష్టాలు చూపించుకోవచ్చు...
గత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులపై నష్టపోయిన వారు, అదే సంవత్సరంలో షేర్లు, ప్రాపర్టీ, బంగారం, డెట్‌ ఫండ్స్‌ విక్రయంపై వచ్చిన మూలధన లాభాల పన్ను నుంచి నష్టాలను మినహాయించుకోవచ్చు. స్వల్ప కాలిక మూలధన నష్టాలను, స్వల్పకాలిక మూలధన లాభాలు, దీర్ఘకాలిక మూలధన లాభాల నుంచి కూడా సర్దుబాటు చేసుకునేందుకు వీలుంది.

వివిధ సంస్థలకు విరాళాలిస్తే...
విరాళాలపై సెక్షన్‌ 80జీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే, మీ మొత్తం ఆదాయంలో ఇది 10 శాతాన్ని మించకూడదు. ముఖ్యంగా ఈ సెక్షన్‌ కింద ప్రభుత్వం నోటిఫై చేసిన ఫండ్స్‌కు ఇచ్చే విరాళాలకే ఈ పన్ను ప్రయోజనం ఉంటుంది. అలాగే, నగదు రూపంలో విరాళం రూ.2,000 మించి ఇస్తే మినహాయింపునకు అవకాశం లేదు.

నేషనల్‌ డిఫెన్స్‌ ఫండ్, జవహర్‌లాల్‌ నెహ్రూ మెమోరియల్‌ ఫండ్, ప్రధానమంత్రి కరువు ఉపశమన నిధి, జాతీయ చిన్నారుల నిధి, ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి, క్లీన్‌ గంగా ఫండ్‌ తదితరమైనవి ప్రభుత్వం నోటిఫై చేసిన వాటిలో ఉన్నాయి. అలాగే, ఆలయాలు, చర్చిలు, మసీదుల నవీకరణకు ఇచ్చే విరాళాలకూ ఈ మినహాయింపు వర్తిస్తుంది.  ప్రత్యేకమైన పరిశోధనలు లేదా యూనివర్సిటీ లేదా కాలేజీలను ప్రభుత్వం సెక్షన్‌ 35(1)(2), సెక్షన్‌(1)(3), 35సీసీఏ, 35సీసీబీ కింద ఆమోదించి ఉంటే, వీటికి చేసే విరాళాలకు సెక్షన్‌ 80జీజీఏ రూ.10,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు.

ఇందుకు నగదు రహితంగానే విరాళాలు ఇవ్వాల్సి ఉంటుంది. వ్యాపారం రూపంలో లేదా వృత్తి రూపంలో ఆదాయం కలిగిన వారికి ఈ ప్రయోజనం లేదు.   వీటన్నిటితో పాటు రాజకీయ పార్టీలకిచ్చే విరాళాలపైనా సెక్షన్‌ 80జీజీసీ కింద పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. ఈ సెక్షన్‌ కింద పన్ను మినహాయింపునకు పరిమితి లేదు. ఎంత మొత్తాన్నయినా విరాళంగా అందించి మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. కాకపోతే నగదు రహితంగానే విరాళాలు అందించి ఉండాలి.


వైద్య బీమా ప్రీమియం చెల్లిస్తే..
వైద్య బీమా పాలసీకి ఏటా చెల్లించే ప్రీమియం మొత్తానికి సెక్షన్‌ 80డీ కింద పన్ను మినహాయింపు ఉంటుంది. పన్ను చెల్లింపుదారులు, వారి జీవిత భాగస్వామి, తనపై ఆధారపడిన తల్లిదండ్రులు, పిల్లలు వీరిలో ఎవరి పేరిట తీసుకున్నా గానీ, చెల్లించే ప్రీమియంపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వార్షికంగా తన పేరిట, జీవిత భాగస్వామి, పిల్లల పేరిట చేసే వైద్య బీమా ప్రీమియం రూ.25,000పై ఈ పరిమితి పొందొచ్చు.

దీనికి అదనంగా తల్లిదండ్రుల వైద్య బీమా పాలసీకి చేసే చెల్లింపులు మరో రూ.25,000 వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. వీరు 60 ఏళ్లు దాటిన వారు అయితే రూ.30,000 వరకు అవకాశం ఉంది. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్‌) అయితే, ఏ సభ్యులు ప్రీమియం చెల్లించినా రూ.25,000 వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ముందస్తు వ్యాధి నిర్ధారణ పరీక్షల కోసం చేసే చెల్లింపులు రూ.5,000 వరకు కూడా మినహాయింపు అమల్లో ఉంది.
 
విద్యా రుణంపై వడ్డీ చెల్లింపులు
ఉన్నత విద్య కోసం రుణం తీసుకుని చేసే వడ్డీ చెల్లింపులకు సెక్షన్‌ 80ఈ కింద పన్ను మినహాయింపు ఉంది. పన్ను చెల్లింపుదారు, అతని జీవిత భాగస్వామి, పిల్లలు, లేదా చట్టబద్ధంగా వేరెవరైనా విద్యార్థి తన సంరక్షణలో ఉంటే, వారి పేరిట తీసుకునే విద్యా రుణాలకు పన్ను మినహాయింపు పొందొచ్చు.

కేవలం వడ్డీ రూపంలో చేసే చెల్లింపులకు, అది కూడా రుణం తీసుకున్న తర్వాత ఎనిమిదేళ్ల వరకు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. ఇంటర్‌ తర్వాత చేసే ఉన్నత విద్యా కోర్సుల కోసం తీసుకునే రుణాలకే ఈ ప్రయోజనం. వడ్డీ రూపంలో చెల్లింపుల పరిమితి లేదు. ఎంత ఉన్నా, ఆ మొత్తంపై పన్ను మినహాయింపు క్లెయిమ్‌ చేసుకోవచ్చు.  

రాయల్టీ ఆదాయానికీ మినహాయింపు...
రచయితలకు వారి రచనల ద్వారా వచ్చే ఆదాయం ఉంటే, వార్షికంగా రూ.3 లక్షలకు సెక్షన్‌ 80క్యుక్యుబి ప్రకారం పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. కాకపోతే రాయల్టీ ఆదాయం ఏక మొత్తంలో వచ్చి ఉండాలి. ఏక మొత్తంలో కాకుండా వాయిదాలుగా అందుకుంటే మాత్రం రాయల్టీ ఆదాయంలో 15 శాతానికే పన్ను మినహాయింపు పరిమితం అవుతుంది.

మేథో సంపత్తి హక్కులు
2003 ఏప్రిల్‌ 1 తర్వాత నమోదయిన ఏ పేటెంట్‌ ద్వారానైనా రాయల్టీ ఆదాయం అందుకుంటుంటే సెక్షన్‌ 80ఆర్‌ఆర్‌బి కింద ఒక ఏడాదిలో రూ.3లక్షల ఆదాయంపై పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది.


పన్ను వర్తించని ఆదాయాన్ని చూపించాలి
బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం, పోస్టాఫీసు పథకాలపై వచ్చే ఆదాయం కచ్చితంగా పన్ను పరిధిలోకి వస్తుంది. కానీ, 80 శాతం పన్ను చెల్లింపుదారులు వడ్డీ ఆదాయాన్ని చూపించడంలేదని ట్యాక్స్‌ స్పానర్‌ అనే పోర్టల్‌ పరిశీలనతో తేలింది. పన్ను చెల్లించకూడదన్న ఉద్దేశంతో,  పన్ను నోటీసు అందుకోకూడదన్న అభిప్రాయంతో ఈ ఆదాయాన్ని చూపించడం లేదని ట్యాక్స్‌ స్పానర్‌ డాట్‌ కామ్‌ సీఎఫ్‌వో కౌశిక్‌ చెప్పారు.  
సేవింగ్స్‌ బ్యాంకు ఖాతాలో బ్యాలన్స్‌లపై వడ్డీ ఆదాయం ఒక ఏడాదిలో రూ.10,000 వరకు పన్ను లేదని పైన చెప్పుకున్నాం. నిజానికి రూ.2.5 లక్షలను ఏడాది పాటు బ్యాంకులో ఉంచితే ఈ మేరకు వడ్డీ ఆదాయం వస్తుంది. రూ.10,000కు పైన వడ్డీ ఆదాయం అందుకునే వారు తక్కువ మందే ఉంటారు. కానీ, ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం రూ.10,000లోపు ఉన్నా పన్ను రిటర్నుల్లో తప్పకుండా ఆ ఆదాయాన్ని చూపించాలి.
   ఐటీఆర్‌–1లో ఎగ్జెంప్ట్‌ ఇన్‌కమ్‌ అనే కాలమ్‌లో ఇలా పన్ను రహిత ఆదాయాన్ని పేర్కొనాలి.
 డివిడెండ్‌ రూపంలో వచ్చే ఆదాయం ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.10 లక్షల వరకు ఉంటే సెక్షన్‌ 10 (34) కింద పన్ను ఉండదు. అలాగే, జీవిత బీమా పాలసీ మెచ్యూరిటీ రూపంలో వచ్చే ఆదాయం లేదా పరిహారానికి సెక్షన్‌ 10 (10డి) కింద పన్ను మినహాయింపు ఉంది. వీటిని సైతం రిటర్నుల్లో పేర్కొనడం ద్వారా పన్ను అధికారులకు సందేహాలు తలెత్తితే సమాధానం చెప్పడం సులభం అవుతుందని నిపుణుల సూచన.
   ఇక అధిక విలువతో కూడిన పెట్టుబడుల వివరాలను కూడా పన్ను రిటర్నుల్లో పేర్కొనాలని సూచిస్తున్నారు.  


విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించాలా?
ఇక్కడ నివసించేవారు, ఎన్‌ఆర్‌ఐలకు వేర్వేరుగా నిబంధనలు
 ఎన్ని రోజులున్నారన్న అంశం ఆధారంగా వర్గీకరణ
 స్వదేశంలో ఉండే వారు విదేశీ ఆదాయం చూపించాల్సిందే
 ఎన్‌ఆర్‌ఐలు భారత్‌లో ఆదాయాన్ని రిటర్నుల్లో పేర్కొనాలి
 రిటర్నుల దాఖలు పత్రాలు కూడా వేరే  

పనిచేస్తున్న కంపెనీ తరఫున కొన్ని రోజులు, నెలలు, సంవత్సరాల పాటు విదేశాలకు వెళుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. మరి విదేశీ క్లయింట్ల కోసం పనిచేయడం ద్వారా వీరు ఆర్జించే విదేశీ మారకాన్ని తమ పన్ను రిటర్నుల్లో చూపించాలా? స్వదేశానికి వెలుపల ఆర్జించిన మొత్తంపై పన్నుకు సంబంధించి నిబంధనలేంటి? విదేశీ ఆర్జనను పన్ను రిటర్నుల్లో ఎలా చూపించాలి? ఇలాంటి సందేహాలన్నిటికీ సమాధానమే ఈ కథనం...


విదేశీ ఆదాయం
భారతీయ పన్ను చట్టాలు పన్ను చెల్లింపుదారులను ఓ ఆర్థిక సంవత్సరంలో ఎన్ని రోజుల పాటు స్వదేశంలో ఉన్నారనే వివరాల ఆధారంగా వారిని నివాసితులు (రెసిడెంట్‌), నివాసేతరులు (నాన్‌ రెసిడెంట్‌)గా వర్గీకరించింది. వారి నివాస హోదాకు అనుగుణంగా భారతీయ పన్ను చట్టాల పట్ల వారికున్న బాధ్యతను విస్తృతంగా నిర్వచించాయి. ప్రతి ఆర్థిక సంవత్సరానికీ తమ హోదాను బట్టి వారు తమ ఆదాయాన్ని చూపించాలి.

పన్ను చట్టాల ప్రకారం... దేశంలో నివసించే ప్రతి పౌరుడూ, దేశం వెలుపల తాను ఆర్జించిన ఆదాయాన్ని తప్పనిసరిగా రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది. అదే ఎన్‌ఆర్‌ఐ అయితే కేవలం భారత్‌లో ఆర్జించిన దాన్నే స్వదేశంలో దాఖలు చేసే రిటర్నుల్లో చూపిస్తే సరిపోతుంది. ఒకే ఆర్థిక సంవత్సరంలో స్వదేశంలోను, విదేశంలోనూ ఒక కంపెనీ తరఫున పనిచేయడం ఇటీవల సాధారణంగా కనిపిస్తోంది.

కంపెనీలు కొందరు ఉద్యోగులను విదేశాల్లోని కార్యాలయాల్లో విధుల కోసం కొంత కాలం పాటు పంపిస్తున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ఇది ఎక్కువగా కనిపిస్తోంది. విదేశీ ప్రాజెక్టుల కోసం ఉద్యోగులను తరచుగా ఇలా పంపిస్తున్నాయి. ఆ పనికి చెల్లింపులను విదేశీ కార్యాలయం చేస్తుంటుంది. అప్పుడది విదేశీ ఆర్జన అవుతుంది. ఇక విదేశాల్లో ఉన్న ఇంటి నుంచి అద్దె రూపంలో కొందరికి ఆదాయం ఉండొచ్చు. ఇటువంటి ఆదాయాన్ని భారత్‌లో నివసించే వారు తప్పకుండా తమ రిటర్నుల్లో చూపించాల్సి ఉంటుంది.

రిటర్నుల దాఖలు
ఈ తరహా వ్యక్తులు అంటే విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించదలిస్తే వారికి ఐటీఆర్‌–1 వర్తించదు. విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించే వారు ఐటీఆర్‌–2ను తీసుకోవాల్సి ఉంటుంది. ఐటీఆర్‌–2 లేదా ఐటీఆర్‌–3 ఈ రెండింటిలో ఒక దానిని వారి ఆదాయ వివరాల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. ఎఫ్‌ఎస్‌ఐ షెడ్యూల్‌లో చూపించాలి.  


రెండు పన్నులు
భారత్‌లో నివసించే వారు తమ విదేశీ ఆదాయాన్ని రిటర్నుల్లో చూపించి ఆ మేరకు పన్ను చెల్లించడం తప్పనిసరి అని చెప్పుకున్నాం. అయితే, ఒకవేళ పన్నులను విదేశాల్లోనే మినహాయిస్తే ఆ ఆదాయాన్ని ఇక్కడ చూపించి పన్ను చెల్లిస్తే అప్పుడు రెండు సార్లు పన్నులు చెల్లించినట్టు అవుతుంది.

అందుకే ఒకసారి పన్ను మినహాయిస్తే దానిపై పన్ను చెల్లించక్కర్లేదు. పలు దేశాలతో మనకు ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం ఉంది. విదేశీ ఆదాయంపై పన్నును అక్కడే మినహాయించేస్తే ఇక్కడ మరోసారి పన్ను చెల్లించే పని లేకుండా ఉపశమనం పొందొచ్చు. దీన్నే విదేశీ పన్ను జమగా (ఎఫ్‌టీసీ) పేర్కొంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement