అవసరం ఎలాంటిదైనా..నెలకో కొంత
‘‘ఏమండీ డిసెంబర్ వస్తోంది! పిల్లలిద్దరి సెకండ్ టెర్మ్ ఫీజు కట్టేశారా?’’ అజయ్‌ని అడిగింది ఆయన భార్య సుహాసిని. ’అరె! మరచిపోయానే!! ఇప్పటికిప్పుడు 60 వేలు ఎలా?’ ఆలోచనలో పడ్డాడు అజయ్. ఈ సమస్య అజయ్ ఒక్కడిదే కాదు. స్వల్పకాలంలో డబ్బు అవసరమయ్యే స్కూలు ఫీజులు, ఇంట్లో శుభకార్యాలు, ఇంటి రిపేర్లు, విహారయాత్రలు... వీటికీ ప్లానింగ్ తప్పనిసరి. మరి ఇలాంటి స్వల్పకాలిక లక్ష్యాల కోసం దేన్లో పొదుపు చేయాలి? ఏవి మంచివి?
చాలామంది నెలనెలా కొంత మొత్తాన్ని తీసి పక్కన పెడుతుంటారు. కొందరు దాన్ని ఇంట్లోనే దాచుకుంటారు. మరికొందరు సేవింగ్స్ ఖాతాలోనే వదిలేస్తారు. కొందరైతే సిప్ వంటి సాధనాల ద్వారా షేర్ మార్కెట్లో పెడతారు. వీటిని చూసినట్లయితే... ఇంట్లో దాస్తే ఏ రాబడీ రాదు. సేవింగ్స్ ఖాతాలో వదిలేస్తే వడ్డీ అతితక్కువ వస్తుంది. షేర్లలో పెడితే రిస్కుంటుంది. మరి ఏం చేయాలి? ఇలా ఆలోచించేవారికి అక్కరకొచ్చేదే ఆర్‌డీ. అంటే రికరింగ్ డిపాజిట్.
చిన్న లక్ష్యాల కోసం...
మీరు రూ.20 వేల స్మార్ట్‌ఫోనుకు, రూ.25 వేలు విహారయాత్రకు, రూ.50 వేలు పిల్లల స్కూలు ఫీజుకు పెట్టాల్సి ఉంది. సాధారణంగా... స్కూలు ఫీజు తప్ప.. మిగతా రెండింటికీ డబ్బులుంటే చూద్దాంలే అనుకుంటాం. చాలా సందర్భాల్లో అంత మొత్తం ఒకేసారి సమకూరదు. ఆ సరదా తీరకపోనూ వచ్చు. ఆర్‌డీ ఉంటే ఇవి తీరనివేమీ కావు. ఎలాగంటే... ఫోన్ కోసం ప్రతి నెలా రూ. 2,000 చొప్పున పది నెలలు, వెకేషన్ కోసం ఏడాది పాటు రూ. 2,000, స్కూల్ ఫీజుల కోసం ఏడాది పాటు రూ.4,000 ఆర్‌డీ చేయడం మొదలు పెట్టి చూడండి. నెలకు రూ.8,000 వీటికోసం కేటాయించాల్సి వస్తుంది. అది కష్టమేమీ కాదు. కానీ ఏడాది తిరిగేసరికి మీ కోరికలన్నీ తీరుతాయి. పెపైచ్చు దీనిపై వడ్డీ కూడా వస్తుంది.
ఆర్‌డీ ఎందుకంటే...
దీని కనీస వ్యవధి 6 నెలలు. గరిష్ట వ్యవధి పదేళ్లు.
కనీసం రూ.100 (ఎస్‌బీఐ, ఆంధ్రా బ్యాంక్ లాంటివి) నుంచి ఆర్‌డీ చేయొచ్చు. ఐసీఐసీఐ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో ఈ మొత్తం రూ.500. పోస్టాఫీసులోనైతే నెలకు రూ.10 వేయొచ్చు.
వడ్డీ రేట్లు 7-10% దాకా ఉన్నాయి. మూడు నెలలకోసారి వడ్డీని లెక్కించి అసలుకు జమచేస్తారు.
గడువుకన్నా ముందే ఆర్‌డీని వెనక్కి తీసుకోవచ్చు. కొంత పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.
ఒకవేళ వెనక్కి తీసుకోవటం ఇష్టం లేకుంటే... ఆర్‌డీలో జమ అయిన మొత్తంలో 90 శాతం దాకా లోన్ తీసుకోవచ్చు.
ఆర్‌డీపై వచ్చే వడ్డీకి పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
స్వల్పకాలానికి సింపుల్ సాధనం..
కొత్తగా పొదుపు ఆరంభించిన వారు... హడావుడిగా ఏదో ఒక ఇన్వెస్ట్‌మెంట్ చేయకుండా ఆర్‌డీతో మొదలుపెట్టడం బెటర్. నెలనెలా కొంతమొత్తాన్ని నిర్దిష్ట కాలానికి డిపాజిట్ చేయటమే ఆర్‌డీ. దీనివల్ల క్రమం తప్పకుండా పొదుపు చేయడం అలవాటవుతుంది. ఒకటి రెండేళ్లు గడిచాక మెల్లగా మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి ఇతర సాధనాలపై అవగాహన పెంచుకుని ఇన్వెస్ట్‌మెంట్ మొదలుపెట్టొచ్చు.