
సెన్సెక్స్ 146 పాయింట్లు అప్
రెండు రోజుల నష్టాలకు బ్రేక్
ఐటీ, ఫార్మా షేర్ల జోరుతో గురువారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. దీంతో రెండు రోజుల నష్టాలకు బ్రేక్ పడింది. ఇటీవల నష్టపోయిన ఫార్మా, ఇతర షేర్లలో కొనుగోళ్లు జరగడం, ఎగుమతులు వరుసగా ఐదో నెలా కూడా పెరిగాయన్న గణాంకాల జోష్‌తో బీఎస్‌ఈ సెన్సెక్స్ 146 పాయింట్లు లాభపడి 28,301 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 53 పాయింట్లు లాభపడి 8,778 పాయింట్ల వద్ద ముగిశాయి. షేర్ల బైబ్యాక్ అంశాన్ని పరిశీలించడానికి డైరెక్టర్ల బోర్డ్ వచ్చే వారం సమావేశం కానున్నదని ఐటీ దిగ్గజం టీసీఎస్ వెల్లడించడం సెంటిమెంట్‌కు జోష్‌నిచ్చింది.
ఎగుమతులు 4.3 శాతం పెరిగాయన్న గణాంకాల కారణంగా మార్కెట్ సెంటిమెంట్ మెరుగుపడిందని బీఎన్‌పీ పారిబా మ్యూచువల్ ఫండ్ సీనియర్ ఫండ్ మేనేజర్ లక్ష్మణన్ చెప్పారు. వాహన షేర్లలో షార్ట్ కవరింగ్ చోటు చేసుకోవడం, అంతర్జాతీయ సంకేతాలు సానుకూలంగా ఉండడం కలసివచ్చాయి. సెన్సెక్స్ 28,224 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. స్వల్పసమయం స్వల్పంగా నష్టపోయినా, దాదాపు ట్రేడింగ్ అంతా లాభాల్లోనే సాగింది.