ఐటీసీ రూ.4,000 కోట్ల పెట్టుబడులు
♦ 2-3 ఏళ్లలో 8-9 ఫ్యాక్టరీల ఏర్పాటు
♦ ఐటీసీ ఫుడ్స్ సీఈఓ వి. ఎల్. రాజేశ్ వెల్లడి
న్యూఢిల్లీ: ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ కంపెనీ ఆహార ఉత్పత్తుల తయారీ కోసం దేశవ్యాప్తంగా 8-9 ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నది. ఈ ఫ్యాక్టరీల ఏర్పాటు కోసం 2-3 ఏళ్లలో రూ.4,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నామని ఐటీసీ తెలిపింది. తాము విక్రయిస్తున్న వివిధ కేటగిరీల ఆహార ఉత్పత్తుల తయారీ కోసం ఈ ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయనున్నట్లు ఐటీసీ ఫుడ్స్ సీఈఓ వి. ఎల్. రాజేశ్ తెలిపారు. కంపెనీ బ్రాండెడ్ ప్యాకేజ్‌డ్ ఫుడ్స్ డివిజన్ టర్నోవర్ గత ఆర్థిక సంవత్సరంలో 11% వృద్ధి చెంది రూ.7,097.49 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు.
సిగరెట్ల తర్వాత ఐటీసీ రెండో అతి పెద్ద వ్యాపారం ఆహార ఉత్పత్తులేనని వివరించారు. ఆరోగ్య స్పృహ ఉన్న వినియోగదారులకు కొత్తగా సన్‌ఫీస్ట్ ఫార్మ్‌లైట్ బిస్కట్స్‌ను మార్కెట్లోకి తెచ్చామని తెలిపారు. సన్‌ఫీస్ట్ ఫార్మ్‌లైట్ బిస్కట్లలో ఓట్స్ బిస్కట్లను ఆల్మండ్స్, రెజిన్స్, చాకొలెట్ వేరియంట్లలో అందిస్తున్నామన్నారు. బిస్కెట్ మార్కెట్లో హెల్త్ బిస్కట్ మార్కెట్ వాటా 1 శాతమేనని, ఈ కేటగిరి వేగంగా వృద్ధి సాధిస్తోందని వివరించారు. మధుమేహ బాధితుల కోసం గ్లూకోజ్‌ను విడుదలను నియంత్రించే ఆశీర్వాద్ ఆటాను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు.