అప్పుల సంక్షోభంలో కూరుకుపోయిన జెట్ ఎయిర్‌వేస్ పరిస్థితి రోజు రోజుకు మరింత ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. జెట్ ఎయిర్‌వేస్ నిర్వహణ బాధ్యతలు స్వీకరించిన బ్యాంకులు, వీలైనంత త్వరగా సంస్థ నుంచి తప్పుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం కంపెనీ ఈక్విటీలో మెజారిటీ వాటాను విక్రయించేందుకు రంగం సిద్ధం చేశాయి. ఈ వాటాల కొనుగోలుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తోంది. వాటాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి ఉన్న సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లు బ్యాంకుల కన్సార్షియానికి నాయకత్వం వహిస్తున్న ఎస్‌బీఐ సోమవారం వెల్లడించింది. ఈ బిడ్లను దాఖలు చేసేందుకు ఏప్రిల్ 10న చివరి తేదీగా పేర్కొంది.
బిడ్డర్లలో స్ట్రాటజిక్, అలాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తున్నారు. ముఖ్యంగా స్ట్రాటజిక్ ఇన్వెస్టర్లు ఏవియేషన్ సెక్టారుకు చెందినవారు అయి ఉండాలని నిబంధన విధించారు. అదే సమయంలో ఫైనాన్షియల్ ఇన్వెస్టర్లుగా ఈక్విటీ ఫండ్ మేనేజర్లు, ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ మేనేజర్లను బిడ్ వేసేందుకు ఆహ్వానిస్తోంది.
కాగా బ్యాంకులకు జెట్ ఎయిర్ వేస్ నుంచి మొత్తం రూ.8000 కోట్ల బకాయాలు తిరిగి రావాల్సి ఉంది. ఈ అప్పులను 26 బ్యాంకులు ఈక్విటీగా మార్చుకోవడంతో బ్యాంకుల వాటా 51 శాతానికి చేరింది. అలాగే జెట్ ఎయిర్వేస్ ప్రధాన ప్రమోటర్ నరేశ్ గోయల్, ఇతర సభ్యుల వాటా 51 శాతం\ నుంచి 25 శాతానికి తగ్గింది. అయితే ఆ మొత్తాన్ని ఈక్విటీ షేర్లుగా మార్చి ఆసక్తి ఉన్న బిడ్డర్లకు అప్పగించాలని బ్యాంకుల కన్సార్షియం నిర్ణయించింది. ఇప్పటికే కన్సార్షియం కనీసం 3.54 కోట్ల షేర్లను ఆఫర్ ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. అంటే మొత్తం వాటాలో ఇది 31.2 శాతంతో సమానం. జెట్ ఎయిర్‌వేస్ రుణ పరిష్కారానికి ఎస్‌బీఐ నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్షియం 180 రోజుల గడువు విధించుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment