మళ్లీ ఆభరణాల వర్తకుల సమ్మె
మద్దతివ్వని ప్రధాన సంఘాలు
న్యూఢిల్లీ: అభరణాలు, బులియన్ వర్తకులు సోమవారం నుంచి మళ్లీ సమ్మెకు దిగారు. వెండి మినహా ఇతర ఆభరణాలపై విధించిన ఒక్క శాతం సుంకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ, దేశంలోని ఇతర ప్రాంతాల్లో వర్తకులు మళ్లీ సమ్మె చేయడం ప్రారంభించారు. ఢిల్లీ, ఇతర ప్రధాన నగరాల్లో ఆభరణాల షోరూమ్‌లు మూతబడ్డాయని ఆల్ ఇండియా సరఫ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ సురీందర్ కుమార్ జైన్ చెప్పారు. మూడు రోజుల పాటు షాపులను పూర్తిగా మూసేయాలని దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న సమ్మె చేస్తున్న సంఘాలు ఉమ్మడిగా నిర్ణయించాయని వివరించారు.
కాగా సమ్మెకు మద్దతుగా ఆభరణాల వర్తకులు, కళాకారులు ఢిల్లీ లోని జంతరమంతర్ వద్ద ధర్నా చేశారు. రాజస్థాన్‌లోని జైపూర్, జోధ్‌పూర్, కోటలతో సహా పలు ప్రాంతాల్లోనూ, కాన్పూర్, ఉత్తర ప్రదేశ్‌ల్లోనూ పైగా ఆభరణాల షాపులను మూసేశారు. అయితే ఆల్ ఇండియా జెమ్స్ అండ్ జ్యూయలరీ ట్రేడ్ ఫెడరేషన్(జీజేఎఫ్), ఇండియా బులియన్ అండ్ జెవెలర్స్ అసోసియేషన్స్ తదితర ప్రధాన సంఘాలు ఈ సమ్మెకు మద్దతివ్వలేదు.