
ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్ భార్గవ్ పంజగుట్టలోని ఓ నగల షాపులో బంగారు నగలు కొనుగోలు చేశారు. రోజు బంగారం ధర ప్రకారం విలువకడితే కొన్న నగలకు మొత్తం రూ.86,000 వసూలు చేయాలి. కానీ, షాపులో మాత్రం బంగారంతో పాటు మరికొన్ని ఖర్చుల పేరుతో రూ.95,000 వసూలు చేశారు. అంటే మార్కెట్ ధర కంటే అదనంగా రూ.9000 తీసుకున్నారు. బిల్లులో బంగారం నాణ్యత పేర్కొనలేదు. ఆభరణాల్లో వాడిన స్టోన్ బరువుతో కలిపి ధర వేసి వసూలు చేశారు. ఇది మహానగరంలోని బంగారు షాపుల్లో వినియోగదారులకు ఎదురవుతున్న సమస్య.
సాక్షి,సిటీబ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో ఏ ఇంటిలో శుభకార్యం జరిగినా, ప్రత్యేక పండగలు వచ్చినా బంగారం కొనడం సంప్రదాయం. నమ్మకం ఆధారంగానే బంగారం వ్యాపారం విరజిల్లుతుంది. పసిడి కొనుగోళ్లు సీజన్‌ను బట్టి ఉపందుకుంటాయి. అయితే, ప్రజల ఈ బలహీనతనే వ్యాపారులు సొమ్ము చేసుకోవడం పరిపాటిగా మారింది. కళ్ల ముందే మాయ చేస్తున్నా ఏమాత్రం గుర్తించలేని వినియోగదారులు చేతి చమురు వదిలించుకొంటున్నారు. ఇక వజ్రాభరణాల్లో మేలిమి బంగారం నేతిబీరలో నెయ్యి చందంగానే మారింది. సాధారణంగా దుకాణదారుడిపై ఉన్న నమ్మకంతోనే వినియోగదారులు బంగారం కొంటుంటారు. అయితే, ఇక్కడే సదరు వ్యాపారులు వారికి శఠగోపం పెడుతున్నారు. ఆఫర్ల పేరుతో ఆకర్షించి, ‘తరుగు లేదు’ అంటూనే నిలువునా ముంచుతున్నారు. ఈ అక్రమాలను కట్టడిచేయాల్సిన తూనికల కొలతల శాఖ లక్షలాది రూపాయల మోసాలకు నామమాత్రపు జరిమానాతో సరిపెడుతున్నాయి. స్వచ్ఛత, తూకం మోసాలపై నమోదు చేసే కేసులు జరిమానాలకే పరిమితమవుతున్నాయి.
‘స్వచ్ఛత’లో మోసం ఇలా..
నగరంలోని ప్రముఖ జ్యువెలరీస్, షాపింగ్ మాల్స్ 24 క్యారెట్ల కంటే తక్కువ నాణ్యత కలిగిన బంగారాన్ని విక్రయిస్తుంటాయి. వజ్రాల నగ కేవలం 18 క్యారెట్‌తో ఉంటుంది. వ్యాపారులు 18 క్యారెట్ల అభరణాన్ని చేతిలో పెట్టి 22 క్యారెట్ల బిల్లు వసూలు చేస్తుంటారు. 22 క్యారెట్లు 18 క్యారెట్ల ఆభరణానికి మధ్య గ్రాముకు కనీసం రూ.500 నుంచి రూ.700 వరకు తేడా ఉంటుంది. ఈ లెక్కన 10 గ్రాముల బంగానికి దాదాపు రూ.7 వేల వరకు వినియోగదారులు మోసపోతున్నారు.
నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..
♦ బంగారం దుకాణాల్లో వినియోగదారులు కొనే నగలకు సంబంధించిన బిల్లులో ఖచ్చితంగా బంగారం నాణ్యత, బరువు, ఆభరణాల్లో వాడిన స్టోన్ బరువు, ధర విడివిడిగా పేర్కొనాలి.
♦ వస్తువు కొన్న రోజు బంగారం ధరతో పాటు 22 క్యారెట్, లేదా 24 క్యారెట్ అని స్పష్టంగా పేర్కొనాలి.
♦ మేకింగ్ చార్జీలు, వేస్టేజ్‌లను పన్నుల్లో కలపడం నిబంధనలకు విరుద్ధం. నికర బరువు (నెట్ వెయిట్) ప్రకారమే ధర వేయాలి.
ఉదాహరణకు ఒక ఆభరణం 100 గ్రాములు ఉంటే ఆ రోజు మార్కెట్‌లో ఉన్న బంగారం ధర ప్రకారమే వినియోగదారుల నుంచి తీసుకోవాలి. అలా కాకుండా వ్యాపారులు వేస్టేజ్ పేరుతో 15 నుంచి18 శాతం వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
మోసాలకు సూచికలు
♦ బంగారం నాణ్యతను తెలిపే ‘క్యారెక్టరైజేషన్ మిషన్’ లేక పోవడం
♦ ఒక మిల్లీ గ్రాము వరకు తూచే ఎలక్ట్రానిక్ త్రాసు వినియోగించక పోవడం
♦ స్టోన్ తూకం తీయక పోవడం, సరైన బిల్లు ఇవ్వక పోవడం
♦ స్వచ్ఛతను తెలిపే ధ్రువీకరణ పత్రాలు ఇవ్వక పోవడం
♦ ఎలక్ట్రానిక్ కాటాల వెనుక త్రాసును నియంత్రించే వీల్స్ బేరింగ్ మార్పచడం
♦ త్రాసుపై డిపార్ట్‌మెంట్ సీల్ లేకపోవడం.. ఉంటే ట్యాంపరింగ్ జరిగినట్లు కనిపించడం
మోసంపై ఫిర్యాదు చేయాలంటే..
బంగారం స్వచ్ఛత, తూకం, ధరపై అనుమానం ఉంటే తూనికల కొలతల శాఖ హెల్ప్‌లైన్ 1800 425 00333కు ఫోన్ చేయవచ్చు. లేదా 94901 65619 నంబర్‌కు ఎస్‌ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
మేలిమి బంగారానికే ‘హాల్‌మార్క్’
బిస్కెట్ రూపంలో విక్రయించే మేలిమి బంగారం స్వచ్ఛతతో ఉంటుంది. బంగారు ఆభరణాలపై హాల్ మార్క్ ముద్రణ తప్పనిసరి. భారతీయ ప్రమాణాల మండలి (బీఐఎస్) నిర్దేశించిన మేరకు ఆభరణాలు తయారు చేస్తేనే హాల్ మార్క్ చిహ్నం లభిస్తుంది. స్వచ్ఛమైన, హాల్ మార్క్ ముద్ర ఉన్న ఆభరణాలు విక్రయించేందుకు బీఐఎస్ అనుమతి అవసరం. ఒక్కో ఆభరణాన్ని పరీక్షించి, హాల్ మార్క్ ఇచ్చేందుకు అయ్యే ఖర్చు చాలా తక్కువ. బీఐఎస్ గుర్తించిన కేంద్రాలు జంటనగరాల్లో ఐదు ఉన్నాయి. వినియోగదారులు నష్టపోకుండా ఉండాలంటే హాల్ మార్కు ఆభరణాలే కొనుగోలు చేయాలి. హాల్‌మార్క్ లేని అభరణాలను కొనుగోలు చేసినవారు వాటి నాణ్యతపై అనుమానం ఉంటే అభరణాన్ని పరీక్షించువచ్చు.
స్వచ్ఛతపై దృష్టి అవసరం
బంగారం నగలకు సంబంధించిన బిల్లులో ఖచ్చితంగా నాణ్యత, బరువు, ఆభరణాల్లో వాడిన స్టోన్ బరువు, ధర విడివిడిగా ఉండాలి. ధరతో పాటు క్యారెట్ స్పష్టంగా పేర్కొనాలి. మేకింగ్ చార్జీలు, వేస్టేజీలను పన్నుల్లో కలపడం నిబంధనలకు విరుద్ధం. షాపుల్లో నాణ్యతను తెలియజేసే క్యారెక్టరైజేషన్ మిషన్ వినియోగించడం లేదు. వినియోదారుడు చాల జాగ్రత్త వహించాలి. బంగారం నాణ్యతను అడిగాలి. అనుమానం ఉంటే నాణ్యతను పరీక్షించుకోవాలి.– విమల్‌బాబు, డిప్యూటీ కంట్రోలర్, తూ.కొ.శాఖ