వొడాఫోన్ ఆపరేటింగ్ లాభం 10 శాతం డౌన్
ముంబై: దేశంలో రెండో పెద్ద టెలికం ఆపరేటింగ్ కంపెనీ.. వొడాఫోన్ ఇండియా ఆపరేటింగ్ లాభం 2016–17 ఆర్థిక సంవత్సరంలో 10.2 శాతం క్షీణించి రూ. 11,784 కోట్లకు పడిపోయింది.రిలయన్స్ జియో మార్కెట్లో ప్రవేశించిన తర్వాత పోటీ ఒత్తిడులు ఏర్పడటంతో ఇటీవల భారతి ఎయిర్‌టెల్, ఐడియా సెల్యులర్‌లు నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో వొడాఫోన్ కూడా ఆపరేటింగ్ లాభం తగ్గినట్లు వెల్లడించడం గమనార్హం. వొడాఫోన్ త్వరలో ఐడియా సెల్యులర్‌తో విలీనం కానున్న సంగతి తెలిసిందే. ముగిసిన ఆర్థిక సంవత్సరంలో తమ డేటా ఆదాయం 5 శాతం పెరిగి రూ. 8,467 కోట్లకు చేరిందని, తమ మొత్తం టెలికం ఆదాయంలో ఇది 5 శాతమేనని వొడాఫోన్ తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో తమ సర్వీసు వినియోగదారు సగటు ఆదాయం (ఏపీఆర్‌యూ)రూ. 158 కాగా, డాటా ఏపీఆర్‌యూ మాత్రం రూ. 160 నుంచి రూ. 140కి తగ్గినట్లు కంపెనీ తెలిపింది.