జియోకు జరిమానా.. ఎంతో తెలుసా?
జియోకు జరిమానా.. ఎంతో తెలుసా?
Published Sat, Dec 3 2016 8:16 AM | Last Updated on Tue, Oct 2 2018 4:34 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటోను అనుమతి లేకుండా ఉపయోగించుకున్నందుకు రిలయన్స్ జియో మీద జరిమానా విధించే అవకాశం కనిపిస్తోంది. అయితే.. ఈ జరిమానా ఎంతో తెలిస్తే మాత్రం కళ్లు తిరగక మానవు.. అక్షరాలా 500 రూపాయలు మాత్రమే!! దీనికి సంబంధించి చిహ్నాలు, పేర్ల అక్రమ వినియోగ నిరోధానికి సంబంధించిన చట్టంలో నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా ఇంతే విధించాలని ఉంది. ఈ విషయాన్ని కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ లిఖిత సమాధానంలో తెలిపారు. ప్రధాని ఫొటోను జియో ప్రకటనలలో వాడుకునేందుకు ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ఆయన తెలిపారు.
సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ నీరజ్ శేఖర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా రాథోడ్ ఈ విషయం చెప్పారు. ప్రకటనలలో ప్రధానమంత్రి ఫొటోను రిలయన్స్ జియో వాడుకుందన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలుసని ఆయన తన లిఖిత సమాధానంలో తెలిపారు. ఒక ప్రైవేటు సంస్థ తన ప్రకటనలలో ప్రధానమంత్రి ఫొటోను ఉపయోగించుకోవడంపై ప్రతిపక్షం తీవ్రంగా ప్రశ్నించింది. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత పేటీఎం ప్రకటనలలో కూడా ప్రధాని ఫొటో వచ్చిందని, దీన్ని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి ఏదైనా ఒక ప్రైవేటు కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ కాకుండా చూసే చట్టం ఏమైనా ఉందా అని నీరజ్ శేఖర్ ప్రశ్నించారు.
1950 నాటి చిహ్నాలు, పేర్ల (అసమాన వినియోగం నివారణ) చట్టాన్నివినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ పర్యవేక్షిస్తుందని, దాని ప్రకారం జాతీయ చిహ్నాలను గానీ, ముఖ్యమైన వ్యక్తుల ఫొటోలను గానీ అనుమతి లేకుండా ఉపయోగించకూడదని రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ చెప్పారు. అయితే, ఇప్పుడు మోదీ ఫొటో దుర్వినియోగంపై ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
Advertisement