సాక్షి,ముంబై : దేశంలో టెలికాం రంగంలో అతిపెద్ద సంచలనం రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ వినియోగదారులకు షాక్ ఇవ్వనుందా? తాజా అంచనాలు ఈ అనుమానాలనే బలపరుస్తున్నాయి. డేటా, వాయిస్ కాలింగ్ సేవలను అతి చవకగా భారతీయ వినియోగదారులకు విరివిగా అందుబాటులోకి తీసుకొచ్చిన జియో త్వరలోనే ధరలను భారీగా పెంచనుంది. ఈ మేరకు ప్రముఖ బ్రోకరేజ్ సంస్థలు విశ్లేషిస్తున్నాయి. త్వరలోనే జియో ధరలు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జేపీ మోర్గాన్ తన తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వివిధ చెల్లింపులకు గానూ జియో వేలకోట్ల రూపాయల అవసరం ఉంది. దీంతో జియో తన టారిఫ్‌లను పెంచే యోచనలో ఉందని అంచనా వేసింది.
దాదాపు 30 కోట్లకు పైగా కస్టమర్లు, విస్తారమైన నెట్‌వర్క్,1,75,000 టవర్లు కలిగి ఉన్న జియో తన నిర్వాహణ సామర్ధ్యం పెంచుకోడానికి, ఆపరేషనల్ వ్యయాలను తట్టుకోడం కోసం ప్రస్తుతం ఉన్న రేట్లను పెంచనుంది. రేట్లను సవరించి తద్వారా నిధులను సమీకరించుకోనుందని ప్రముఖ మార్కెట్ బ్రోకింగ్ సంస్థలు భావిస్తున్నాయి. మరోవైపు భారతీ ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా కంపెనీలు కూడా రానున్న కాలంలో టారిఫ్ ధరలను పెంచేందుకు సిద్ధపడుతున్ననేపథ్యంలో జియో ధరల వ్యూహాన్ని మార్చుకోనుందని కోటక్ సెక్యూరిటీస్ కూడా అంచనా వేస్తోంది.
2016లో టెలికాం రంగంలో జియో ఎంట్రీ ఒక సంచలనంగా మారింది. దాదాపు 306.7 మిలియన్ కస్టమర్లను సొంతం చేసుకున్న జియో 2019 నాలుగో క్వార్టర్ ఫలితాల్లో నెట్ ప్రాఫిట్‌లో దాదాపు 65శాతం వృద్ధిని కనబరిచింది. అంతేకాదు 2019 మార్చి నాటికి దేశంలోనే అతిపెద్ద టెలికాం ఆపరేటర్‌గా అవతరించిన జియో రూ.11,100 కోట్ల ఆదాయాన్ని సాధించింది.అయితే నెట్‌వర్క్ ఆపరేటింగ్ వ్యయాలు దాదాపు 88 శాతం జంప్ జేయడంతో దాదాపు రూ.9 వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవలసి ఉంది. ఈ నేపథ్యంలోనే జియో తన టారిఫ్‌లను సవరించవచ్చని మార్కెట్ ఎనలిస్టులు పేర్కొంటున్నారు.
రిలయన్స్ జియోలో జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టనుందట. సుమారు 2–3 బిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్‌మెంట్ ఉండొచ్చని తెలుస్తోంది. వాటాల విక్రయం ద్వారా వ్యాపార సామ్రాజ్య రుణభారాన్నితగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో తాజా వార్తలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కాగా టెలికం మార్కెట్లో విప్లవం సృష్టించిన జియో త్వరలోనే జియో గిగాఫైబర్‌తో మరో విప్లవానికి సిద్ధమవుతోంది. నెలకు కేవలం రూ.600కే గిగాఫైబర్ ద్వారా బ్రాడ్‌బ్యాండ్, ల్యాండ్ లైన్ ఫోన్, టీవీ చానళ్ల ప్రసారాల సేవలను అందించనుందని వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment