కేశోరామ్ టైర్ల యూనిట్... జేకే టైర్ చేతికి
రూ.2,195 కోట్లతో కొనుగోలు పూర్తి
న్యూఢిల్లీ: జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు చెందిన టైర్ల తయారీ యూనిట్ కావెండిష్ ఇండస్ట్రీస్ కొనుగోలును పూర్తి చేసింది. బికే బిర్లా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు హరిద్వార్‌లో ఉన్న టైర్ల తయారీ యూనిట్‌ను జేకే టైర్ పూర్తి అనుబంధ సంస్థ జేకే టైర్ అండ్ జేకే ఏషియా పసిఫిక్ రూ.2,195 కోట్లకు కొనుగోలు చేసింది. మూడు టైర్ల ప్లాంట్లు ఉన్న ఈ యూనిట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కోటి టైర్లు. ఈ యూనిట్‌ను చేజిక్కించుకోవడంతో అధిక వృద్ధి ఉన్న టూ, త్రీ వీలర్ టైర్ల సెగ్మెంట్లోకి ప్రవేశించామని జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ పేర్కొంది.
అంతేకాకుండా ఈ యూనిట్ కొనుగోలుతో తమ ట్రక్, బస్సు రేడియల్ టైర్ల సెగ్మెంట్ మరింత పటిష్టమవుతుందని కంపెనీ సీఎండీ రఘుపతి సింఘానియా పేర్కొన్నారు. ఈ ప్లాంట్ కొనుగోలుకు అంతర్గత వనరులు, రుణాల ద్వారా నిధులు సమకూర్చుకున్నామని వివరించారు. ఈ ప్లాంట్ చేజిక్కించుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ వ్యాపారం ద్వారా రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 15 రోజుల్లో హరిద్వార్ యూనిట్‌లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. జేకే టైర్ షేర్ బీఎస్‌ఈలో సోమవారం 1% లాభంతో రూ.86 వద్ద ముగిసింది.