JK Tyre & Industries
-
ప్రీమియం కారు టైర్లు లెవిటాస్ ఆల్ట్రాను విడుదల చేసిన జెకె టైర్
-
రెండేళ్లలో 3.5 కోట్లకు ఉత్పత్తి సామర్థ్యం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 800 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులు పూర్తయితే 2025 నాటికి తమ వార్షిక టైర్ల ఉత్పత్తి సామర్థ్యం 3.5 కోట్లకు చేరుతుందని జేకే టైర్స్ ఎండీ అన్షుమన్ సింఘానియా వెల్లడించారు. ఇప్పుడు ఇది 3.2 కోట్లుగా ఉన్నట్లు మంగళవారమిక్కడ కొత్త లెవిటాస్ అల్ట్రా టైర్ల ఆవిష్కరణ సందర్భంగా విలేకరుల సమావేశంలో తెలిపారు. తమకు భారత్‌లో 9 ప్లాంట్లు, మెక్సికోలో మూడు ప్లాంట్లు ఉన్నాయన్నారు. అలాగే, 650 పైగా బ్రాండ్ అవుట్‌లెట్స్ ఉన్నాయని, ఏడాది వ్యవధిలో మరో 200 పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా టైర్ల పరిశ్రమ ప్రస్తుతం రూ. 70,000 కోట్ల స్థాయిలో ఉందని, 2025 నాటికి ఇది రూ. 1 లక్ష కోట్ల స్థాయికి చేరగలదని అంచనా వేస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ (ఇండియా) అనుజ్ కథూరియా తెలిపారు. మరోవైపు, లగ్జరీ కార్ల కోసం అధునాతనమైన లెవిటాస్ అల్ట్రా టైర్లను రూపొందించినట్లు వివరించారు. యూరప్ ప్రమాణాలతో దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసిన ఈ టైర్లు ఏడు సైజుల్లో లభ్యమవుతాయని చెప్పారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్లో సింహభాగం వాటా రూ. 40 లక్షలు–రూ. 80 లక్షల కార్లది ఉంటోందని కథూరియా వివరించారు. -
పంక్చర్లకీ చెక్..!ఈ టైర్లు వాటంతంటా అవే సెల్ఫ్ హీల్..!
ప్రముఖ టైర్స్ అండ్ ట్యూబ్స్ తయారీ సంస్థ జేకే టైర్స్ అండ్ ఇండస్ట్రీస్ భారత మార్కెట్లలోకి సరికొత్త టైర్లను లాంచ్ చేసింది. తొలిసారిగా టైర్లలో పంక్చర్ గార్డ్ టెక్నాలజీని తీసుకువస్తోనట్లు జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ తెలియజేసింది. వాటంతటా అవే సెల్ఫ్ హీల్..! ఫోర్ వీలర్ల కోసం పంక్చర్ గార్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుందని జేకే టైర్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ టెక్నాలజీ సహాయంతో టైర్లు పంక్చర్ అయినప్పుడు గాలి బయటకు పోకుండా సెల్ఫ్ హీల్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఆటోమెటిక్ ప్రాసెస్ ద్వారా టైర్ లోపల సెల్ఫ్-హీలింగ్ ఎలాస్టమర్ ఇన్నర్ కోట్ సహాయంతో ఇది సాధ్యమవుతోందని జేకే టైర్స్ తెలియజేసింది. 6 ఎంఎం వరకూ మందంతో ఉండే మేకులు, ఇతరత్రా వస్తువులు టైర్‌కు దిగితే...ఇబ్బంది లేకుండా వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగించవచ్చునని పేర్కొంది. ఇక టైర్ అరిగిపోయేంత వరకు పంక్చర్ల బాధే ఉండదని కంపెనీ అభిప్రాయపడింది. వాహనదారుల కోసం 2020లో స్మార్ట్ టైర్ టెక్నాలజీని పరిచయం చేశామని , ఇప్పుడు పంక్చర్ గార్డ్ టెక్నాలజీని అందిస్తున్నామని జేకే టైర్ సీఎండీ రఘుపతి సింఘానియా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో వాహనదారుల కోసం అదిరిపోయే టెక్నాలజీతో టైర్లను తెచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. చదవండి: కలిసొచ్చిన రష్యా-ఉక్రెయిన్ వార్..! తొలిసారి టాప్-5 క్లబ్‌లోకి భారత్..! -
జేకే టైర్- సాగర్ సిమెంట్స్.. స్పీడ్
వరుస లాభాలకు ట్రేడర్లు బ్రేక్ వేయడంతో దేశీ స్టాక్ మార్కెట్లు వెనకడుగు వేస్తున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 212 పాయింట్లు క్షీణించి 40,495ను తాకింది. నిఫ్టీ 60 పాయింట్లు నీరసించి 11,878 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) ద్వితీయ త్రైమాసికంలో అంచనాలకు అనుగుణమైన ఫలితాలు సాధించడంతో ఓవైపు జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్, మరోపక్క సాగర్ సిమెంట్స్ కౌంటర్లకు డిమాండ్ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో నష్టాల మార్కెట్లోనూ ఈ షేర్లు భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ నికర లాభం 38 శాతం క్షీణించి రూ. 105 కోట్లకు పరిమితమైంది. తక్కువ పన్ను వ్యయాల కారణంగా గతేడాది క్యూ2లో అధిక లాభాలు నమోదైనట్లు నిపుణులు పేర్కొంటున్నారు. కాగా.. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 6 శాతం పుంజుకుని రూ. 2,275 కోట్లను తాకింది. నిర్వహణ లాభం(ఇబిటా) మరింత అధికంగా 20 శాతం ఎగసి రూ. 367 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో జేకే టైర్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం జంప్‌చేసి రూ. 66ను అధిగమించింది. ప్రస్తుతం 6 శాతం లాభంతో రూ. 64 వద్ద ట్రేడవుతోంది. సాగర్ సిమెంట్స్ లిమిటెడ్ ఈ ఏడాది క్యూ2(జులై- సెప్టెంబర్)లో సాగర్ సిమెంట్స్ నికర లాభం 10 రెట్లు ఎగసి రూ. 50 కోట్లను అధిగమించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం 23 శాతం పుంజుకుని రూ. 326 కోట్లను తాకింది. నిర్వహణ లాభ(ఇబిటా) మార్జిన్లు 16 శాతం నుంచి రెట్టింపై 32 శాతాన్ని తాకాయి. క్యూ2లో దాదాపు 21 శాతం మెరుగుపడిన ధరలు(రియలైజేషన్లు) పటిష్ట పనితీరుకు దోహదం చేసినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సాగర్ సిమెంట్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 9 శాతం దూసుకెళ్లి రూ. 750కు చేరింది. ఇది 52 వారాల గరిష్టంకాగా.. ప్రస్తుతం 6 శాతం ఎగసి రూ. 731 వద్ద ట్రేడవుతోంది. -
కేశోరామ్ టైర్ల యూనిట్... జేకే టైర్ చేతికి
రూ.2,195 కోట్లతో కొనుగోలు పూర్తి న్యూఢిల్లీ: జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ కంపెనీ కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు చెందిన టైర్ల తయారీ యూనిట్ కావెండిష్ ఇండస్ట్రీస్ కొనుగోలును పూర్తి చేసింది. బికే బిర్లా గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్ షిప్ కంపెనీ కేశోరామ్ ఇండస్ట్రీస్‌కు హరిద్వార్‌లో ఉన్న టైర్ల తయారీ యూనిట్‌ను జేకే టైర్ పూర్తి అనుబంధ సంస్థ జేకే టైర్ అండ్ జేకే ఏషియా పసిఫిక్ రూ.2,195 కోట్లకు కొనుగోలు చేసింది. మూడు టైర్ల ప్లాంట్లు ఉన్న ఈ యూనిట్ వార్షిక ఉత్పత్తి సామర్థ్యం కోటి టైర్లు. ఈ యూనిట్‌ను చేజిక్కించుకోవడంతో అధిక వృద్ధి ఉన్న టూ, త్రీ వీలర్ టైర్ల సెగ్మెంట్లోకి ప్రవేశించామని జేకే టైర్ అండ్ ఇండస్ట్రీస్ పేర్కొంది. అంతేకాకుండా ఈ యూనిట్ కొనుగోలుతో తమ ట్రక్, బస్సు రేడియల్ టైర్ల సెగ్మెంట్ మరింత పటిష్టమవుతుందని కంపెనీ సీఎండీ రఘుపతి సింఘానియా పేర్కొన్నారు. ఈ ప్లాంట్ కొనుగోలుకు అంతర్గత వనరులు, రుణాల ద్వారా నిధులు సమకూర్చుకున్నామని వివరించారు. ఈ ప్లాంట్ చేజిక్కించుకోవడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో దేశీయ వ్యాపారం ద్వారా రూ.10,000 కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 15 రోజుల్లో హరిద్వార్ యూనిట్లో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభిస్తామని తెలిపారు. జేకే టైర్ షేర్ బీఎస్ఈలో సోమవారం 1% లాభంతో రూ.86 వద్ద ముగిసింది.