హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దాదాపు రూ. 800 కోట్లతో చేపట్టిన విస్తరణ పనులు పూర్తయితే 2025 నాటికి తమ వార్షిక టైర్ల ఉత్పత్తి సామర్థ్యం 3.5 కోట్లకు చేరుతుందని జేకే టైర్స్ ఎండీ అన్షుమన్ సింఘానియా వెల్లడించారు. ఇప్పుడు ఇది 3.2 కోట్లుగా ఉన్నట్లు మంగళవారమిక్కడ కొత్త లెవిటాస్ అల్ట్రా టైర్ల ఆవిష్కరణ సందర్భంగా విలేకరుల సమావేశంలో తెలిపారు. తమకు భారత్‌లో 9 ప్లాంట్లు, మెక్సికోలో మూడు ప్లాంట్లు ఉన్నాయన్నారు.
అలాగే, 650 పైగా బ్రాండ్ అవుట్‌లెట్స్ ఉన్నాయని, ఏడాది వ్యవధిలో మరో 200 పెంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. దేశీయంగా టైర్ల పరిశ్రమ ప్రస్తుతం రూ. 70,000 కోట్ల స్థాయిలో ఉందని, 2025 నాటికి ఇది రూ. 1 లక్ష కోట్ల స్థాయికి చేరగలదని అంచనా వేస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్ (ఇండియా) అనుజ్ కథూరియా తెలిపారు. మరోవైపు, లగ్జరీ కార్ల కోసం అధునాతనమైన లెవిటాస్ అల్ట్రా టైర్లను రూపొందించినట్లు వివరించారు. యూరప్ ప్రమాణాలతో దేశీయ పరిస్థితులకు అనుగుణంగా తయారు చేసిన ఈ టైర్లు ఏడు సైజుల్లో లభ్యమవుతాయని చెప్పారు. ప్రస్తుతం ఈ సెగ్మెంట్‌లో సింహభాగం వాటా రూ. 40 లక్షలు–రూ. 80 లక్షల కార్లది ఉంటోందని కథూరియా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment