ఉద్యోగ నియామకాలు 27 శాతం జంప్..
న్యూఢిల్లీ: దేశంలో ఉద్యోగ నియామకాలు మే నెలలో 27 శాతం మేర పెరిగాయి. ప్రధానంగా ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ రంగాల్లోని నియామకాల్లో మంచి జోరు కొనసాగింది. ఈ విషయాలు నౌకరి.కామ్ నివేదికలో వెల్లడయ్యాయి. ఈ ఏడాది మేలో నౌకరి జాబ్ స్పీక్ ఇండెక్స్ 1,993 వద్ద నిలిచింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే సూచీలో 27 శాతం మేర వృద్ధి నమోదయ్యింది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లోని నిపుణుల డిమాండ్ వరుసగా 33%, 49% మేర పెరిగింది. సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, అకౌంట్స్ నిపుణుల డిమాండ్‌లోనూ ఇదే ట్రెండ్ కనిపించింది. నగరాల వారీగా ఉద్యోగ నియామకాలను పరిశీలిస్తే.. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 58% వృద్ధి నమోదయ్యింది. ముంబై, బెంగళూరులలో వరుసగా 41%, 35% మేర వృద్ధి జరిగింది.
ఆశావహంగా కంపెనీలు!
ప్రపంచంలోని ఇతర దేశాల కన్నా మన కంపెనీలే ఉద్యోగ నియామక ప్రక్రియపై ఎక్కువ ఆశావహంగా ఉన్నాయి. మన తర్వాతి స్థానంలో జపాన్ ఉంది. మ్యాన్‌పవర్ గ్రూప్ సర్వే ప్రకారం.. సర్వేలో పాల్గొన్న 37 శాతం కంపెనీలు వచ్చే త్రైమాసిక పు నియామకాల్లో వృద్ధి నమోదవుతుందని అభిప్రాయపడ్డారు. ఒక శాతం కంపెనీలు నియామకాలు తగ్గుతాయని పేర్కొన్నాయి.