జోయాలుక్కాస్ను భారీగా విస్తరిస్తున్నాం
సంస్థ చైర్మన్ జోయ్ ఆలుక్కాస్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ జ్యువెలరీ వ్యాపారంలో జోయాలుక్కాస్ విజయవంతం ముందుకు వెళ్తుందని జోయాలుక్కాస్ చైర్మన్ అండ్ ఎండీ జోయ్ ఆలుక్కాస్ తెలిపారు. హైదరాబాద్ నగరంలోని జోయాలుక్కాస్ షోరూమ్‌లు వ్యాపారంలో అంచనాలకు మించి పోయాయని తెలిపారు. అందుకే మరో పెద్ద జోయాలుక్కాస్ షోరూమ్‌ను తాజాగా పంజాగుట్టలో ప్రారంభించామన్నారు. శనివారం జోయాలుక్కాస్ షోరూమ్ ప్రారంభం అనంతరం ఆయన సాక్షికి ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు...
121వ షోరూమ్ ఇది...
ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే జోయాలుక్కాస్ షోరూమ్‌లు 120 వరకు ఉన్నాయి. పంజాగుట్టలో ప్రారంభమైన దానితో కలిపితే 121వది. మా సంస్థల్లో ఎక్కడ షోరూమ్ ప్రారంభించినా అక్కడి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. ఏపీ, తెలంగాణలో కలిసి 18 జ్యూయలరీ షోరూమ్‌లు ఉన్నాయి. ప్రతి ఏడాది 12 నుంచి 18 షోరూమ్‌లు ఓపెన్ చేస్తున్నాం. 11 దేశాల్లో ఉన్న మా సంస్థల్లో 99% ఉద్యోగాలు స్థానికులకే ఇస్తున్నాం. 2015-16కు 14 షోరూమ్‌లు, 2016-17లో 8 నుంచి 9 షోరూమ్‌లు ప్రారంభించనున్నాం. ఇప్పటికి దేశవ్యాప్తంగా 65 షోరూమ్స్ ఉన్నాయి.
జిల్లాలకూ...
2020 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 200 జోయాలుక్కాస్ షోరూమ్‌లు ప్రారంభించటం ధ్యేయం. అంతేకాదు జిల్లాలకు కూడా విస్తరించాలని ఆలోచిస్తున్నాం. ఇప్పటి లాగా ప్రజలు ఆదరించి, అభిమానిస్తే విస్తరణ సులభతరం అవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా మా టర్న్‌వర్ రెండు బిలియన్ డాలర్లు. అందులో ఇక్కడ రూ. 6 వేల కోట్లు టర్నోవర్ ఉంది. పంజాగుట్ట లాంటి షోరూమ్‌ల్లో రూ. 150 కోట్ల విలువైన స్టాక్ ఉంటోంది. ఇక్కడ జ్యువెలరీ వ్యాపార వృద్ధి 5 నుంచి 6 శాతం ఉంది. అది కాస్తా 12 నుంచి 15 శాతం పెరగాల్సివుంది.
ఐపీవో ప్రణాళిక...
విస్తరణ కోసం మార్కెట్ ద్వారా నిధులు సమీకరించేందుకు తొలి పబ్లిక్ ఇష్యూ జారీచేయాలన్న ప్రణాళిక వుంది. జ్యువెలరీతో సహా పలు ఇతర వ్యాపారాలు కూడా మేము చేస్తున్నాం. జోయాలుక్కాస్ వ్యాపారాలు భారత్‌తో పాటు యూఏఈ, సౌదీ అరేబియా, బెహ్రెయిన్, ఒమన్, కువైట్, కతార్, సింగపూర్, మలేషియా, లండన్‌లలో నడుస్తున్నాయి. మా వ్యాపారాల్లో జ్యువెలరీ, ద్రవ్య మార్పిడి, ఫ్యాషన్, టెక్స్ టైల్స్, లగ్జరీ విమానాలు, మాల్స్, రియాల్టీలు ఉన్నాయి. జోయాలుక్కాస్ ప్రపంచ వ్యాప్తంగా 7,000 మంది నిపుణులకు ఉద్యోగాలు కల్పించింది.