
న్యూఢిల్లీ: ఐషర్ మోటార్స్ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబర్ క్వార్టర్లో స్వల్పంగానే పెరిగింది. గత క్యూ3లో రూ.521 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 2 శాతం వృద్ధితో రూ.533 కోట్లకు పెరిగిందని ఐషర్ మోటార్స్ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.2,316 కోట్ల నుంచి రూ.2,488 కోట్లకు చేరుకుంది. టూ వీలర్ల విభాగం, రాయల్ ఎన్‌ఫీల్డ్ ఆదాయం రూ.2,269 కోట్ల నుంచి 3 శాతమే పెరిగి రూ.2,341 కోట్లకు పెరిగిందని ఐషర్ మోటార్స్ డైరెక్టర్, సీఈఓ సిద్ధార్థ లాల్ తెలిపారు.
6 శాతం తగ్గిన రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు
గత క్యూ3లో 2.02 లక్షలుగా ఉన్న రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు ఈ క్యూ3లో 1.93 లక్షలకు తగ్గాయని సిద్ధార్థ లాల్ వెల్లడించారు. వాణిజ్య వాహన అమ్మకాల కంపెనీ వోల్వో ఐషర్ కమర్షియల్ వెహికల్స్ (వీఈ సీవీ) ఆదాయం రూ.2,590 కోట్ల నుంచి 9 శాతం పెరిగి రూ.2,818 కోట్లకు వృద్ధి చెందిందని తెలిపారు.
ప్రీమియమ్ బైక్ అమ్మకాలు పెరుగుతాయ్...
గత ఏడాది చివరి ఆరు నెలలు టూవీలర్ మార్కెట్‌కు గడ్డుకాలమని లాల్ వ్యాఖ్యానించారు. బీమా వ్యయాలు పెరగడం, ముడి పదార్ధాలు ధరలు అధికం కావడం, ప్రభుత్వ నిబంధనల కారణంగా భద్రతా ప్రమాణాల పెంపు కారణంగా ఉత్పత్తి వ్యయాలు పెరగడం... తదితర అంశాలు ప్రతికూల ప్రభావం చూపించాయన్నారు. ఖరీదైన బైక్‌ల అమ్మకాలు పెరగడం భవిష్యత్తులో కొనసాగుతుందని ఆయన అంచనా వేశారు.
ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐషర్ మోటార్స్ షేర్ 0.79 శాతం నష్టంతో రూ.20,674 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment