నాట్కోకు తొలిగిన అడ్డంకి
సాక్షి ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ చికిత్సలో వినియోగించే అబ్రాక్సిస్ ఔషధ పేటెంట్ విషయంలో రాష్ట్రానికి చెందిన నాట్కో ఫార్మాకు అడ్డంకి తొలగిపోయింది. అమెరికా సంస్థ అబ్రాక్సిస్ బయోసెన్సైస్ ఔషధ ఉత్పత్తి అయిన అబ్రాక్సేన్‌కు పేటెంట్ మంజూరులో చుక్కెదురయింది.
అబ్రాక్సేన్ తయారీలో మేథో హక్కులకేమీ భంగం కలగడం లేదని, ఉత్పత్తి విధానం సరళమైనది కావడంతో అబ్రాక్సిస్‌కు పేటెంట్ జారీ చేయరాదని నాట్కో కంపెనీ పేటెంట్ సంస్థ ఎదుట తన వాదనలు వినిపించింది. నాట్కో వాదనలతో ఏకీభవించిన పేటెంట్ కార్యాలయం అబ్రాక్సేన్‌కు పేటెంట్ నిరాకరిస్తూ ఇటీవల తీర్పు వెలువరించింది. ఇది దేశీయ కంపెనీలకు ఎంతో ఊరట కలిగించే పరిణామం.వివరాల్లోకెళితే... అబ్రాక్సేన్‌కు సరిసమానమైన బయోసిమిలర్ అల్బూపాక్స్‌ను నానోటెక్నాలజీ ఆధారంగా నాట్కో సంస్థ 2008లోనే ఉత్పత్తి చేసింది.
టాక్సిన్లు (విష పూరితాలు) అధికంగా ఉండే ఈ ఔషధ వినియోగం ఎంత మాత్రం సురక్షితం కాదని అబ్రాక్సిస్ లోకల్ పార్ట్‌నర్ బెంగుళూరుకు చెందిన బయోకాన్ సంస్థ డ్రగ్ కంట్రోలర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో నాట్కో ఆ ఉత్పత్తిని ఉపసంహరించుకుంది. 2011లో డ్రగ్ కంట్రోలర్ అభ్యంతరాలను తోసిరాజని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నాట్కో ఔషధ ఉత్పత్తికి అనుమతించినా సంస్థ ముందుకు రాలేదు. పేటెంట్ కార్యాలయంలో పోరాటం తప్ప ఉత్పత్తి మార్కెట్లోకి తెచ్చే విషయంలో ఉత్సాహం చూపించలేదు.
అడ్డు తొలిగింది.. అయినా నిరుత్సాహమే...
ఇదీ రాష్ట్రానికి చెందిన నాట్కో ఫార్మా పరిస్థితి. కేన్సర్స్ చికిత్సకు సంబంధించి కొత్త ఉత్పత్తులు మార్కెట్లో తెచ్చేందుకు ఎప్పుడూ ముందుండే నాట్కో అల్బూపాక్స్ ఔషధ విషయంలో జంకుతోంది. రూ 200 కోట్ల రొమ్ము కేన్సర్ మార్కెట్లో నాట్కో పొందాల్సిన ప్రతి ఫలాన్ని పోటీ సంస్థలైన సిప్లా, పెనేషియా బయోటెక్, ఫ్రెసీనియస్ కాబీ ఆంకాలజీ ఇండియా (గతంలో డాబర్ ఇండియా ) లాంటి సంస్థలు అనుభ విస్తున్నాయి. మేధో హక్కుల పోరాటం చేస్తున్న నాట్కో ఫార్మా మాత్రం ఈ డ్రగ్ తయారీపై వెనకంజ వేయడం విశ్లేషకులను ఆశ్చర్య పరుస్తోంది. ఈ విషయమై కంపెనీ అధికారుల్ని సంప్రదించడానికి ప్రయత్నించినా, వారు అందుబాటులోకి రాలేదు.
ఏడాదిలో మూడింతలు పెరిగిన నాట్కో షేర్...
నాట్కో ఫార్మా స్టాక్ మార్కెట్లో ఒక ఏడాదిలో మూడింతలు పెరిగింది. పేటెంట్ తీర్పు ఈ నెల 18న వెల్లడైంది. 20 వ తేదీన కంపెనీ షేర్ ధర 52 వారాల గరిష్ట ధర రూ. 1210కి చేరింది. గత నెలరోజులుగా చూస్తే షేర్ కనిష్ట ధర రూ. 725.90 కాగా గరిష్ట ధర రూ. 725.90గా నమోదైంది. ఇక గత వారం రోజుల్లో షేర్ ధర మాంచి జోరు మీదుంది. కనిష్ట ధర రూ. 941 కాగా గరిష్ట ధర రూ. 1210. అంటే వారం రోజుల్లో షేర్ ధర రూ.270 పెరిగింది. నెల రోజుల వ్యవధిలో రూ 485 పెరగటం గమనార్హం. షేర్ 52 వారాల కనిష్ట ధర రూ. 430 గతేడాది జూలైలో నమోదైంది.