
శ్రీసిటీ పరిశ్రమలకు అనువుగా
కృష్ణపట్నం పోర్టు సేవలు...
సత్యవేడు: శ్రీసిటీలోని పరిశ్రమలకు అత్యంత అనువుగా కృష్ణపట్నం పోర్టు సేవలు లభిస్తాయని కృష్ణపట్నం పోర్టు కంపెనీ (కేపీసీటీ) సీఈవో, డెరైక్టర్ అనిల్ యెండ్లూరి శ్రీసిటీలోని పరిశ్రమల యాజమాన్యాలకు చెప్పారు. బుధవారం శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో పోర్టు యాజమాన్యం నిర్వహించిన శ్రీసిటీ కస్టమర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పలు పోర్టు సేవలను వివరించారు. రోడ్డు, రైలు కనెక్టివిటీ, తక్కువ చార్జీలు, నిర్ణీత సమయానికి సరఫరా ఇంకా పలు అంశాల తమ ప్రత్యేకతలుగా ఆయన పేర్కొన్నారు. రాష్టంలో నేడు అత్యంత చెప్పుకోదగ్గ ప్రాజెక్టులుగా శ్రీసిటీ, కేపీసీటీలని అభివర్ణించారు. ఈ రెండూ ప్రాజెక్టులూ 8 ఏళ్ళక్రితం ప్రస్ధానం ప్రారంభించి, ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ప్రతిష్టాత్మకంగా ఎదిగాయన్నారు. ఈకార్యక్రమంలో సెజ్ డెవలప్ మెంట్ కమిషనర్ ఎస్‌కె సమల్, శ్రీసిటీ ప్రెసిడెంట్(వర్క్స్) సతీష్‌కామత్, పలు పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.