
సూచీలు ముందుకే పయనిస్తున్నాయి. కానీ, అన్ని లార్జ్‌క్యాప్ పథకాలు సూచీలతో పోలిస్తే రాబడుల పరంగా షార్ప్‌గా ఉన్నాయంటే... అవునని చెప్పలేం. అన్ని పథకాలు సూచీలకు దీటుగా, సూచీలను మించి రాబడులను అన్ని సమయాల్లోనూ ఇస్తాయని ఆశించలేం. కొన్నింటికే అది సాధ్యపడుతుంది. ఈ విభాగంలోని యాక్సిస్ బ్లూచిప్ పథకం మాత్రం లార్జ్‌క్యాప్ పథకాల విభాగం సగటు రాబడులతో పోల్చినా, సూచీలతో పోల్చి చూసినా రాబడుల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. పరిమిత రిస్క్, దీర్ఘకాలంలో (ఐదేళ్లకు మించి) అధిక రాబడులను కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. లార్జ్‌క్యాప్ కేటగిరీలో అధిక రాబడులను ఇచ్చిన పథకాల్లో ఇదీ ఒకటి.
రాబడులు..: దీర్ఘకాలంలో ఈ పథకం రాబడులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంలో మార్కెట్లో ఎన్నో అస్థిరతలు నెలకొన్న విషయం తెలిసిందే. గతేడాది సూచీల లాభాలు ఐదు శాతం లోపునకు పరిమితం అయ్యాయి. కానీ, యాక్సిస్ బ్లూచిప్ పథకం మాత్రం గడచిన ఏడాది కాలంలో 9.90 శాతం రాబడులను ఇవ్వడం గమనార్హం. మరి ఇదే సమయంలో రాబడులకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ 50 రాబడులు మాత్రం 3.99 శాతంగానే ఉన్నాయి. ఇక లార్జ్‌క్యాప్ ఫండ్స్ కేటగిరీ సగటు రాబడులు గత ఏడాది కాలంలో 0.88 శాతంగానే ఉన్నాయి. అంటే ఏ విధంగా చూసినా ఈ పథకం చక్కని పనితీరు చూపించినట్టు తెలుస్తోంది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక సగటు రాబడులు 15 శాతంగా ఉన్నాయి. అయితే మూడేళ్ల కాలంలో నిఫ్టీ 50 రాబడులు కూడా ఇంచుమించు 15 శాతం దగ్గర్లోనే 14.96 శాతంగా ఉండగా, లార్జ్‌క్యాప్ విభాగం రాబడులు 13.50 శాతమే ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిలోనూ యాక్సిస్ బ్లూచిప్ ప్రదర్శనే ముందుంది. వార్షికంగా 15.82 శాతం రాబడులను అందించింది. ఈ కాలంలో నిఫ్టీ 50 రాబడులు 14 శాతంగాను, ఈ విభాగం రాబడులు 13.90 శాతంగాను ఉన్నాయి.
నిర్వహణ విధానం
నూరు శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. కానీ, మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడుల కేటాయింపుల పరంగా మార్పులతో రాబడులను కాపాడే చర్యలను ఈ పథకం మేనేజర్లు చేయడాన్ని గమనించొచ్చు. ఇందుకు నిదర్శనం... ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలోని ఆస్తుల్లో ఈక్విటీల్లో పెట్టుబడులు 81.65 శాతంగానే ఉన్నాయి. 19 శాతానికి పైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడనే కాదు, మార్కెట్ల వ్యాల్యూషన్లు అధిక స్థాయిలకు చేరినప్పుడు, ప్రతికూల సమయాల్లోనూ ఈ విధమైన నిర్వహణ చర్యలే ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్‌లో ఎక్కువ కేటాయింపులు కలిగి ఉండటంతో అధిక రాబడులను తెచ్చుకోగలిగింది. ప్రస్తుతం ఈ మూడు స్టాక్స్‌లోనే 17 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది. ఇవే అని కాదు, ఈ పథకం నిర్వహణలోని చాలా స్టాక్స్ గతేడాది కాలంలో ర్యాలీ చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment