axis banks
-
యాక్సిస్ బ్యాంక్‌కు కేంద్రం గుడ్‌బై!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ప్రత్యేక విభాగం (ఎస్‌యూయూటీఐ) ద్వారా మిగిలిన 1.55% వాటాను ప్రభుత్వం విక్రయించనున్నట్లు యాక్సిస్ బ్యాంకు తాజాగా పేర్కొంది. మొత్తం 4,65,34,903 షేర్లను ప్రభుత్వం ఆఫర్ చేయనున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. తద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 4,000 కోట్లు లభించే వీలుంది. వెరసి యాక్సిస్ బ్యాంకు నుంచి ప్రభుత్వం పూర్తిగా వైదొలగనుంది. కాగా.. గతేడాది మే నెలలోనూ ప్రభుత్వం ఎస్‌యూయూటీఐ ద్వారా యాక్సిస్ బ్యాంకులో 1.95 శాతం వాటాను విక్రయించింది. ఈ వార్తల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు 4% పతనమై రూ. 841 వద్ద ముగిసింది. -
’కరెంటు అకౌంట్’ నిబంధనల మార్పు,ప్రైవేట్ బ్యాంకులకు ఊతం!
ముంబై: గత రెండేళ్లుగా ప్రైవేట్ రంగ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ తదితర బ్యాంకులు నగదు నిర్వహణ సేవల (సీఎంఎస్) విభాగంలో తమ వాటాను పెంచుకునేందుకు కరెంటు ఖాతాల నిబంధనల్లో మార్పులతో ఊతం లభించింది. 2020లో దేశీయంగా సీఎంఎస్‌లో వీటి వాటా 35 శాతంగా ఉండగా 2022లో ఇది 40 శాతానికి చేరింది. క్రిసిల్ రేటింగ్స్ నిర్వహించిన సర్వే నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. బ్యాంకులు–కార్పొరేట్ల మధ్య కనీస లావాదేవీల స్థాయిని నిర్దేశిస్తూ 2020లో ఆర్బీఐ సర్క్యులర్ విడుదల చేసింది. బడా బ్యాంకులకు తమ మార్కెట్ వాటాను పెంచుకునేందుకు దీనితో పాటు గత కొన్నేళ్లుగా అవి వినూత్న డిజిటల్ సర్వీసులు అందిస్తుండటం కూడా కొంత కారణమని క్రిసిల్ నివేదిక వివరించింది. 2020లో నిర్వహించిన సర్వేలో దేశీ సీఎంఎస్‌కు సంబంధించి 656 మంది, 2022లో 518 మంది పాల్గొన్నారు. బడా కార్పొరేట్ బ్యాంకింగ్ విషయంలో ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టాప్ ర్యాంక్ దక్కించుకోగా, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తర్వాత స్థానంలో ఉన్నాయి. మధ్య స్థాయి కార్పొరేట్ బ్యాంకింగ్‌లో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానంలోనూ, ఐసీఐసీఐ .. యాక్సిస్ బ్యాంకులు తర్వాత స్థానాల్లోనూ ఉన్నాయి. వ్యాపార వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు దేశీ కార్పొరేట్లు కొత్తగా పెట్టుబడులు పెట్టే క్రమంలో ఇటు వర్కింగ్ క్యాపిటల్‌ను, అటు ఆదాయవ్యయాల నిర్వహణపైనా మరింతగా దృష్టి పెడుతున్నట్లు సర్వే నివేదిక పేర్కొంది. -
వామ్మో! భారతీయుల వాడకం మామూలుగా లేదుగా, క్రెడిట్ కార్డ్‌లతో వేల కోట్ల!
దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారుల సంఖ్య రోజు రోజుకీ రాకెట్ వేగంతో పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా కారణంగా ఆన్లైన్ వినియోగం పెరగడం, అదే సమయంలో కొనుగోళ్లు సైతం ఊహించని స్థాయిలో ఉన్నట్లు తేలింది. ఆఫ్‌లైన్ కంటే ఆన్లైన్లోనే ఎక్కువ ఇటీవల ఇండియన్ సెంట్రల్ బ్యాంక్, ఆర్బీఐలు విడుదల చేసిన నివేదికలో పెద్దమొత్తంలో ఫ్యాన్సీ ప్రొడక్ట్‌లను క్రెడిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తున్నట్లు తేలింది. ఎంతలా అంటే మార్చి నెల నాటికి దేశీయ క్రెడిట్ కార్డ్ యూజర్లు యావరేజ్‌గా ఆఫ్‌లైన్‌లో స్వైప్ చేయడం కంటే ఆన్లైన్లో కొనుగోలు కోసం రెండు శాతం కంటే ఎక్కువగా స్పెండ్ చేస్తున్నారు. ఒక్క మార్చిలో 7.3 కోట్ల మంది క్రెడిట్ కార్డ్ హోల్డర్లు ఆన్లైన్ కొనుగోళ్లపై రూ. 68,327 కోట్లు ఖర్చు చేస్తే పీవోఎస్ మెషిన్లలో స్వైపింగ్ చేయడం ద్వారా ఖర్చు చేసింది రూ. 38,377 కోట్లు. పే లేటర్ నివేదిక ప్రకారం..సగటు క్రెడిట్ కార్డ్ లావాదేవీ విలువ రూ.9,600 కాగా, డెబిట్ కార్డ్‌ల విలువ కేవలం రూ. 3,900గా ఉంది. డెబిట్ కార్డ్‌లపై తక్కువ సమయాన్ని వెచ్చిస్తున్న యూజర్లు..క్రెడిట్ కార్డ్‌లపై 21 కంటే ఎక్కువ సార్లు టైమ్ స్పెండ్ చేస్తున్నారు. దీంతో యాజవరేజ్‌గా యూజర్లు క్రెడిట్ కార్డ్‌తో నెలకు రూ.14,500 కొనుగోళ్లు చేస్తుంటే..డెబిట్ కార్డ్‌పై కేవలం రూ.700 మాత్రమే ఖర్చు చేస్తున్నారు. -
యాక్సిస్, ఐడీబీఐ బ్యాంకులకు ఆర్బీఐ భారీ షాక్!
ముంబై: నిబంధనల ఉల్లంఘనలపై ప్రయివేట్ రంగ సంస్థలు యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లకు ఆర్బీఐ జరిమానాలు విధించింది. కేవైసీ సంబంధ మార్గదర్శకాలతోపాటు వివిధ నిబంధనలు పాటించకపోవడంతో యాక్సిస్ బ్యాంకుకు రూ. 93 లక్షల పెనాల్టీ విధించింది. ఈ బాటలో ఐడీబీఐ బ్యాంకును సైతం రూ. 90 లక్షల ఫైన్ కట్టమంటూ ఆదేశించింది. యాక్సిస్ బ్యాంక్ పొదుపు ఖాతాలలో కనీస నిల్వ అంశంలో చార్జీల విధింపు, కేవైసీ మార్గదర్శకాలు తదితరాలలో ఉల్లంఘనలు జరిగినట్లు ఆర్బీఐ పేర్కొంది. ఇక, మోసాల విషయంలో వాణిజ్య బ్యాంకులు, ఎంపిక చేసిన ఫైనాన్షియల్ సంస్థలు పాటించాల్సిన వర్గీకరణ, రిపోర్టింగ్ నిబంధనలను పాటించనందుకు గాను ఐడీబీఐ బ్యాంక్‌కు పెనాల్టీ విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. కార్పొరేట్ కస్టమర్లు, స్పాన్సర్ బ్యాంకుల మధ్య చెల్లింపుల వ్యవస్థ నియంత్రణను పటిష్టపరచడంలో మార్గదర్శకాల ఉల్లంఘన సైతం వీటిలో ఉన్నట్లు వివరించింది. -
యాక్సిస్ బ్యాంక్ లాభాల బాట..
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం మూడు రెట్లు జంప్ చేసి రూ. 3,973 కోట్లను తాకింది. ఇక స్టాండెలోన్ నికర లాభం సైతం ఇదే స్థాయిలో ఎగసి రూ. 3,614 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,116 కోట్లు మాత్రమే ఆర్జించింది. కాగా.. నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 17 శాతం పుంజుకుని రూ. 8,653 కోట్లకు చేరింది. ఫలితాల నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్ షేరు బీఎస్ఈలో 1.2 శాతం క్షీణించి రూ. 704 వద్ద ముగిసింది. -
సామాన్యుడి షాక్..క్యూ కట్టిన బ్యాంకులు..!
New Atm Withdrawal Charges From 2022: కొత్త ఏడాది నుంచి సామాన్యులపై చార్జీల మోత మోగించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. జనవరి 1 నుంచి ఎవరైతే ఏటీఎం సెంటర్ల నుంచి డబ్బులు డ్రా చేస్తారో వారి వద్ద నుంచి బ్యాంకులు అదనపు ఛార్జీల్ని వసూలు చేయనున్నాయి. ఇప్పటికే ఆర్బీఐ సైతం జనవరి 1నుంచి ఏటిఎం నగదు విత్ డ్రాకు సంబంధించిన కొత్త నిబందనలు అమలులోకి తెస్తున్నట్లు తెలిపింది. తాజా నిబంధనలు వచ్చే ఏడాది కొత్త సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. పలు నివేదికల ప్రకారం..నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని యాక్సిస్ బ్యాంక్ ఆర్బీఐ నిబంధనల్ని అమలు చేయనుంది. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్ హోల్డర్లు ఏటీఎం సెంటర్లలో ఐదు లావాదేవీలు దాటితే యాక్సిక్ బ్యాంక్ అదనపు ఛార్జీలను విధించనుంది. పరిమితి దాటితే ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనుంది. ఇప్పుడు యాక్సిక్ బ్యాంక్ బాటలో మరో ప్రైవేట్ బ్యాంక్ ఐసీఐసీఐ సైతం సేవింగ్ అకౌంట్ పై సర్వీస్ ఛార్జీలతో పాటు, ఏటీఎం నగదు లావా దేవీలలో పరిధి దాటితో ప్రతి ట్రాన్సాక్షన్‌పై రూ.20 ఎటీఎం చార్జీ వసూలు చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. మెట్రో నగరాల్లో నెలకు మూడుసార్లు, ఇతర నగరాల్లో ఐదుసార్లు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆర్బీఐ గైడ్‌లైన్స్ ప్రకారం వివిధ బ్యాంకుల ఖాతాదారులు తమ సొంత బ్యాంకుతోపాటు ఇతర బ్యాంకుల ఏటీఎంల వద్ద పరిమితికి మించి చేసే విత్డ్రాయల్స్పై చార్జీలు పెరుగనున్నాయి. చదవండి : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త..! -
రిస్క్ తక్కువ.. నాణ్యత ఎక్కువ
యాక్సిస్ షార్ట్‌టర్మ్ ఫండ్: వృద్ధికి మద్దతుగా నిలిచే లక్ష్యంతో ఆర్బీఐ ఎంపీసీ ఆగస్ట్ భేటీలో రెపో రేటులో ఎటువంటి మార్పులు చేయలేదు. అలాగే, సర్దుబాటు ధోరణినే కొనసాగించింది. లిక్విడిటీని సాధారణ స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో వేరియబుల్ రివర్స్ రెపో (వీఆర్ఆర్) మొత్తాన్ని పెంచింది. దీంతో భవిష్యత్తు వడ్డీ రేట్ల గమనంపై అనిశ్చితి కొనసాగనుంది. మోస్తరు రిస్క్ తీసుకుని, ఏడాది నుంచి మూడేళ్లపాటు ఇన్వెస్ట్ చేసుకునే వారు షార్ట్ డ్యురేషన్ (స్వల్ప కాల) ఫండ్స్‌ను పరిశీలించొచ్చు. ఈ పథకాలు డెట్, మనీ మార్కెట్ సాధనాలైన కార్పొరేట్ బాండ్లు, డిబెంచరర్లు, సర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్స్ (సీడీలు), ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తుంటాయి. 1–3 ఏళ్ల కాలంతో కూడిన సాధనాలను ఎంపిక చేసుకుంటాయి. ఈ విభాగంలో యాక్సిస్ షార్ట్‌టర్మ్ ఫండ్ మంచి పనితీరును చూపిస్తోంది. పనితీరు.. ఈ పథకాల రాబడుల్లో అస్థిరతలను గమనించొచ్చు. కానీ, రాబడులు అధికంగా ఉంటాయి. యాక్సిస్ షార్ట్ టర్మ్ పనితీరును గమనిస్తే స్థిరంగా కనిపిస్తుంది. వ్యాల్యూరీసెర్చ్ 4స్టార్ రేటింగ్ ఇచ్చిన పథకం ఇది. ఏడాది కాలంలో 8.9 శాతం, మూడేళ్లలో 8.5 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం ఇచ్చింది. ఐదేళ్లలో 7.52 శాతం, ఏడేళ్లలో 8 శాతం, 10 ఏళ్లలో 8.24 శాతం చొప్పున వార్షిక రాబడులు ఈ పథకంలో కనిపిస్తాయి. ఎఫ్డీ రాబడుల కంటే ఇవి మెరుగైనవే. ఈ పథకం నిర్వహణలో రూ.12,183 కోట్ల పెట్టుబడులున్నాయి. రిస్క్ విషయంలో సగటు కంటే తక్కువ విభాగంలో ఈ పథకం ఉంది. చదవండి: ప్రపంచ దేశాలకు భారత్ ఎగుమతులు, 75 రకాల ఉత్పత్తులు గుర్తింపు పోర్ట్‌ఫోలియో.. అధిక నాణ్యత, తక్కువ రిస్క్ అనే విధానాన్ని యాక్సిస్ షార్ట్ టర్మ్ ఫండ్ అనుసరిస్తుంది. ప్రస్తుతం ఏడాది కాలవ్యవధితో కూడిన కార్పొరేట్ బాండ్స్, మనీ మార్కెట్ సాధనాల్లో ఎక్కువగా పెట్టుబడులు పెట్టి ఉంది. అధిక రేటింగ్ కలిగిన దీర్ఘకాల కార్పొరేట్ బాండ్స్‌లోనూ కొంత పెట్టుబడులున్నాయి. పోర్ట్‌ఫోలియోలో ఉన్న స్వల్పకాల సాధనాలు.. సమీప కాలంలో వడ్డీ రేట్ల అస్థిరతలను అధిగమించేందుకు తోడ్పడతాయి. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని చూస్తే.. దీర్ఘకాలంతో కూడిన సాధనాల నుంచి మెరుగైన రాబడులను ఆశించొచ్చు. 2021 జూలై నాటికి పథకం పోర్ట్‌ఫోలియోలోని సాధనాల సగటు మెచ్యూరిటీ 2.90 సంవత్సరాలుగా ఉంది. విడిగా పరిశీలిస్తే.. 27 శాతం పెట్టుబడులు ఏడాది వరకు కాల వ్యవధి కలిగిన సాధనాల్లోనూ.. 39 శాతం పెట్టుబడులు 1–3 ఏళ్ల సాధనాల్లోనూ ఉన్నాయి. 3–5 ఏళ్ల కాలవ్యవధి సాధనాల్లో 11 శాతం, అంతకుమించిన కాలవ్యవధి కలిగిన డెట్ ఇన్స్ట్రుమెంట్లలో 14 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేసి ఉంది. పెట్టుబడులకు ఎంపిక చేసుకున్న సాధనాల నాణ్యతను పరిశీలించినట్టయితే.. ఏఏఏ రేటెడ్ పేపర్లలోనే 83 శాతం పెట్టుబడులను కలిగి ఉంది. ఏఏఏ అనేది అధిక నాణ్యతకు సూచిక. 9 శాతం పెట్టుబడులు ఏఏప్లస్ డెట్ పేపర్లలో ఉన్నాయి. -
బంగారం రుణాల్లోకి షావోమీ !
న్యూఢిల్లీ: చైనాకు చెందిన స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షావోమీ తాజాగా భారత్‌లో మరిన్ని విభాగాల్లోకి కార్యకలాపాలు విస్తరిస్తోంది. బంగారంపై రుణాలు, బీమా పాలసీలు, క్రెడిట్ లైన్ కార్డులు మొదలైన ఆర్థిక సేవలను పూర్తి స్థాయిలో అందించడంపై దృష్టి పెడుతోంది. యాక్సిస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, స్టాష్‌ఫిన్, మనీ వ్యూ, ఎర్లీ శాలరీ, క్రెడిట్ విద్య వంటి దేశీ సంస్థలతో కలిసి ఈ సర్వీసులు అందించనున్నట్లు షావోమీ భారత విభాగం హెడ్ మను జైన్ వెల్లడించారు. వచ్చే కొన్ని వారాల్లో బంగారంపై రుణాలను ఆవిష్కరించనున్నట్లు ఆయన తెలిపారు. రుణాలకు సంబంధించిన ’మి క్రెడిట్’ విభాగం ఇకపై 60 నెలల దాకా కాలావధితో రూ. 25 లక్షల దాకా (ఇప్పటిదాకా ఇది రూ. 1 లక్షకే పరిమితం) రుణాలను జారీ చేయనున్నట్లు జైన్ చెప్పారు. చదవండి: ఎస్బీఐ లైఫ్ నుంచి ఈషీల్డ్ నెక్ట్స్ పాలసీ -
రాబడులకు ఢోకా లేదు!
ఆర్బీఐ ఇటీవలి రేట్ల కోతతో వడ్డీ రేట్లు మళ్లీ తిరుగుముఖం పట్టాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంది. దీంతో తదుపరి ఆర్బీఐ ఎంపీసీ భేటీల్లో మరిన్ని రేట్ల కోతలు ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీంతో వడ్డీ రేట్ల పరంగా అనిశ్చితి నెలకొని ఉంది. ద్రవ్య, కరెంటు ఖాతా లోటు పరంగా ఒత్తిళ్లు నెలకొని ఉన్నాయి. కనుక ఈ పరిస్థితుల్లో దీర్ఘకాల వ్యవధితో కూడిన బాండ్లను ఎంచుకోవడం తొందరపాటే అవుతుంది. దీంతో మధ్యస్థ రిస్క్ తీసుకునే మీడియం డ్యురేషన్ ఫండ్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి. దీర్ఘకాల బాండ్లతో పోలిస్తే వడ్డీ రేట్ల మార్పులతో వీటిపై పడే ప్రభావం తక్కువ. కనుక మధ్య కాలానికి ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఇన్వెస్టర్ల ముందున్న మార్గాల్లో యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ కూడా ఒకటి. పెద్దగా రిస్క్ తీసుకోకుండా మెరుగైన రాబడులను ఇచ్చిన చరిత్ర ఈ పథకానికి ఉంది. సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యస్థీకరణకు ముందు వరకు ఈ పథకం యాకిŠస్స్ రెగ్యులర్ సేవింగ్స్ ఫండ్ పేరుతో కొనసాగింది. పెట్టుబడుల విధానం ఈ పథకం పెట్టుబడుల విషయంలో ఎక్కువ రిస్క్ తీసుకోదు. ఇందుకు నిదర్శనం పోర్ట్‌ఫోలియోలో ఉన్న బాండ్లలో ఎక్కువ భాగం అధిక భద్రతను సూచించే ఏఏఏ, ఏఏ రేటింగ్ ఉన్నవే. అలాగే, ఏ రేటింగ్ సాధనాలు కూడా ఉన్నాయి. పైగా ఇవన్నీ బడా కంపెనీలు జారీ చేసినవి కావడం గమనార్హం. మొత్తం మీద 80 శాతం పెట్టుబడులు ఏఏ అంతకంటే ఎక్కువ రేటింగ్ కలిగినవి. ఏ రేటింగ్ కలిగినవి 16 శాతంగా ఉన్నాయి. పోర్ట్‌ఫోలియోలోని పెట్టుబడుల కాల వ్యవధి సాధారణంగా రెండేళ్లు ఉంటుంది. కార్పొరేట్ డెట్, జీరో కూపన్ బాండ్లు, ప్రభుత్వ సెక్యూరిటీస్‌ల్లో పెట్టుబడులు ఉన్నాయి. రాబడులు గడిచిన ఐదేళ్ల కాలంలో యాక్సిస్ స్ట్రాటజిక్ బాండ్ ఫండ్ వార్షికంగా 9.4 శాతం చొప్పున రాబడులను ఇవ్వడం ఈ పథకం చక్కని పనితీరుకు నిదర్శనం. మూడేళ్ల కాలంలో చూసుకున్నా వార్షికంగా 8.8 శాతం మేర ఉన్నాయి. ఇక ఏడాది కాలంలో రాబడులు 7 శాతంగా ఉండడం గమనార్హం. ఈ విభాగం సగటు రాబడుల కంటే ఈ పథకంలోనే ఎక్కువ ఉన్నాయి. ఈ విభాగం సగటు రాబడులు ఏడాది కాలంలో 5.9 శాతంగా ఉండగా, మూడేళ్లలో 7.7 శాతం, ఐదేళ్లలో 8.4 శాతం చొప్పున ఉన్నాయి. ఈ కేటగిరీలోని అత్యుత్తమ పథకాల్లో ఇదీ ఒకటిగా ఉంది. హెచ్డీఎఫ్సీ మీడియం టర్మ్ డెట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మీడియం టర్మ్ బాండ్ పథకాల కంటే ఈ పథకమే ఎక్కువ రాబడులు ఇచ్చింది. బాండ్ ఫండ్స్ కావడంతో ఈ పథకాల్లో సిప్ మార్గం పెద్దగా పనిచేయదు. దీనికి బదులు ఏకమొత్తంలో నిర్ణీత కాలానికోసారి పెట్టుబడి పెట్టుకోవడం మంచిది. -
నేటి నుంచి యాక్సిస్ బ్యాంక్ ఓఎఫ్ఎస్
న్యూఢిల్లీ: యాక్సిస్ బ్యాంక్‌లో ఉన్న తన వాటాలో కొంత భాగాన్ని నేటి(మంగళవారం)నుంచి ప్రభు త్వం విక్రయిస్తోంది. ఎస్‌యూయూటీఐ(ద స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా)ద్వారా ఉన్న వాటాలో 3% వరకూ వాటాను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించనున్నది. ఇందులో భాగంగా 1.98% వాటాకు సమానమైన 5.07 కోట్ల ఈక్విటీ షేర్లను ఆఫర్ చేస్తోంది. దీంట్లో 10% వాటా షేర్లను రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. మరో 1.02% వాటాకు సమానమైన 2.63 కోట్ల ఈక్విటీ షేర్లను కూడా విక్రయించే అవకాశముంది. ఈ షేర్ల విక్రయానికి ఫ్లోర్ ధరగా రూ.689.52ను నిర్ణయించారు. ఇది సోమవారం ముగింపు ధర (రూ.710.35) కంటే 3% తక్కువ. వాటా విక్రయం సంస్థాగత ఇన్వెస్టర్లకు నేడు(మంగళవారం), రిటైల్ ఇన్వెస్టర్లకు బుధవారం జరుగుతుంది. -
లార్జ్‌క్యాప్ పథకాల్లో మేటి!
సూచీలు ముందుకే పయనిస్తున్నాయి. కానీ, అన్ని లార్జ్‌క్యాప్ పథకాలు సూచీలతో పోలిస్తే రాబడుల పరంగా షార్ప్‌గా ఉన్నాయంటే... అవునని చెప్పలేం. అన్ని పథకాలు సూచీలకు దీటుగా, సూచీలను మించి రాబడులను అన్ని సమయాల్లోనూ ఇస్తాయని ఆశించలేం. కొన్నింటికే అది సాధ్యపడుతుంది. ఈ విభాగంలోని యాక్సిస్ బ్లూచిప్ పథకం మాత్రం లార్జ్‌క్యాప్ పథకాల విభాగం సగటు రాబడులతో పోల్చినా, సూచీలతో పోల్చి చూసినా రాబడుల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. పరిమిత రిస్క్, దీర్ఘకాలంలో (ఐదేళ్లకు మించి) అధిక రాబడులను కోరుకునే వారు ఈ పథకాన్ని పరిశీలించొచ్చు. లార్జ్‌క్యాప్ కేటగిరీలో అధిక రాబడులను ఇచ్చిన పథకాల్లో ఇదీ ఒకటి. రాబడులు..: దీర్ఘకాలంలో ఈ పథకం రాబడులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా గత ఏడాది కాలంలో మార్కెట్లో ఎన్నో అస్థిరతలు నెలకొన్న విషయం తెలిసిందే. గతేడాది సూచీల లాభాలు ఐదు శాతం లోపునకు పరిమితం అయ్యాయి. కానీ, యాక్సిస్ బ్లూచిప్ పథకం మాత్రం గడచిన ఏడాది కాలంలో 9.90 శాతం రాబడులను ఇవ్వడం గమనార్హం. మరి ఇదే సమయంలో రాబడులకు ప్రామాణికంగా చూసే నిఫ్టీ 50 రాబడులు మాత్రం 3.99 శాతంగానే ఉన్నాయి. ఇక లార్జ్‌క్యాప్ ఫండ్స్ కేటగిరీ సగటు రాబడులు గత ఏడాది కాలంలో 0.88 శాతంగానే ఉన్నాయి. అంటే ఏ విధంగా చూసినా ఈ పథకం చక్కని పనితీరు చూపించినట్టు తెలుస్తోంది. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక సగటు రాబడులు 15 శాతంగా ఉన్నాయి. అయితే మూడేళ్ల కాలంలో నిఫ్టీ 50 రాబడులు కూడా ఇంచుమించు 15 శాతం దగ్గర్లోనే 14.96 శాతంగా ఉండగా, లార్జ్‌క్యాప్ విభాగం రాబడులు 13.50 శాతమే ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిలోనూ యాక్సిస్ బ్లూచిప్ ప్రదర్శనే ముందుంది. వార్షికంగా 15.82 శాతం రాబడులను అందించింది. ఈ కాలంలో నిఫ్టీ 50 రాబడులు 14 శాతంగాను, ఈ విభాగం రాబడులు 13.90 శాతంగాను ఉన్నాయి. నిర్వహణ విధానం నూరు శాతం లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్ చేసింది. కానీ, మార్కెట్ అస్థిరతల్లో పెట్టుబడుల కేటాయింపుల పరంగా మార్పులతో రాబడులను కాపాడే చర్యలను ఈ పథకం మేనేజర్లు చేయడాన్ని గమనించొచ్చు. ఇందుకు నిదర్శనం... ప్రస్తుతం ఈ పథకం నిర్వహణలోని ఆస్తుల్లో ఈక్విటీల్లో పెట్టుబడులు 81.65 శాతంగానే ఉన్నాయి. 19 శాతానికి పైన డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసింది. ఇప్పుడనే కాదు, మార్కెట్ల వ్యాల్యూషన్లు అధిక స్థాయిలకు చేరినప్పుడు, ప్రతికూల సమయాల్లోనూ ఈ విధమైన నిర్వహణ చర్యలే ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తున్నాయి. గత ఏడాది కాలంలో బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్, టీసీఎస్‌లో ఎక్కువ కేటాయింపులు కలిగి ఉండటంతో అధిక రాబడులను తెచ్చుకోగలిగింది. ప్రస్తుతం ఈ మూడు స్టాక్స్‌లోనే 17 శాతానికి పైగా పెట్టుబడులు కలిగి ఉంది. ఇవే అని కాదు, ఈ పథకం నిర్వహణలోని చాలా స్టాక్స్ గతేడాది కాలంలో ర్యాలీ చేయడం గమనార్హం. -
యాక్సిస్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రెట్టింపై రూ. 1,681 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది రూ. 726 కోట్లు. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 5,604 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 14,315 కోట్ల నుంచి రూ. 18,130 కోట్లకు ఎగిసినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. మరోవైపు, స్థూల మొండి బాకీలు (ఎన్పీఏ) 5.28 శాతం నుంచి 5.75 శాతానికి పెరిగాయి. అయితే, నికర ఎన్పీఏలు మాత్రం 2.56 శాతం నుంచి 2.36 శాతానికి తగ్గాయి. పరిమాణం పరంగా చూస్తే స్థూల ఎన్పీఏలు రూ. 25,001 కోట్ల నుంచి రూ. 30, 855 కోట్లకు పెరిగాయి. నికర ఎన్పీఏలు రూ. 11,769 కోట్ల నుంచి రూ. 12,233 కోట్లకు చేరాయి. క్యూ3లో రుణాల వృద్ధి 18 శాతం పెరగ్గా.. రిటైల్ రుణాల విభాగం 20 శాతం వృద్ధి చెందింది. మొత్తం రుణాల్లో రిటైల్ రుణాల వాటా 49 శాతంగా ఉన్నట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. -
యాక్సిస్ లాభం రెట్టింపు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రెట్టింపై రూ. 1,681 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది రూ. 726 కోట్లు. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 5,604 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 14,315 కోట్ల నుంచి రూ. 18,130 కోట్లకు ఎగిసినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. మరోవైపు, స్థూల మొండి బాకీలు (ఎన్పీఏ) 5.28 శాతం నుంచి 5.75 శాతానికి పెరిగాయి. అయితే, నికర ఎన్పీఏలు మాత్రం 2.56 శాతం నుంచి 2.36 శాతానికి తగ్గాయి. పరిమాణం పరంగా చూస్తే స్థూల ఎన్పీఏలు రూ. 25,001 కోట్ల నుంచి రూ. 30, 855 కోట్లకు పెరిగాయి. నికర ఎన్పీఏలు రూ. 11,769 కోట్ల నుంచి రూ. 12,233 కోట్లకు చేరాయి. క్యూ3లో రుణాల వృద్ధి 18 శాతం పెరగ్గా.. రిటైల్ రుణాల విభాగం 20 శాతం వృద్ధి చెందింది. మొత్తం రుణాల్లో రిటైల్ రుణాల వాటా 49 శాతంగా ఉన్నట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. -
ఐరిస్‌తో ఏటీఎం లావాదేవీలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మైక్రో ఏటీఎంల ద్వారా నగదు లావాదేవీ జరిపేందుకు ధ్రువీకరణ కోసం ఇప్పటి వరకు వేలి ముద్రను వాడేవారు. భారత్‌లో తొలిసారిగా యాక్సిస్ బ్యాంకు ఐరిస్ ధ్రువీకరణను పరిచయం చేసింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాతోపాటు మరో నాలుగు ప్రాంతాల్లో పైలట్ ప్రాజెక్టు కింద ఈ టెక్నాలజీని విజయవంతంగా నిర్వహిస్తోంది. యాక్సిస్ బ్యాంకు త్వరలో దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని అమలు చేయనుంది. వేలిముద్రలు సరిగా పడక లావాదేవీలు నిలిచిపోతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఇటువంటి సమస్యలకు ఈ టెక్నాలజీ చెక్ పెట్టనుంది. ప్రస్తుతం పైలట్ కింద 100కుపైగా ఐరిస్ ఆధారిత మైక్రో ఏటీఎంలను వినియోగిస్తున్నామని యాక్సిస్ బ్యాంకు రిటైల్ విభాగం ఈడీ రాజీవ్ ఆనంద్ తెలిపారు. దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ టెక్నాలజీని పరిచయం చేస్తామని చెప్పారు. ఈ ఏడాది 400 శాఖలు.. యాక్సిస్ బ్యాంకుకు దేశవ్యాప్తంగా 3,800ల శాఖలు ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 350–400 బ్రాంచీలను తెరువనున్నట్టు రాజీవ్ ఆనంద్ వెల్లడించారు. ‘ఏప్రిల్–జూన్‌లో దేశంలో నూతనంగా 76 కేంద్రాలను ప్రారంభించాం. తెలంగాణలో ఇప్పుడు 123 శాఖలున్నాయి. మార్చికల్లా మరో 17 రానున్నాయి. ఇక మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలు తొలి త్రైమాసికంలో రూ.71,444 కోట్లు నమోదు చేశాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 90 శాతం అధికం. డిజిటల్ లావాదేవీల వాటా 70 శాతంగా ఉంది. ఆటోమేషన్ కారణంగా వచ్చే 3–5 ఏళ్లలో బ్రాంచీల విస్తీర్ణం తగ్గుతుంది’ అని వివరించారు. -
స్టాక్స్ వ్యూ
యాక్సిస్ బ్యాంక్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: మోతిలాల్ ఓస్వాల్ ప్రస్తుత ధర: రూ.574 టార్గెట్ ధర: రూ.670 ఎందుకంటే: కొత్త తరం ప్రైవేట్ బ్యాంక్‌లకు సంబంధించి అతిపెద్ద బ్యాంక్‌ల్లో ఇది కూడా ఒకటి. ఈ ఏడాది మార్చి నాటికి 3,703 బ్రాంచ్‌లతో, 13,814 ఏటీఎమ్లతో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. యాక్సిస్ బ్యాంక్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయ వృద్ధి నిలకడగా ఉండటంతో నికర లాభం రూ.701 కోట్లకు పెరిగింది. రుణ నాణ్యత ఒకింత మెరుగుపడింది. నికర వడ్డీ ఆదాయం 12 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా 9 శాతం) వృద్ధితో రూ.5,170 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 13 బేసిస్ పాయింట్లు పెరిగి 3.46 శాతానికి చేరింది. కార్పొరేట్ ఫీజు ఆదాయం 24 శాతం తగ్గగా, రిటైల్ ఫీజు ఆదాయం 18 శాతం ఎగసింది. మొత్తం మీద ఫీజు ఆదాయ వృద్ధి 5 శాతంగా నమోదైంది. రిటైల్ రుణాలు 21 శాతం, ఎస్ఎమ్ఈ రుణాలు 19 శాతం పెరగడంతో 14 శాతం రుణ వృద్ధి సాధించింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ పరంగా డిపాజిట్లు 1 శాతం తగ్గగా, టర్మ్ డిపాజిట్లు 13 శాతం పెరిగాయి. స్థూల, నికర మొండి బకాయిలు సీక్వెన్షియల్‌గా తగ్గాయి. మార్చి క్వార్టర్లో 6.77 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ జూన్ క్వార్టర్లో 6.52 శాతానికి తగ్గాయి. అలాగే నికర మొండి బకాయిలు 3.4 శాతం నుంచి 3.09 శాతానికి తగ్గాయి. ప్రొవిజన్ కవరేజ్ రేషియో 83 శాతానికి ఎగసింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో అర్ధభాగం నుంచి రుణ వృద్ధి జోరుగా పెరగవచ్చని భావిస్తున్నాం. టైర్–1 మూలధనం 13.2 శాతంగా ఉండటంతో వృద్ధికి తగిన పెట్టుబడులు అందుబాటులో ఉన్నాయని చెప్పవచ్చు. ఇతర కార్పొరేట్ బ్యాంక్‌లతో పోల్చితే రుణ నాణ్యత మెరుగుపడటం, మార్జిన్లు బాగా వచ్చే రిటైల్ రుణాలపై బ్యాంక్ దృష్టి పెట్టటం సానుకూలాంశాలు. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ ప్రస్తుత ధర: రూ.965 టార్గెట్ ధర: రూ.1,155 ఎందుకంటే: హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలం ఆర్థిక ఫలితాలు సామాన్యంగా ఉన్నాయి. మెరుపులూ లేవు. అలాగని నిరాశాజనకంగానూ లేవు. అయితే డీల్స్ సాధించడం, భవిష్యత్తు ఆదాయ అంచనాలు ఆశావహంగా ఉన్నాయి. ఆదాయం 3 శాతం (క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన 9 శాతం) వృద్ధితో 205.5 కోట్ల డాలర్లకు పెరిగింది. పన్ను రేట్లు తక్కువగా ఉండటంతో సవరించిన నికర లాభం రూ.2,403 కోట్లకు చేరింది. ఈ క్యూ1లో అత్యధిక డీల్స్(27) సాధించింది. కంపెనీ చరిత్రలో అత్యధిక డీల్స్ సాధించిన క్వార్టర్ ఇదే. మరిన్ని భారీ డీల్స్ రానున్న క్వార్టర్లలో సాధించగలమని కంపెనీ ధీమాగా ఉంది. బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ) విభాగం మళ్లీ పుంజుకుంటోంది. డిజిటల్ విభాగం మంచి జోరు సాధించింది. హెల్త్‌కేర్, లైఫ్–సైన్సెస్, పబ్లిక్ సర్వీసెస్ విభాగాలు మినహా ఇతర విభాగాల పనితీరు అంతంతమాత్రంగానే ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 9.6 శాతం నుంచి 11.5 శాతం రేంజ్లో ఉండొచ్చని కంపెనీ అంచనా వేస్తోంది. రెండేళ్లలో ఆదాయం 10 శాతం, షేర్ వారీ ఆర్జన(ఈపీఎస్) 9 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా వేస్తున్నాం. ఇబిట్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 19.7 శాతంగా, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతంగా ఉండొచ్చని భావిస్తున్నాం. -
యాక్సిస్ బ్యాంక్ జూమ్!
న్యూఢిల్లీ: ప్రైవేట్ రంగ యాక్సిస్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూన్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 46 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ1లో రూ.1,306 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.701 కోట్లకు పరిమితమైందని యాక్సిస్ బ్యాంక్ తెలిపింది. మొండి బకాయిలు బాగా పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో క్షీణించిందని బ్యాంక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జైరామ్ శ్రీధరన్ చెప్పారు. అంతకు ముందటి క్వార్టర్ (గత ఆర్థిక సంవత్సరం క్యూ4)లో రూ.2,189 కోట్ల నికర నష్టాలు వచ్చాయని, ఈ క్వార్టర్‌తో మళ్లీ లాభాల బాట పట్టామని పేర్కొన్నారు. మొత్తం ఆదాయం మాత్రం రూ.14,052 కోట్ల నుంచి రూ.15,702 కోట్లకు ఎగసింది. 12 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం.... నికర వడ్డీ ఆదాయం రూ.4,616 కోట్ల నుంచి 12 శాతం వృద్ధితో రూ.5,167 కోట్లకు చేరిందని శ్రీధరన్ తెలిపారు. రిటైల్, ఎస్ఎమ్ఈ రుణాల జోరుతో రుణ వృద్ధి 14 శాతం పెరిగి రూ.6.53 లక్షల కోట్లకు పెరిగిందని తెలిపారు. నికర వడ్డీ మార్జిన్ 3.63 శాతం నుంచి 3.46 శాతానికి తగ్గిందని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నికర వడ్డీ మార్జిన్ ఇదే రేంజ్లో కొనసాగవచ్చని పేర్కొన్నారు. మొండి బాకీలు మరింతగా పెరుగుతాయ్.. కాగా ఈ బ్యాంక్ రుణ నాణ్యత మరింత క్షీణించింది. గత క్యూ1లో 5.03 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో 6.52 శాతానికి పెరిగాయి. అలాగే నికర మొండి బకాయిలు 2.30 శాతం నుంచి 3.09 శాతానికి చేరాయి. అంకెల పరంగా చూస్తే, స్థూల మొండి బకాయిలు రూ.22,031 కోట్ల నుంచి రూ.32,662 కోట్లకు, నికర మొండి బకాయిలు రూ.14,902 కోట్లకు చేరాయి. అయితే అంతకుముందటి క్వార్టర్లో స్థూల మొండి బకాయిలు 6.77 శాతంగా, నికర మొండి బకాయిలు 3.40 శాతంగా ఉన్నాయి. వచ్చే క్వార్టర్లో మొండి బకాయిలు ఒకింత పెరగవచ్చని, ఆ తర్వాత నుంచి సాధారణ స్థాయికి వస్తాయని శ్రీధరన్ వివరించారు. తాజా మొండి బకాయిలు 74 శాతం తగ్గి రూ.4,337 కోట్లకు చేరాయి. మొండి బకాయిలకు కేటాయింపులు రూ.2,342 కోట్ల నుంచి 43 శాతం పెరిగి రూ.3,33ళ8 కోట్లకు చేరాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, కేటాయింపులు 54 శాతం తగ్గాయి. అంతకు ముందటి క్వార్టర్లో మొండి బకాయిలకు కేటాయింపులు రూ.7,180 కోట్లకు పెరిగాయి. ఈ క్యూ1లో రికవరీలు, అప్గ్రేడ్లు రూ.2,917 కోట్లుగా ఉండగా, రూ.3,007 కోట్ల రుణాలను రద్దు చేశామని శ్రీధరన్ చెప్పారు. మార్కెట్ ముగిసిన తర్వాత ఫలితాలు వెలువడ్డాయి. ఫలితాలు బాగా ఉంటాయనే అంచనాలతో బీఎస్ఈలో యాక్సిస్ బ్యాంక్ షేర్ 2.6 శాతం లాభంతో రూ.568 వద్ద ముగిసింది. 12–13 శాతం రుణ వృద్ధి... ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, భారత్‌లో మాత్రం వృద్ధి జోరు కొనసాగుతోందని బ్యాంక్ సీఈఓ, ఎమ్డీ శిఖా శర్మ వ్యాఖ్యానించారు. భారత్‌లోని పెద్ద కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికలకు తుదిరూపుని ఇస్తున్నాయని, ఈ ఆర్థిక సంవత్సరంలో 12–13 శాతం రుణ వృద్ధిని సాధించగలమన్న ధీమాను ఆమె వ్యక్తం చేశారు. -
వాట్సాప్ లీక్‌లపై యాక్సిస్‌కు వార్నింగ్
న్యూఢిల్లీ: వాట్సాప్ లీకేజీ కేసులో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా యాక్సిస్ బ్యాంక్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్యాంక్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే విషయాలు లీక్ అయ్యాయని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని సెబీ పేర్కొంది. షేర్ల ధరలను ప్రభావితం చేసే సున్నిత సమాచారం అధికారికంగా వెల్లడి కాకుండానే బయటకు పొక్కిందన్న విషయమై మూడు నెలల్లోగా అంతర్గత విచారణ జరిపి ఆ తర్వాత ఏడు రోజుల్లో నివేదికను సమర్పించాలని యాక్సిస్ బ్యాంక్‌ను ఆదేశించింది. స్థూల మొండి బకాయిలు, నికర మొండి బకాయిలు, నికర వడ్డీ మార్జిన్, బకాయిల రద్దు, కాసా తదితర కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని గణించే కమిటీల్లో పాలు పంచుకున్న సభ్యులందరిపై కూడా దర్యాప్తు జరపాలని సెబీ కోరింది. భవిష్యత్తులో ఇలాంటి తరహా లీకేజ్‌లు జరగకుండా యాక్సిస్ బ్యాంక్ తన వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని సెబీ స్పష్టంచేసింది. ఈ లీక్‌లకు బాధ్యులైన వారిని గుర్తించి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. వాట్సాప్ లీక్ కేసులో సెబీ తొలి ఉత్తర్వు ఇది. -
ఆ కారు కొనాలంటే.. నోటు బాధలేదు!
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల ప్రభావం.. కారు అమ్మకాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపకూడదనే అభిప్రాయంతో హోండా కార్స్ ఇండియా కొనుగోలుదారుల కోసం బంపర్ ఆఫర్ తీసుకొచ్చింది. హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులతో జతకట్టిన హోండా కార్స్, కొనుగోలుదారులకు 100 శాతం రుణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు ప్రకటించింది. దీంతో కస్టమర్లు నోట్ల బాధ నుంచి తప్పించుకుని, కార్లను తేలికగా కొనుగోలు చేస్తారని హోండా కార్స్ తెలిపింది. రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కార్ల కొనుగోలు ప్రక్రియలో అతిపెద్ద అవాంతరంగా ఏర్పతుందని, నగదుతో కార్లను కొనుగోలు చేసే స్థాయి పడిపోతున్నట్టు అంచనావేస్తున్నట్టు హెచ్‌సీఐఎల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ తెలిపారు. కొనుగోలుదారులకు సౌకర్యవంతంగా, ఎక్స్‌షోరూం, ఆన్‌రోడ్ ఫండింగ్ డీల్స్‌లో 100 శాతం రుణ సౌకర్యాన్ని కల్పించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు హెచ్డీఎఫ్సీ, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంకులతో జతకట్టినట్టు చెప్పారు. కార్లను కొనుగోలు చేద్దామనుకున్న కస్టమర్లకు నోట్ల రద్దుతో ఏర్పడిన అసౌకర్యానికి ఈ దోస్తి బాగా సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది. వేతనదారులకు, స్వయం ఉపాధి వ్యక్తులకు ఈ డీల్ ఉపయోగకరంగా ఉంటుందని తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హోండా డీలర్‌షిప్స్‌లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, హెచ్‌సీఐఎల్ లైన్-అప్ అన్ని మోడల్స్‌కు ఈ రుణ సౌకర్యం కవర్ చేస్తుందన్నారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి ఎక్స్ షోరూం ధరల్లో 100 శాతం, ఆన్-రోడ్ ధరల్లో 90 శాతం స్పెషల్ రిటైల్ ఫైనాన్స్ ఆఫర్స్ ఉంటాయని, హెచ్డీఎఫ్సీ బ్యాంకు హోల్డర్స్‌కు అన్ని హోండా కార్ల ఆన్-రోడ్ ధరల్లో 100 శాతం లోన్ అందుబాటులో ఉంటున్నట్టు కంపెనీ తెలిపింది. అదేవిధంగా యాక్సిస్ బ్యాంకు కూడా రూ.25వేల కంటే ఎక్కువగా వేతనం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు, 7వ వేతన కమిషన్ కిందకు వచ్చే పెన్షన్ స్కీమ్ లబ్దిదారులకు రోడ్ ఫండింగ్‌లో 100 శాతం ఆఫర్ చేయనుంది. బ్రియో, జాజ్, అమేజ్, మొబిలియో, సిటీ, బీఆర్-వీ, సీఆర్-వీ రేంజ్ వెహికిల్స్‌ను విక్రయిస్తోంది.