![Warming to axis on Whats app leaks - Sakshi](/styles/webp/s3/article_images/2017/12/28/bank.jpg.webp?itok=GmmyTTP6)
న్యూఢిల్లీ: వాట్సాప్ లీకేజీ కేసులో మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ తాజాగా యాక్సిస్ బ్యాంక్‌కు ఆదేశాలు జారీ చేసింది. ఈ బ్యాంక్ తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే విషయాలు లీక్ అయ్యాయని తమ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని సెబీ పేర్కొంది. షేర్ల ధరలను ప్రభావితం చేసే సున్నిత సమాచారం అధికారికంగా వెల్లడి కాకుండానే బయటకు పొక్కిందన్న విషయమై మూడు నెలల్లోగా అంతర్గత విచారణ జరిపి ఆ తర్వాత ఏడు రోజుల్లో నివేదికను సమర్పించాలని యాక్సిస్ బ్యాంక్‌ను ఆదేశించింది.
స్థూల మొండి బకాయిలు, నికర మొండి బకాయిలు, నికర వడ్డీ మార్జిన్, బకాయిల రద్దు, కాసా తదితర కీలకమైన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని గణించే కమిటీల్లో పాలు పంచుకున్న సభ్యులందరిపై కూడా దర్యాప్తు జరపాలని సెబీ కోరింది. భవిష్యత్తులో ఇలాంటి తరహా లీకేజ్‌లు జరగకుండా యాక్సిస్ బ్యాంక్ తన వ్యవస్థలను పటిష్టం చేసుకోవాలని సెబీ స్పష్టంచేసింది. ఈ లీక్‌లకు బాధ్యులైన వారిని గుర్తించి చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది. వాట్సాప్ లీక్ కేసులో సెబీ తొలి ఉత్తర్వు ఇది.
Comments
Please login to add a commentAdd a comment