
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నికర లాభం రెట్టింపై రూ. 1,681 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది రూ. 726 కోట్లు. సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం 18 శాతం వృద్ధితో రూ. 5,604 కోట్లకు చేరింది. మొత్తం ఆదాయం రూ. 14,315 కోట్ల నుంచి రూ. 18,130 కోట్లకు ఎగిసినట్లు యాక్సిస్ బ్యాంక్ వెల్లడించింది. మరోవైపు, స్థూల మొండి బాకీలు (ఎన్‌పీఏ) 5.28 శాతం నుంచి 5.75 శాతానికి పెరిగాయి.
అయితే, నికర ఎన్‌పీఏలు మాత్రం 2.56 శాతం నుంచి 2.36 శాతానికి తగ్గాయి. పరిమాణం పరంగా చూస్తే స్థూల ఎన్‌పీఏలు రూ. 25,001 కోట్ల నుంచి రూ. 30, 855 కోట్లకు పెరిగాయి. నికర ఎన్‌పీఏలు రూ. 11,769 కోట్ల నుంచి రూ. 12,233 కోట్లకు చేరాయి. క్యూ3లో రుణాల వృద్ధి 18 శాతం పెరగ్గా.. రిటైల్ రుణాల విభాగం 20 శాతం వృద్ధి చెందింది. మొత్తం రుణాల్లో రిటైల్ రుణాల వాటా 49 శాతంగా ఉన్నట్లు యాక్సిస్ బ్యాంక్ తెలిపింది.