గతవారం బిజినెస్‌ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Feb 6 2017 2:18 AM | Last Updated on Tue, Sep 5 2017 2:58 AM

Last week Business

నియామకాలు

ఎన్‌ఎస్‌ఈ కొత్త చీఫ్‌ లిమాయే!
నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) కొత్త సీఈఓ, ఎండీగా విక్రమ్‌ లిమాయే ఎంపికయ్యారని సమాచారం. రెండు నెలల క్రితం అనూహ్యంగా ఎన్‌సీఈ సీఈఓ పదవి నుంచి వైదొలగిన చిత్రా రామకృష్ణన్‌ స్థానంలో ఐడీఎఫ్‌సీ చీఫ్‌గా పనిచేస్తున్న విక్రమ్‌ లిమాయే పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు. లిమాయే ఎంపికను అశోక్‌ చావ్లా అధ్యక్షతన గల ఎన్‌ఎస్‌ఈ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించిందని, త్వరలోనే అధికారికంగా వెల్లడిస్తుందని సమాచారం.

ప్రధాన ఆర్థిక సలహాదారుగా సన్యాల్‌
ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా సంజీవ్‌ సన్యాల్‌ నియమితులయ్యారు. ఆయన నియామకాన్ని అపాయింట్‌మెంట్స్‌ కమిటీ ఆఫ్‌ ద క్యాబినెట్‌(ఏసీసీ) ఆమోదించిందని ప్రభు త్వ ఉన్నతాధికారొకరు చెప్పారు. మూడేళ్ల పదవీ కాలానికి ఆయన వేతన స్కేలు రూ.67,000–79,000 అని పేర్కొన్నారు. సంజీవ్‌ సన్యాల్‌.. ఢిల్లీలోని శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్, ఆక్స్‌ఫర్డ్, సెయింట్‌ జాన్స్‌  కాలేజ్‌ల్లో విద్యనభ్యసించారు.

పార్లమెంట్‌లో 2017–18 బడ్జెట్‌...
ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బుధవారం పార్లమెంటులో 2017–18 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పథకాల వ్యయం రూ.9,45,078 కోట్లు. పథకాలు అమలుకాక ఇతర వ్యయాలు 12,01,657 కోట్లు. మొత్తం వ్యయం 21,46,735 కోట్లు. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో ‘డిజిటల్‌’ పెంపుపై దృష్టి, పేదల కోసం త్వరలో ఆధార్‌ అనుసంధానిత ‘ఆధార్‌ పే’, 2018 మే నాటికి దేశంలోని 100 శాతం గ్రామాలకు విద్యుత్‌ వంటి అంశాలు బడ్జెట్‌లో ఉన్నాయి.

ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌
ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ (ఐపీపీబీ) ప్రయోగాత్మకంగా సర్వీసులు ప్రారంభించింది. రాయ్‌పూర్, రాంచీల్లో సేవలు ఆరంభించినట్లు సంస్థ సీఈవో ఏపీ సింగ్‌ తెలిపారు. రూ. 25,000 దాకా డిపాజిట్లపై 4.5 శాతం, రూ. 25,000–రూ.50,000 దాకా 5 శాతం, అంతకుమించి రూ. 1,00,000 దాకా డిపాజిట్లపై 5.5 శాతం వడ్డీ రేటు ఇవ్వనున్నట్లు ఆయన వివరించారు. పేమెంట్స్‌ బ్యాంక్‌ పర్మిట్లు పొందిన వాటిలో ఐపీపీబీతో పాటు ఎయిర్‌టెల్, పేటీఎం కూడా ఉన్నాయి.

నోట్ల రద్దుతో వృద్ధి తగ్గుతుంది: ఆర్థిక సర్వే
ఈ ఏడాది వృద్ధి రేటుపై పెద్ద నోట్ల ప్రభావం ఉంటుందని బడ్జెట్‌ ముందటి ఆర్థిక సర్వే స్పష్టంగా తేల్చిచెప్పింది. ఆర్థిక వృద్ధి మందగించి ముందుగా అంచనా వేసినట్లుగా 7.1 శాతంగా కాకుండా 6.5 శాతానికే పరిమితం కావచ్చని సర్వే అంచనా వేసింది. అయితే... నోట్ల రద్దు, జీఎస్‌టీ అమలు వల్ల బోలెడన్ని సత్ఫలితాలు వస్తాయని, వీటన్నిటినీ పట్టుకుంటే వచ్చే ఏడాది వృద్ధి రేటు 7.5 శాతానికి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని సర్వే స్పష్టం చేసింది.  

అప్పు’డే రేటింగ్‌ పెంచలేం!
ఆర్థిక క్రమశిక్షణకు తాజా బడ్జెట్‌లో మోదీ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేసిందని గ్లోబల్‌ రేటింగ్‌ దిగ్గజం స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌(ఎస్‌అండ్‌పీ) వ్యాఖ్యానించింది. అయితే, కొండంత ప్రభుత్వ రుణ భారం, బలహీనంగా ఉన్న పన్ను ఆదాయాలు... రేటింగ్‌ పెంపుదలకు అడ్డంకిగా నిలుస్తున్నాయని పేర్కొంది.
డిసెంబర్‌లో మౌలికం 5.6% అప్‌

ఎనిమిది కీలక పరిశ్రమలతో కూడిన మౌలిక రంగం డిసెంబర్‌లో 5.6 శాతం వృద్ధి నమోదు చేసింది. బొగ్గు, ముడి చమురు, సహజవాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్‌ పరిశ్రమల మేళవింపైన కీలక మౌలిక రంగ సంస్థల వృద్ధి డిసెంబర్‌ 2015లో 2.6 శాతం. కాగా గతేడాది నవంబర్‌లో ఇది 4.9 శాతంగా ఉంది.

జనవరిలో జోరుగా వాహన విక్రయాలు
పెద్ద కరెన్సీ నోట్ల రద్దు కష్టాల నుంచి వాహన కంపెనీలు తేరుకుంటున్నాయి. ఈ  ఏడాది జనవరిలో వాహన విక్రయాలు జోరుగా ఉన్నాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, , టయోటా, నిస్సాన్‌ ఇండియా, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీలు అమ్మకాల్లో రెండంకెల వృద్ధిని  సాధించాయి.

బీఎస్‌ఈ షేర్ల లిస్టింగ్‌ మెరుపులు
నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్చంజ్‌(ఎన్‌ఎస్‌ఈ)లో బీఎస్‌ఈ షేర్లు శుక్రవారం లిస్టయ్యాయి. లిస్టింగ్‌లోనూ, ట్రేడింగ్‌లోనూ బీఎస్‌ఈ షేర్లు మెరుపులు మెరిపించాయి. ఆసియాలో అతి పురాతనమైన, 140 ఏళ్ల చరిత్ర గల బీఎస్‌ఈ షేర్ల ఇష్యూ ధర(రూ.806) తో పోల్చితే 35 శాతం ప్రీమియమ్‌తో రూ. 1,085 వద్ద ఎన్‌ఎస్‌ఈలో లిస్టయ్యాయి. ఇంట్రాడేలో 49 శాతం లాభంతో రూ.1,200 గరిష్ట స్థాయికి చేరిన బీఎస్‌ఈ షేర్‌ చివరకు 33 శాతం లాభంతో రూ.1,069 వద్ద ముగిసింది. కోటిన్నర షేర్లు ట్రేడయ్యాయి. సొంత ఎక్సే్చంజ్‌లో లిస్ట్‌ కావడానికి సెబీ నియమనిబంధనలు ఒప్పుకోనందున బీఎస్‌ఈ షేర్లు ఎన్‌ఎస్‌ఈలోనే లిస్టయ్యాయి. ఈ ఏడాది వచ్చిన తొలి ఐపీఓ ఇదే. అంతేకాకుండా దేశంలోని స్టాక్‌ ఎక్సేS్చంజ్‌ ఐపీఓ కూడా ఇదే.
టాటా సన్స్‌పై మిస్త్రీ పిటిషన్‌ తిరస్కృతి

టాటా సన్స్‌పై ఆ గ్రూప్‌ బహిష్కృత చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ దాఖలు చేసిన అప్పీలేట్‌ పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ తోసిపుచ్చింది. మిస్త్రీని బోర్డ్‌ డైరెక్టర్‌ బాధ్యతల నుంచి తొలగించడానికి  టాటా సన్స్‌ సోమవారం నిర్వహించతలపెట్టిన షేర్‌ హోల్డర్ల సమావేశాన్ని నిలుపుచేయాలని కోరుతూ ముంబై ఎన్‌సీఎల్‌టీని మిస్త్రీ కంపె నీలు రెండు ఆశ్రయించాయి. ఎన్‌సీఎల్‌టీ దీనిని తోసిపుచ్చడంతో  అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌లో మిస్త్రీ కంపెనీలు పిటిషన్‌ దాఖలు చేశాయి. ఇక్కడా ఆయనకు ప్రతికూల తీర్పు వెలువడింది.

డీల్స్‌..
త్వరలో ఒకటికానున్న
వొడాఫోన్, ఐడియా!

భారత్‌లో అతిపెద్ద టెలికం కంపెనీ ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది. బ్రిటన్‌కు చెందిన వొడాఫోన్, ఆదిత్య బిర్లా గ్రూప్‌ కంపెనీ ఐడియా సెల్యులర్‌ ఒక్కటవుతున్నాయి. చాన్నాళ్లుగా వినిపిస్తున్న ఊహాగానాలను నిజం చేస్తూ... ఐడియాతో విలీనం కోసం చర్చలు జరుగుతున్నాయని వొడాఫోన్‌ గ్రూప్‌ వెల్ల డించింది. పూర్తిగా షేర్ల రూపంలో జరిగే ఈ లావాదేవీ గనుక పూర్తి అయితే, దేశంలో ఎయిర్‌టెల్‌ తరువాత అతిపెద్ద టెలికం ఆపరేటర్‌గా ఇది అవతరిస్తుంది. రిలయన్స్‌ జియోతో టారిఫ్‌ల యుద్ధం పతాకస్థాయికి చేరిన నేపథ్యంలో దేశీ టెలికం రంగంలో స్థిరీకరణ (కన్సాలిడేషన్‌) ఊపందుకుంటుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement