గతవారం బిజినెస్‌ | Last week Business | Sakshi
Sakshi News home page

గతవారం బిజినెస్‌

Published Mon, Mar 13 2017 1:14 AM | Last Updated on Tue, Sep 5 2017 5:54 AM

గతవారం బిజినెస్‌

గతవారం బిజినెస్‌

కోలుకున్న పారిశ్రామికోత్పత్తి
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) 2017 జనవరిలో కోలుకుంది. 2016 జనవరితో పోలిస్తే 2017 జనవరిలో ఉత్పత్తి 2.7 శాతం పురోగతి సాధించింది. 2016 డిసెంబర్‌లో ఐఐపీ అసలు వృద్ధిలేకపోగా (2015 డిసెంబర్‌ ఉత్పత్తితో పోలిస్తే) 0.11 శాతం క్షీణత నమోదయ్యింది. పెద్ద నోట్ల రద్దు, నగదు లభ్యత సమస్యలు ఇందుకు ప్రధాన కారణంగా నిలిచాయి. కాగా 2016 జనవరిలో కూడా అసలు వృద్ధిలేకపోగా 1.6 శాతం క్షీణత నమోదయ్యింది.

‘ఉడాన్‌’కు ఊతం
చిన్న నగరాలు, పట్టణాల్లో విమాన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఉడాన్‌ ప్రాజెక్టుకు ఊతమిచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా సర్వీసులు లేని, సేవల సంఖ్య తక్కువగా ఉన్న దాదాపు 50 ఎయిర్‌పోర్టులు, ఎయిర్‌స్ట్రిప్‌లను సుమారు రూ. 4,500 కోట్లతో పునరుద్ధరించే ప్రాజెక్టుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  

  మార్కెట్‌లోకి చైనా కంపెనీ ‘ఐవోమి’!
చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ కంపెనీ ‘ఐవోమి’ అతిత్వరలో భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి అడుగుపెట్టనుంది. ఇది తన తొలి స్మార్ట్‌ఫోన్‌ ‘ఐవీ505’ను ఈ నెలలో మార్కెట్‌లోకి తీసుకురానుంది. దీని ధర రూ.3,999గా ఉంది. చౌక, మధ్య ధర శ్రేణిలోని స్మార్ట్‌ఫోన్లను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురావడంపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని కంపెనీ పేర్కొంది. ఈ కొత్త ఫోన్‌ జియో 4జీ సిమ్‌ కార్డును సపోర్ట్‌ చేస్తుందని తెలిపింది.

  కుబేరులు తగ్గారు.. సంపద పెరిగింది..
దేశంలోని కుబేరుల సంఖ్య తగ్గింది. హురుణ్‌ రిపోర్ట్‌ తాజాగా రూపొందించిన అత్యంత ధనవంతుల జాబితాలో 11 మంది స్థానం కోల్పోయారు. ఇక ఎప్పటిలాగే ముకేశ్‌ అంబానీ దేశంలోనే అత్యంత సంపన్నుడిగా రికార్డును కొనసాగిస్తున్నారు. ఈయన నికర సంపద విలువ 26 బిలియన్‌ డాలర్లుగా ఉంది. దేశంలో 1 బిలియన్‌ డాలర్లు/అంతకన్నా ఎక్కువగా నికర సంపద కలిగిన బిలియనీర్ల సంఖ్య 143 నుంచి 132కు తగ్గింది. కుబేరుల సంఖ్య తగ్గినా కూడా వీరి మొత్తం సంపద మాత్రం 16 శాతంమేర ఎగసింది. ఇక అంబానీ తర్వాత 14 బిలియన్‌ డాలర్ల సంపదతో ఎస్‌పీ హిందుజా రెండో స్థానంలో ఉన్నారు. సన్‌ఫార్మా ప్రమోటరు దిలీప్‌ సంఘ్వీ కూడా 14 బిలియన్‌ డాలర్ల సంపదతో మూడో స్థానంలో నిలిచారు.

  చక్కెర ఉత్పత్తి అంచనాల్లో మళ్లీ కోత
ఇండియన్‌ షుగర్‌ మిల్స్‌ అసోసియేషన్‌ (ఐఎస్‌ఎంఏ) తాజాగా చక్కెర ఉత్పత్తి అంచనాలను మళ్లీ తగ్గించింది. 2016–17 మార్కెటింగ్‌ సంవత్సరానికి సంబంధించి ఇలా ఉత్పత్తి అంచనాలను తగ్గించడం ఇది మూడవసారి. కరువు నేపథ్యంలో మహరాష్ట్ర, కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ వంటి రాష్ట్రాల్లో చెరకు సరఫరా తగ్గడం వల్లనే చక్కెర ఉత్పత్తి అంచనాల్లో కోత విధించామని ఐఎస్‌ఎంఏ పేర్కొంది. 2016–17 మార్కెటింగ్‌ సంవత్సరంలో చక్కెర ఉత్పత్తి 20.3 మిలియన్‌ టన్నులుగా ఉండొచ్చని అంచనా వేసింది. కాగా ఐఎస్‌ఎంఏ 2016–17లో చక్కెర ఉత్పత్తి 23.4 మిలియన్‌ టన్నులుగా ఉంటుందని మొదటిసారిగా అంచనా వేసింది. ఈ అంచనాలను తర్వాత 21.3 మిలియన్‌ టన్నులకు కుదించింది. తాజాగా ఇప్పుడు ఈ అంచనాలను కూడా 20.3 మిలియన్‌ టన్నులకు తగ్గించింది.

  చమురు ఉత్పత్తికి బూస్ట్‌
దేశీయంగా చమురు, గ్యాస్‌ ఉత్పత్తికి ఊతమిచ్చే దిశగా కేంద్రం కొత్త లైసెన్సింగ్‌ విధానాన్ని ప్రకటించింది. ఇకపై ఏడాదికి రెండు సార్లు ఓపెన్‌ ఎకరేజ్‌ లైసెన్సింగ్‌ విధానం (ఓఏఎల్‌పీ) కింద చమురు, గ్యాస్‌ బ్లాక్‌ల వేలం నిర్వహించనున్నట్లు కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. తొలి విడత వేలం ఈ ఏడాది జులైలో నిర్వహించనున్నట్లు ఇంధన పరిశ్రమ దిగ్గజాల సదస్సు సీఈఆర్‌ఏవీక్‌లో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. ఇప్పటిదాకా ఉన్న పాలసీ ప్రకారం లాభాల్లో వాటాల విధానం పాటిస్తుండగా..  ఓఏఎల్‌పీ కింద ఆదాయాల్లో వాటాల విధానం అమల్లోకి వస్తుంది. అలాగే, ఆపరేటర్లకు ధర, మార్కెటింగ్‌పరమైన స్వేచ్ఛ లభిస్తుంది.

  ఇక మార్కెట్లోకి బీఎస్‌–4 వాహనాలు
భారత్‌ స్టేజ్‌ ఫోర్‌ (బీఎస్‌–4) పర్యావరణ నిబంధనలకనుగుణంగా ఉండే వాహనాలను అందించడానికి వాహన పరిశ్రమ సిద్దంగా ఉందని సియామ్‌ పేర్కొంది. బీఎస్‌–4 పర్యావరణ నిబంధనలు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తున్న విషయం తెలిసిందే.  

  భారం భరించక తప్పదు: ఎస్‌బీఐ
అకౌంట్లలో కనీస బ్యాలెన్స్‌ నిర్వహించకపోతే జరిమానాలు విధించాలన్న నిర్ణయాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సమర్థించుకుంది. జన్‌ధన్‌ అకౌంట్ల నిర్వహణకు బ్యాంక్‌పై భారం పెరిగిపోతోందని, జరిమానాల విధింపు తప్పదని స్పష్టం చేసింది. అయితే జన్‌ధన్‌ అకౌంట్లకు సంబంధించి మాత్రం ఇటువంటి పెనాల్టీలు ఉండబోవని పేర్కొంది. జరిమానాల విధింపు అంశాన్ని పునఃపరిశీలించాలని కేంద్రం నుంచి ఎటువంటి సూచనలూ ఇంకా అందలేదనీ, వస్తే పరిశీలిస్తామని స్పష్టం చేసింది.

డీల్స్‌..
 దేశీ దిగ్గజ వాహన సంస్థ ‘టాటా మోటార్స్‌’ తాజాగా అదే రంగంలోని ఫోక్స్‌వ్యాగన్‌ గ్రూప్, స్కోడా కంపెనీలతో దీర్ఘకాలపు వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా మూడు సంస్థలు కలిసి సంయుక్తంగా ప్రొడక్టులను రూపొందించనున్నాయి. తొలి ఉత్పత్తిని 2019లో మార్కెట్‌లోకి తీసుకురావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని టాటా మోటార్స్‌ తెలిపింది.

కెనరా బ్యాంక్‌ తాజాగా తన అనుబంధ సంస్థ అయిన కెన్‌ ఫిన్‌ హోమ్స్‌లో 13.45 శాతం వాటాను సింగపూర్‌ జీఐసీకి రూ.758.8 కోట్లకు విక్రయించింది.

 ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐకి సైబర్‌ సెక్యూరిటీ సేవల సంస్థ ట్రెండ్‌ మైక్రో సర్వీసులు అందించనుంది. ఐదేళ్లకు పైగా ఈ టెక్నాలజీ కాంట్రాక్ట్‌ అమల్లో ఉంటుందని ట్రెండ్‌ మైక్రో తెలిపింది. దీని కింద దేశ, విదేశాల్లో ఎస్‌బీఐకి ఉన్న 26,000 పైగా శాఖల్లో వినియోగిస్తున్న సర్వర్లు, పీసీలు, ల్యాప్‌టాప్‌లను సైబర్‌ దాడుల నుంచి రక్షణ కల్పించనున్నట్లు వివరించింది.

ఐడీఎఫ్‌సీ ఎంఎఫ్‌లో నాటిక్సిస్‌ గ్లోబల్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌కు ఉన్న 25 శాతం వాటాను ఐడీఎఫ్‌సీ కొనుగోలు చేయనుంది. ఈ వాటాను తమ పూర్తి అనుబంధ సంస్థ ఐడీఎఫ్‌సీ ఫైనాన్షియల్‌ హోల్డింగ్‌ కంపెనీ కొనుగోలు చేయనున్నట్లు ఐడీఎఫ్‌సీ తెలిపింది. ఈ డీల్‌ విలువ రూ.244 కోట్లు.

డిజిటల్‌ చెల్లింపుల సంస్థ పేటీఎమ్‌లో 1 శాతం వాటాను రిలయన్స్‌ క్యాపిటల్‌ విక్రయించింది. ఈ వాటాను చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్‌కు రూ.275 కోట్లకు అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ క్యాపిటల్‌ విక్రయించిందని సమాచారం. ఈ వాటా విక్రయంతో రిలయన్స్‌ క్యాపిటల్‌కు భారీగా లాభాలు వచ్చాయి. ఈ 1 శాతం వాటాను గతంలో రిలయన్స్‌ క్యాపిటల్‌ రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ వాటాను రూ.275 కోట్లకు విక్రయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement